స్వచ్ఛందంగా 1110 మంది రక్తదానం

ABN , First Publish Date - 2020-02-20T08:39:49+05:30 IST

మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, దివంగత నేత పెతకంశెట్టి అప్పలనరసింహం 84వ జయంతి వేడుకలు గోపాలపట్నంలోని పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు నివాసంలో బుధవారం ఘనంగా జరిగాయి.

స్వచ్ఛందంగా 1110 మంది రక్తదానం

గోపాలపట్నం, ఫిబ్రవరి 19 : మాజీ  పార్లమెంట్‌ సభ్యుడు, దివంగత నేత పెతకంశెట్టి అప్పలనరసింహం 84వ జయంతి వేడుకలు  గోపాలపట్నంలోని పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు నివాసంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెతకంశెట్టి అప్పలనరసింహం మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని  ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ నందగోపన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నందగోపన్‌ మాట్లాడుతూ దివంగత నేత అప్పల నరసింహం పేరిట ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న తనయుడు గణబాబుకు అభినందనలు తెలిపారు. గణబాబు మాట్లాడుతూ తన తండ్రి అప్పలనరసింహం పేరిట ప్రతియేటా నిర్వహించే స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రారంభంలో 100 మందితో ఆరంభించిన ఈ బృహత్తర కార్యక్రమంలో నేడు 1110 మంది స్వచ్ఛదంగా రక్తదానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు, విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా పెతకంశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్‌, పల్లా శ్రీనివాస్‌, ఎల్‌జీ పాలిమర్స్‌ జీఎం దక్షిణామూర్తి, టీడీపీ నేతలు అయితంశెట్టి కోటేశ్వరరావు, దాడి వెంకటరమేష్‌, పెతకంశెట్టి శ్యామ్‌సుధాకర్‌, కేవీ బాలసుబ్రహ్మణ్యం, దాడి అప్పారావు, ఎన్‌.సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.


ఎన్టీఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ రికార్డు

ఎన్టీఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకూ 1110 మంది రక్తదానం చేసిన దాఖలాలు లేవు. కాగా బుధవారం జరిగిన రక్తదాన శిబిరంలో ప్రప్రథమంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి ఎన్టీఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌కు రికార్డు నమోదైనట్టు బ్లడ్‌ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. గత ఏడాది నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 900 మంది రక్తదానం చేయగా ఏడాది 1110 మంది రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు.

Updated Date - 2020-02-20T08:39:49+05:30 IST