నల్ల మల.. మల

ABN , First Publish Date - 2022-04-06T06:14:19+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి.

నల్ల మల.. మల

 నీరులేక అలమటిస్తున్న వన్యప్రాణులు 

నమోదువుతున్న 43 డిగ్రీల ఉష్ణోగ్రత 

ప్రత్యామ్నాయ చర్యల్లో అటవీశాఖ


ఎండలు మండిపోతున్నాయి. నల్లమల మోడుబారిపోతోంది. వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. సజీవ జలధారల నెలవైన నల్లమలలో వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి.  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో అప్పుడే నల్లమలలో ఎండల ప్రభావం కనిపిస్తోంది. ఏం చేయాలో అటవీశాఖ అధికారులకు కూడా తెలియడం లేదు.  ప్రత్యామ్నాయంగా సాసర్‌పిట్స్‌ నిర్మాణాలు చేపట్టి వాటిని మొబైల్‌ ట్యాంకర్లతో నింపుతున్నారు. అయితే సాసర్‌పిట్‌లోని నీరు ఇంకిపోవడంతో, వేడెక్కిపోవడంతో  వన్యప్రాణుల దాహం తీరడం లేదు. 


-ఆత్మకూరు


నల్లమలలో 43 డిగ్రీల ఎండలు : నల్లమలలో  ఎన్నడూ లేనివిధంగా 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  చెట్లకు ఆకులన్నీ రాలిపోతున్నాయి. వన్యప్రాణులకు నీడ కరువైంది. ఆహారం, నీరు దొరకడం లేదు. నల్లమలలోని పెద్దపులి ఆవాసానికి కీలకమైన కోర్‌ ఏరియానే ఇట్లా ఉంది.  ఎండల  నుంచి వన్యప్రాణులను కాపాడటానికి  అటవీశాఖ కసరత్తు చేస్తున్నది. అయినా వన్యప్రాణుల మరణాలు ఆగడం లేదు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ, మహబుబూనగర్‌ జిల్లా పరిధిలో విస్తరించిన నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యమంతా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ మండుటెండల వల్ల  ఎన్‌ఎస్‌టీఆర్‌లోని వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. 


ఆత్మకూరు అటవీ డివిజన్‌లో ఐదు సోలార్‌ యూనిట్లు 


ఆత్మకూరు అటవీ డివిజన్‌లో వన్యప్రాణుల దాహం తీర్చడానికి  బైర్లూటి రేంజ్‌లోని రామయ్యకుంట, శ్రీశైలం రేంజ్‌లోని దామర్లకుంట, నరమామిడి చెరువు, పెచ్చెర్వు, ఆత్మకూరు రేంజ్‌లోని వీరాపురం డొంగు ప్రాంతాల్లో సోలార్‌ పంప్‌సెట్లను ఏర్పాటు చేశారు. 2012లో అప్పటి ఆత్మకూరు డీఎఫ్‌వోగా పనిచేసిన మహ్మద్‌ దివాన్‌మైదీన్‌ చొరవతో తొలిసారిగా పెచ్చెర్వు వద్ద సోలార్‌ వాటర్‌ పంప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో  మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేశారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కొద్ది సోలార్‌ పలకలు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరిగి మోటార్ల ద్వారా భూగర్భ జలాలతో కుంటలను నింపేందుకు ఏర్పాటు చేశారు 


దాహంతో గ్రామాల వైపు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు 


అడవిలో నీరు లేక వన్యప్రాణులు ఊళ్ల వైపు వెళ్తున్నాయి. వాటిలో కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. 

2011లో డోన్‌ మండలం చనుగొండ్ల గ్రామం వైపు వెళ్లిన చిరుతను గ్రామస్థులు రాళ్లతో కొట్టి చంపారు. 

2011లో ఆత్మకూరు మండలం సిద్ధ్దాపురం గ్రామ శివార్లలోకి వెళ్లిన పెద్దపులులు పాడిపశువులను చంపేశాయి. ఆ తర్వాత పులుల జాడే లేకుండా పోయింది. 

