తెలంగాణలో రెండు రోజుల్లోనే ఇంతమంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులా..!

ABN , First Publish Date - 2021-05-18T16:25:48+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌తో నోడల్‌ ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం

తెలంగాణలో రెండు రోజుల్లోనే ఇంతమంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులా..!

  • రెండ్రోజుల్లో 23 మంది బాధితులు
  • పరికరాల కోసం ఇండెంట్‌ పంపినట్లు తెలిపిన సూపరింటెండెంట్‌ 
  • ప్రస్తుతం 30 పడకల ఏర్పాటు
  • ఎండోస్కోపీ చికిత్సలు అవసరం

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌తో నోడల్‌ ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ ఆస్పత్రిగా ఏర్పాటు చేసి రెండు రోజులు గడవక ముందే దాదాపు 23 మంది రోగులు ఆస్పత్రిలో అడ్మిట్‌ కావడం గమనార్హం. ఆస్పత్రిలోని పాత భవనంలో మహిళా రోగుల కోసం ఆరు పడకలు, నూతన భవనంలో మగరోగుల కోసం 24 పడకలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు 8 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు రాగా సోమవారం మరో 16 మంది బాధితులు అడ్మిట్‌ అయ్యారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శంకర్‌  సోమవారం మీడియాతో మాట్లాడుతూ బ్లాక్‌ ఫంగ్‌సతో వచ్చిన వారికి చికిత్సలు ప్రారంభించామని చెప్పారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌తో 23 మంది ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. 


రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రోగులు వస్తున్నారని, అందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు పనులు ప్రారంభించామన్నారు. ముఖ్యంగా వీరికి ఎండోస్కోపీ చికిత్సలు చేయాల్సి ఉంటుందని, అందుకోసం ఆస్పత్రిలోని థియేటర్లలో ఐదు టేబుల్స్‌ను సిద్ధం చేశామని ఆయన వివరించారు. రెండు వెంటిలేటర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండగా మరో ఐదు అవసరమని, మైక్రో డివైడర్లు ఐదు, హెచ్‌డీ మానిటర్‌, పది ఎండోస్కోప్స్‌ అవసరం ఉన్నందున టీఎస్‌ఎంఎస్ఐడీసీకి ఇండెంట్‌ పింపించామన్నారు.


ఒక్కో రోగికి ఎండోస్కోపీ చేసేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని, ఇన్ఫెక్షన్‌ను క్లీన్‌ చేసేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాత్రి సమయంలో చికిత్సలు అందించేందుకు ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు ఎస్‌ఆర్‌లు మొత్తం ఐదు మంది వైద్య బృందం అందుబాటులో ఉంచామని రోగుల తాకిడిని బట్టి పడకల సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న మొత్తం 200 పడకలను బ్లాక్‌ ఫంగ్‌సతో వచ్చే వారికి కోసం ఏర్పాటు చేసేందుకు తాము సంసిద్దంగా ఉన్నామని, ఆక్సిజన్‌ సరఫరా కోసం డీ, బీ టైప్‌ సిలిండర్లను సైతం అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఏర్పాటు కోసం డీఆర్‌ఎఓ అధికారులు పర్యవేక్షించి వెళ్లారని, త్వరలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఏర్పాటు పనులు ప్రారంభమవుతామని అన్నారు. 


సరోజినికి బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

బ్లాక్‌ ఫంగస్‌ సోకి కళ్లపై ప్రభావం చూపుతున్న రోగులను మెహిదీపట్నంలోని సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రికి తరలిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి గ్రస్తులకు నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈఎంటీ, కోఠి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కన్ను వాయడం, కంటినొప్పి లాంటి లక్షణాలు ఉన్న 14 మందిని చికిత్స కోసం సరోజినిదేవి ఆస్పత్రికి తరలించారు. అత్యవసరమైతేనే ఆ వ్యాధి గ్రస్తులను ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. కంటి నొప్పితో పాటు ముఖం వాచిపోవడంతో వారం రోజులుగా 14 మందికి చికిత్స నిర్వహించారు.

Updated Date - 2021-05-18T16:25:48+05:30 IST