బ్లాస్టింగ్‌ భయం.. కొత్త భవనాల కోసం పేలుళ్లు.. పాత భవనాలపై బండరాళ్లు..!

ABN , First Publish Date - 2020-08-04T14:18:38+05:30 IST

మహానగరంలో భవన నిర్మాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అనుమతులిచ్చి చేతులు దులుపుకుంటోన్న జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా..?

బ్లాస్టింగ్‌ భయం.. కొత్త భవనాల కోసం పేలుళ్లు.. పాత భవనాలపై బండరాళ్లు..!

పక్కనున్న నిర్మాణాలపై ప్రభావం

బండరాళ్లు పడి ధ్వంసమవుతోన్న వైనం

బ్లాస్టింగ్‌తో న్యూసెన్స్‌ అంటున్న స్థానికులు

అయినా పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు

అనుమతి ఇచ్చి చేతులు దులుపుకుంటోన్న జీహెచ్‌ఎంసీ


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : మహానగరంలో భవన నిర్మాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అనుమతులిచ్చి చేతులు దులుపుకుంటోన్న జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా..? లేదా..? అన్నది పట్టించుకోవడం లేదు. మైనింగ్‌, పోలీస్‌ విభాగాలు, క్షేత్రస్థాయి అదే ధోరణి కనబరుస్తున్నాయి. ఉల్లంఘన విషయాన్ని పక్కన పెడితే పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులు పక్కన ఉన్న భవనాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి  ఘటనే జరిగింది. ఓ భవనం కోసం బండ రాయిని బ్లాస్ట్‌ చేయగా.. అది విరిగిపడి పక్కన నిర్మాణం దెబ్బతింది. దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. 


గ్రేటర్‌లో భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతినిస్తుంది. స్థల విస్తీర్ణం, భవనం ఎత్తు (అంతస్తులు)ను బట్టి సర్కిల్‌, జోనల్‌, ప్రధాన కార్యాలయంలో పర్మిషన్‌ ఇస్తారు. నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం పనులు జరుగుతున్నాయా..? లేదా..? అన్నది పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పరిశీలించాలి. ఫౌండేషన్‌ పనులు జరుగుతున్న సమయంలో వివిధ దశల్లో రెండు, మూడు పర్యాయాలు సైట్‌కు వెళ్లాలి. కానీ ఇవేవీ అధికారులు పట్టించుకోవడం లేదు. ‘పర్మిషన్‌ ఇచ్చాం.. మా పనైపోయింది’ అన్నట్టు వ్యవహరిస్తుండడంతో నిర్మాణదారులు ఇష్టానికి వ్యవహరిస్తున్నారు. ఇది ప్రమాదాలకు దారి తీస్తోంది. దుర్ఘటనలు జరిగితే ఒక్కోసారి అమాయక కూలీలు బలవుతుండగా.. కొన్ని సార్లు పక్కన ఉండే భవన యజమానులు నష్టపోతున్నారు. జూబ్లీహిల్స్‌ ఘటనలో తాజాగా ఇదే జరిగింది. గతంలో సెల్లార్‌ తవ్వకం వల్ల నిర్మాణంలో ఉన్న భవనం కూలి పలువురు మృతి చెందారు. పక్కన నిర్మాణమూ ఈ ఘటనలో దెబ్బతింది. 


నిబంధనలు ఏం చెబుతున్నాయి..? 

గ్రేటర్‌లో బహుళ అంతస్తుల నిర్మాణం జోరుగా సాగుతోంది. 20, 30 అంతస్తులతోపాటు రెండు, మూడు  సెల్లార్‌లూ తవ్వుతున్నారు. ఈ క్రమంలో కొండలు, బండలూ పిండి చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో జరుగుతోన్న మెజార్టీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాల కోసం అక్కడి గుట్టలను తొలుస్తున్నారు. రాళ్లను పిండి చేసే ప్రత్యేక యంత్రాలు వినియోగిస్తున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. సెల్లార్‌ల కోసం బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో సెల్లార్‌లు లేకున్నా.. బ్లాస్టింగ్‌/బండ రాళ్లను తొలగించాల్సిన పరిస్థితి. జీహెచ్‌ఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతి తీసుకున్న అనంతరం బండ రాళ్లను బ్లాస్టింగ్‌ చేసేందుకు నిర్మాణదారుడు మైనింగ్‌ శాఖ పర్మిషన్‌ తీసుకోవాలి. స్థానికులకు ఇబ్బంది (న్యూసెన్స్‌) కలగకుండా ఏ సమయంలో బ్లాస్టింగ్‌ చేయాలన్న దానికి సంబంధించి పోలీసుల అనుమతి అవసరం. ఈ రెండు విభాగాల అనుమతి తీసుకున్నాకే.. బ్లాస్టింగ్‌ ప్రారంభించాలి. మైనింగ్‌, పోలీస్‌ శాఖ పర్మిషన్‌తోనే బ్లాస్టింగ్‌ చేస్తున్నారా..? లేదా..? తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? అన్నది జీహెచ్‌ఎంసీ పరిశీలించాలి. 


ఆ విభాగాల అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌ చేసేందుకు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అనుమతించకూడదు. కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్‌ ఘటనలో దాదాపు 25 అడుగుల ఎత్తున్న బండరాయిని తొలగించే క్రమంలో బ్లాస్టింగ్‌తో రెండు భాగాలు విభజించారు. బండ కింద ఉన్న మట్టిని పొక్లెయినర్‌తో తొలగించడం... వరుస వానల నేపథ్యంలో సగం విడిపడిన బండరాయ పక్కన ఉన్న భవనంపై పడింది. ఆ భవనంలో ప్రహరీతోపాటు, మొదటి అంతస్తులోని ఓ గది ధ్వంసమైంది. బ్లాస్టింగ్‌ చేసేప్పుడు పేలుళ్ల ధాటికి బండ రాళ్లు పైకి ఎగరకుండా, పక్కన ఉన్న భవనాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్షం వల్లే పక్కన ఉన్న భవనం పాడైందని ఆ ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు. కొండాపూర్‌, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో బ్లాస్టింగ్‌ వల్ల తమ భవనాలు దెబ్బతింటున్నాయని, న్యూసెన్స్‌గా ఉందన్న ఫిర్యాదులు గతంలోనూ చోటు చేసుకున్నాయి. అయినా ఆయా విభాగాలు అంత సీరియ్‌సగా తీసుకోకపోవడం గమనార్హం. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టే వారంతా బడాబాబులు కావడం.. ఉన్నత స్థాయి ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాల వల్లే అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2020-08-04T14:18:38+05:30 IST