మళ్లీ బీజేపీ-శివసేన దోస్తీ?

ABN , First Publish Date - 2021-07-06T08:17:58+05:30 IST

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య మళ్లీ దోస్తీ కుదురుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.

మళ్లీ బీజేపీ-శివసేన దోస్తీ?

  • కేంద్ర కేబినెట్‌లోకి మాజీ సీఎం ఫడణవీస్‌!
  • మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వం


న్యూఢిల్లీ/ముంబయి, జూలై 5: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య మళ్లీ దోస్తీ కుదురుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేకు, బీజేఎల్పీ నేత, మాజీ సీఎం ఫడణవీ్‌సకు మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఫడణవీ్‌సకు ప్రధాని నరేంద్రమోదీ చోటు కల్పిస్తారని చెబుతున్నారు. అప్పుడు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఉద్ధవ్‌ ఠాక్రేను సీఎంగా కొనసాగిస్తారని, బీజేపీ నుంచి ఇద్దరికి ఉపముఖ్యమంత్రి పదవులు కల్పిస్తారని అంటున్నారు. వాస్తవానికి రెండు పార్టీల మధ్య 25 ఏళ్ల బంధం.. రాష్ట్రంలో అధికారం విషయంలోనే తెగిపోయిన సంగతి తెలిసిందే. అనంరం శివసేన.. కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుంచి బీజేపీ, శివసేన ఉప్పు-నిప్పులాగే వ్యవహరిస్తున్నాయి. అయితే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గత నెలలో ప్రధాని మోదీని కలుసుకోవడంతో మళ్లీ ఇరు పార్టీల మధ్య మైత్రి కుదురుతుందన్న వార్తలు వచ్చాయి. కానీ, ఫడణవీస్‌ దీనిని కొట్టిపారేస్తున్నారు. తాను రాష్ట్రంలోనే ఉంటానని.. తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీదేనని అన్నారు. ఇదిలా ఉండగా, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. బీజేపీ, శివసేనల మధ్య బంధాన్ని.. తాజాగా విడాకుల ప్రకటన చేసిన నటుడు ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావు దంపతులతో పోల్చారు.


12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ 

మహారాష్ట్రకు చెందిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ ఏడాదిపాటు సస్పెన్షన్‌ విధించింది. సభాపతి పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ (ప్రిసైడింగ్‌ అధికారి)గా వ్యవహరించిన భాస్కర్‌ జాదవ్‌తో ఆయన చాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని శాసనసభ వ్యవహారాల మంత్రి అనిల్‌ పారబ్‌ తెలిపారు. ఈ మేరకు 12 మంది సభ్యులను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్రంగా ఖండించారు. తమ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసి, సభలో తమ సంఖ్యాబలాన్ని తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2021-07-06T08:17:58+05:30 IST