పలు మార్లు కేజీ రహదారిపై వివిధ జంతువులు వాహనాల కింద పడి చనిపోయాయి. 

2015 జూలైలో ఓ పెద్దపులి నాగలూటి గూడెం వద్దకు వచ్చి అస్వస్థతకు గురైంది. దాన్ని అధికారులు ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. 

2016 జనవరిలో ఓ ఎలుగుబంటి, మార్చి 13న మరో ఎలుగుబంటి నీరు లేక అస్వస్థతకు గురయ్యాయి. 

2016 ఫిబ్రవరిలో నంద్యాల డివిజన్‌లోని బాచిపల్లెతండా వద్ద ఓ ఎలుగుబంటి మృతిచెందింది. 

2016 మార్చిలో రుద్రవరం రేంజ్‌ పరిధిలో ఓ చిరుత నీరు లేక అస్వస్థతకు గురై మరణించింది.

2017 మార్చిలో బైర్లూటి రేంజ్‌ పరిధిలోని పీఏపురం బీట్‌లో ఓ ఎలుగుబంటి నీటి కోసం వెళ్లి వేటగాళ్ల  ఉచ్చులో చిక్కుకొని  రక్తస్రావమై మృతిచెందింది. 

2017 ఏప్రిల్‌ 21న కొత్తపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామంలోని ఓ ఇంట్లోకి ఎలుగుబంటి దాహంతో ప్రవేశించి నానా బీభత్సం సృష్టించింది. అధికారులు దాన్ని బంధించి అడవిలో వదిలేశారు. 

2017 డిసెంబర్‌ నెలలో వెలుగోడు శివారులోకి రెండు పెద్దపులుల ఆహారం కోసం వచ్చాయి. వాటిలో ఒకటి మృతిచెందగా, మరొకటి అస్వస్థతకు గురైంది. దాన్ని జూపార్కుకు తరలించారు. 

2019లో పాములపాడు మండలం బానుముక్కల సమీపంలోని ఎండిపోయిన ఓ బావిలో ఎలుగుబంటి కూనలతో కనిపించింది. ఎలుగుబంటి కూనలు అక్కడే మృతిచెందాయి. 

2021 మే 5వ తేదిన ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలోకి ఓ ఎలుగుబంటి నీటి కోసం వచ్చింది. 

ఇటీవల ఓ పెద్దపులి దాహంతో వెలుగోడు రిజర్వాయర్‌ పరిసరాల్లోకి వచ్చి అక్కడ సంచరిస్తున్న ఓ ఆవును హతమార్చింది. 


ఏం చేస్తే.. ఉపశమనం

నల్లమలలో ఎండ సోకకుండా చెట్ల కింద  సాసర్‌పిట్స్‌ ఏర్పాటు చేయాలి. నీటిఎద్దడి ఉన్న ప్రదేశాల్లో సోలార్‌ పంప్‌సెట్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి.  అక్కడక్కడ కుంటలు తవ్వి నీరు నిల్వ ఉండేలా చూడాలి. వంకల్లో పూడికతీసి  చెక్‌డ్యామ్‌ నిర్మిస్తే నల్లమలలో నీరు నిలువ ఉంటుంది.  వన్యప్రాణుల వైద్య నిపుణులను అందుబాటులో వుంచుకుని అడవుల్లో  పర్యటించి ఎండల వల్ల అనారోగ్యానికి గురయ్యే జంతువులకు  చికిత్సలు అందించాలి. 


 ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

నల్లమలలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే డివిజన్‌ పరిధిలోని 70 సాసర్‌పిట్స్‌ను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం.  మరిన్ని సోలార్‌పంపులను ఏర్పాటు చేస్తాం. నీటి కుంటల్లో పూడిక తీయిస్తాం.  సాసర్‌పిట్స్‌ను ఎప్పటికప్పుడు నీటితో నింపడానికి సంబంధించిన  మానిటరింగ్‌ చేస్తున్నాం. 

 

- అలాంగ్‌ చోంగ్‌ టెరాన్‌, ఆత్మకూరు డీఎఫ్‌వో

Updated Date - 2022-04-06T06:14:19+05:30 IST