బెంగాల్‌లో బీజేపీ వైఫల్యానికి కారణాలు ఏమిటంటే..?

ABN , First Publish Date - 2021-05-03T00:30:08+05:30 IST

బెంగాల్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ ఆశలకు ..

బెంగాల్‌లో బీజేపీ వైఫల్యానికి కారణాలు ఏమిటంటే..?

కోల్‌కతా: బెంగాల్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ ఆశలకు గండిపడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు అప్పగిస్తూ ఓటర్లు తీర్పునివ్వడం కమలనాథులకు అశనిపాతమైంది. గతంలో గెలిచిన 3 సీట్ల నుంచి 80కి పైగా సీట్లు గెలుచుకోవడం ద్వారా తొలిసారి ప్రధాన ప్రతిపక్షం హోదా అందిపుచ్చుకోనుండటం ఒక్కటే ఇప్పుడు ఆ పార్టీకి కొంతలో కొంత ఊరట.


మోదీ, షా ముందస్తు జోస్యం..

బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అందివచ్చిన ఓ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం సాగించారు. పశ్చిమబెంగాల్‌లోని బర్దమాన్‌లో ఏప్రిల్ 12న ప్రధాని ప్రచారం చేశారు. బీజేపీ విజయంపై ఎంతో ధీమాగా మాట్లాడారు. ''ఇంతవరకూ జరిగిన నాలుగు విడత ఎన్నికల్లో (మొత్తం ఎనిమిది విడతలు) తృణమూల్ కాంగ్రెస్‌ను బెంగాల్ నుంచి ఊడ్చేశారు. బీజేపీ సెంచరీ (100 సీట్లు) దాటేసింది'' అంటూ గెలుపుపై తమకున్న నమ్మకాన్ని బలంగా చాటారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు అమిత్‌షా మరింత ధీమా ప్రదర్శించారు. తొలి ఐదు విడతల్లో పోలింగ్ జరిగిన 180 సీట్లలో 122 సీట్లను బీజేపీ గెలిచేసిందంటూ అమిత్‌షా ప్రకటించారు. మమతకు ఓటమి తప్పదని, పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆమెకు వీడ్కోలు వేడుక సాధారణంగా ఉండకూడదని, చాలా గ్రాండ్‌గా ఉండాలని అన్నారు. బీజేపీకి 200కు పైగా సీట్లు కట్టబెడితేనే ఇది సాధ్యమని ఓటర్లను ఉత్తేజపరిచారు. అయితే ఇందుకు భిన్నంగా ఆదివారంనాడు కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి.


3 నుంచి 80కి పైగా...

పశ్చిమబెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికలతో (2016) పోల్చుకుంటే బీజేపీ 3 నుంచి 80కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో ఇంతవరకూ పెద్దగా ఉనికే లేదనుకున్న బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ఉనికిని చాటుకుంది. వామపక్షాలు, కాంగ్రెస్ ఉనికి కోల్పోయే దశకు చేరుకోగా, టీఎంసీకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలిచే అవకాశాలు పదిలమయ్యాయి.


ఊహించని దెబ్బ...

సుడిగాలి ప్రచారంతో నువ్వా-నేనా అంటూ దూసుకుపోయిన బీజేపీ హేమాహేమీలకు ఎన్నికల ఫలితాలతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అప్రతిహతంగా 200కు పైగా సీట్లు ఒంటిచేత్తో ఎగరేసుకుపోయింది. మెజారిటీ మార్క్‌ను అత్యంత సునాయాసంగా దాటేసి సత్తా చాటుకుంది. దీంతో ఓటమిని బీజేపీ అంగీకరించింది. అయితే శక్తిమేరకు ఎన్నికల్లో పోరాడామని, 2011, 2016 ఓటింగ్ షేర్‌తో పోలిస్తే పార్టీకి పడిన ఓటింగ్ షేర్ గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఆర్‌పీ సింగ్ పేర్కొన్నారు.


ఎక్కడ పొరపాటు జరిగింది?

పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసం బీజేపీ రెండేళ్ల క్రితం నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. ఎలాగైనా బెంగాల్‌ను పట్టుకోవాలని, పట్టు సాధించాలనే ఏకైక టార్గెట్‌తో కైలాష్ విజయవర్గీయ, శివప్రకాష్, అరవింద్ మీనన్ వంటి సీనియర్ నేతలను బెంగాల్‌ బాధ్యతలు అప్పగించింది. వీరికి తోడు రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఇతర బెంగాల్ నేతలు, బీజేపీ సభ్యులు సంస్థ పటిష్టత కోసం కాలికి బలపం కట్టుకుని మరీ రాష్ట్రమంతా చుట్టేశారు.


లెక్కకు మిక్కిలిగా ర్యాలీలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా పశ్చిమబెంగాల్‌లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. 50కి పైగా పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, రోడ్‌షోలలో అమిత్‌షా ప్రసంగించారు. ప్రధాని మోదీ 20కి ర్యాలీలు, వర్చువల్ ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంలో అగ్రనేతలుగా పేరున్న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం సాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 40కి పైగా ప్రచార సభల్లో పాల్గొని, ప్రసంగించారు. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంపీలు స్వపన్ దాస్ గుప్తా, లాకెట్ ఛటర్జీలను బరిలోకి దింపారు. ఒకప్పటి డాన్సింగ్ సూపర్‌స్టార్ మిధున్ చక్రవర్తిని కూడా చివరి నిమిషంలో ప్రచారంలోకి రప్పించారు.


సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సింది...

బీజేపీ ఆశలపై ఆదివారంనాటి ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లచడంతో ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్ నోట ప్రముఖంగా ఒక మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించి ఉండాల్సిందనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమయింది. నందిగ్రామ్‌లో గత మార్చిలో మమతా బెనర్జీ కాలికి గాయంకావడం, ఇది కుట్రేనంటూ టీఎంసీ అభివర్ణించడం కూడా ఆ పార్టీపై సానుకూల ప్రభావం చూపించిందనే అభిప్రాయమూ వ్యక్తమయింది.


బీహార్‌లో తరహాలోనే పశ్చిమబెంగాల్‌లోనూ  సైలెంట్ ఓటర్లపై బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుందని పేరు వెల్లడించడానికి నిరాకరించిన బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, ఆ తరహా సపోర్ట్‌ బెంగాల్‌లో కనిపించలేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీహార్‌లో బీజేపీ విజయంలో మహిళలు 'సైలెంట్ ఓటర్లు'గా నిలిచారు. ఫలితాలు బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బేనని మరో బీజేపీ నేత వ్యాఖ్యానించారు. 2016తో పోల్చుకుంటే తాము ఎక్కువ సీట్లే గెలుచుకున్నప్పటికీ, బెంగాల్‌లో బీజేపీ విజయానికి గత కొన్నేళ్లుగా పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నేతలకు ఇది ఎదురుదెబ్బేనని అన్నారు. పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా కేవలం మమతా బెనర్జీపైనే బీజేపీ పూర్తి దృష్టి కేంద్రీకరించడం కూడా సరైన ఫలితాలను పార్టీ రాబట్టలేకపోవడానికి మరో కారణమని ఆయన తెలిపారు.


'మమతా బెనర్జీ చాలా బలమైన, పోరాట నేత. ఆమెను ఎదుర్కోవాలంటే అందుకు తగిన బలమైన వ్యక్తి కావాలి. ప్రధాని మోదీ అన్నిసార్లూ పార్టీని ఆదుకోలేరు. రాష్ట్ర ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు తేడా ఉంటుంది' అని బీజేపీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ కాలికి తగిలిన గాయంపై నేతలు విమర్శలు చేయడం కూడా ఆమెపై సానుభూతి పెరగడానికి కారణమై ఉండొచ్చని మరొక నేత వ్యాఖ్యానించారు. టీఎంసీ నేతలు, లెఫ్ట్ నేతలను పార్టీలోకి చేర్చుకోవడంతో స్థానిక నేతలు అసంతృప్తికి గురయ్యారనే అభిప్రాయం కూడా కార్యకర్తల నుంచి వ్యక్తమైంది. కాగా, సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి కూడా బీజేపీకి పూర్తి సపోర్ట్ లభించినప్పటికీ, అధికారంలో ఉన్న టీఎంసీ సంస్థాగత బలానికి తాము సరితూగలేదనే అభిప్రాయాన్ని బీజేపీకి చెందిన మరికొందరు వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-03T00:30:08+05:30 IST