హైదరాబాద్: ఎన్నికలు జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని ఓటర్లను టీఆర్ఎస్ క్యాంపులకు తరలించింది. ఇప్పటికే ఓటర్లంతా క్యాంపుల్లో ఉన్నారు. అయినా టీఆర్ఎస్కు కొన్ని స్థానాలు కలవరం పెడుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలతో గులాబీ పార్టీలో గుబులు పట్టుకుంది.
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 12 లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి టీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆరు స్థానాల్లో ఎన్నిక అనివార్యమైంది. దాంతో చివరికి నల్గొండ, కరీంనగర్, అదిలాబాద్, ఖమ్మం, మెదక్ స్థానాలల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించి వారిని గోడ దాటకుండా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లంతా క్యాంపుల్లో ఉన్నా.. వారు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా? అన్న అనుమానం టీఆర్ఎస్లో స్పష్టంగా కనిపిస్తోంది.