బ్లీచింగ్‌ ఏదీ?

ABN , First Publish Date - 2020-04-01T19:56:45+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రజలంతా..

బ్లీచింగ్‌ ఏదీ?

(విజయనగరం-ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రజలంతా కంకణబద్ధులై ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణలో పరిసరాల శుభ్రత కీలకం. ఇందుకోసం మున్సిపాలిటీలు, పంచాయతీలు చర్యలు తీసుకుంటున్నాయి. రెండురోజుల కిందటి వరకు బ్లీచింగ్‌, సున్నం వీధుల్లో చల్లేవారు. ప్రస్తుతం నిల్వలు నిండుకున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా బ్లీచింగ్‌ చల్లుతున్నారు. మేజర్‌ పంచాయతీలు, మైనర్‌ పంచాయతీల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. మున్సిపాలిటీల పరిధిలో కూడా నిల్వలు నిండుకుంటున్నాయి. విజయనగరం మార్కెట్లో కొనుగోలు చేయాలన్నా లభ్యం కావటం లేదు.


సాధారణంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్‌, సున్నం చల్లేందుకు ప్రభుత్వమే నిల్వలను పంపిణీ చేస్తుంటుంది. ఈ సారి నిల్వలు పంపించడం తగ్గించారు. దీనికి తోడు లాక్‌డౌన్‌తో రవాణా సదుపాయాలు స్తంభించాయి. ప్రైవేట్‌ వర్తకులు కూడా వీటిని తీసుకురావటం లేదు. బ్లీచింగ్‌ను తయారు చేస్తున్న కంపెనీలు ఉత్పత్తులను తగ్గించాయి. కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వైరస్‌ భయంతో పనుల్లోకి ఎవరూ వెళ్లడం లేదు. ఇలా ఉత్పత్తి తగ్గటం.. రవాణా నిలిచిపోవడం.. ముందస్తు నిల్వలు సిద్ధం చేయక పోవటం.. తదితర కారణాలతో బ్లీచింగ్‌ దొరకడం లేదు. దీనివల్ల పారిశుధ్య కార్యక్రమాలు సరిగా సాగడం లేదు. 


తెప్పిస్తున్నాం

గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్‌, సున్నం నిల్వలు నిండుకున్న పరిస్థితిని ఇన్‌చార్జి డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా.. నిల్వలు రావాల్సి ఉందన్నారు. బీచింగ్‌ నిల్వలు పూర్తి కావస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. మన జిల్లాకు మూడు నెలలకు గాను 800 టన్నులు కావాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే మరికొన్ని పారిశుధ్య పనులకు వినియోగిస్తున్న లైమ్‌ వంటి వివిధ నిల్వల కోసం ప్రతిపాదన పెట్టామన్నారు. ఇండెంట్‌ వస్తే అన్ని గ్రామ పంచాయతీలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-04-01T19:56:45+05:30 IST