కారు వర్సెస్‌ కమలం.. దూకుడు పెంచిన బీజేపీ

ABN , First Publish Date - 2020-07-13T21:05:35+05:30 IST

చాప కింద నీరులా.. జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని గత కొద్దిరోజుల నుంచి బీజేపీ కొనసాగిస్తున్న ఎదురుదాడి పర్వం దీనికి కారణమవుతోంది.

కారు వర్సెస్‌ కమలం.. దూకుడు పెంచిన బీజేపీ

ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో ఎదురుదాడి 

టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలతో జనం చేరువకు.. 

మంత్రి, ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఆరోపణలు 

కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం 

కేంద్ర పథకాల పేరిట ఇక పల్లెల్లో జోరుగా ప్రచారం 


నిర్మల్‌ (ఆంధ్రజ్యోతి): చాప కింద నీరులా.. జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని గత కొద్దిరోజుల నుంచి బీజేపీ కొనసాగిస్తున్న ఎదురుదాడి పర్వం దీనికి కారణమవుతోంది. ముఖ్యంగా ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో బీజేపీ కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, ఆ పార్టీ నాయకులు రావుల రాంనాథ్‌, అయ్యన్నగారి భూమయ్య, సామ రాజేశ్వర్‌ రెడ్డి, అంజు కుమార్‌ రెడ్డి, కొరిపల్లి శ్రావణ్‌ రెడ్డి, తదితరులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ జనానికి చేరువయ్యే ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను కేంద్ర బిందువుగా ఆరోపణలు, విమర్శనాస్ర్తాలతో జనం నాడిని పట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు స్పందన కూడా ఆశిస్తున్న మేరకు లభిస్తోందంటున్నారు. అయితే సోయం బాపురావు తనదైన శైలిలో టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నేతల తీరు ను ఎండగడుతున్నారు. 


సోయం బాపురావు ఓవైపు ఆదివాసీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూనే అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. వ్యూహత్మకంగా ఆయన అనుసరిస్తున్న వైఖరితో టీఆర్‌ఎస్‌ సైతం కొంత ప్రతికూలతను ఎదుర్కొంటోంది. మంత్రి, ఎమ్మెల్యేల వైఖరి, వారి వ్యాపార లావాదేవీలను సోయం టార్గెట్‌గా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మంత్రి అల్లోలతో పాటు ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌లపై సైతం ఆయన విమర్శనాస్ర్తాలు సంధిస్తూ కాషాయ దళంలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని పక్కకు నెట్టేసి టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దడమే ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారు. నిర్మల్‌ నియోజకవర్గం లో కాంగ్రెస్‌ పార్టీ కొంతమేరకు బలంగా ఉండడమే కాకుండా గట్టి నాయకత్వాన్ని కలిగి ఉంది. 


అయితే ముథోల్‌, ఖానాపూర్‌లలో మాత్రం ఆ పార్టీ పరిస్థి తి బలహీనంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సరియైున దిశా నిర్దేశం లభించక పోతుండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ సోయం జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ టీఆర్‌ఎస్‌పై, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను టార్గెట్‌గా చేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను పక్కదొవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సోయం ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సంక్షోభం దృష్ట్యా కేంద్రం ప్రధాని ఆత్మ నిర్భర్‌ పథకం ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా విడుదలవుతున్న నిధులపై కూడా సోయం వివరణ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను వక్రీకరించి ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తుందంటూ సోయం ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇలా వ్యూహత్మకంగా ఆయన అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని ముప్పేట దాడి కొనసాగించి బీజేపీలో కొత్త ఉత్సాహం నింపడమే టార్గెట్‌గా పెట్టుకున్నారంటున్నారు. సోయం దూకుడు కారణంగా నిర్మల్‌తో పాటు ముథోల్‌, ఖానాపూర్‌లలో కమలం క్రియాశీలకంగా రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 


మంత్రి, ఎమ్మెల్యేలపై ఆరోపణలే లక్ష్యంగా..

ఎంపీ సోయం బాపురావు బీజేపీలో కొత్త ఉత్సాహం నింపేందుకే ఆ పార్టీ కార్యకలాపాలను మరింత క్రియాశీలం చేసే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలను టార్గెట్‌గా పెట్టుకున్నారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలోని కొన్ని లోపాలను ఆయన మంత్రి, ఎమ్మెల్యేలకు అన్వయిస్తూ విమర్శలనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఆదివాసీ ఆందోళన కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే సోయం కాషాయదళాన్ని ముందుకు నడిపే ఎత్తుగడ లు అమలు చేస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే సోయం కాలికి గజ్జ కట్టిన చందంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. గత ఎంపీల వైఖరికి భిన్నంగా సోయం కనీసం పది రోజులకు ఒకసారైనా ఇక్కడి అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. సోయం పర్యటనలతో కార్యకర్తల్లో సైతం మనోధైర్యం పెంపొందుతోంది. అయితే ఆయన పట్టణ ప్రాం తాలకే పరిమితం కాకుండా మండల, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ అక్కడి కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. సోయం పర్యటనలకు సంబందించిన షెడ్యూల్‌ను ఒకరోజు ముందుగానే కార్యకర్తలకు తెలుపుతూ కేడర్‌ను కట్టడి చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడులు, ప్రలోభాల ప్రభావం ధరి చెరనివ్వకుండా ఆయన ఎత్తుగడలు అమలు చేస్తున్నారు.

 

ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకే..

జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ధీటైనా పక్షంగా బీజేపీని నిలపడమే సోయం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికార పార్టీకి సమీప ప్రత్యర్థిగా కొనసాగుతున్న నేపథ్యంలో సోయం దీనికి భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఒక్క నిర్మల్‌ నియోజకవర్గంలో మినహా ముథోల్‌, ఖానాపూర్‌ ని యోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉండడమే కాకుండా సరైన నాయకత్వం లేక రాజకీయంగా ఇబ్బందుల పాలవుతుందన్న అభిప్రాయాలున్నాయి. సోయం దీనిని పూర్తిగా అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి టీఆర్‌ఎస్‌కు సమీప ప్రత్యర్థిగా బీజేపీన తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం, కేడర్‌ కూడా ఉండడంతో ఆయన ఎక్కువగా ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు నింపే ప్రయతాలు చేస్తున్నప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుతో కొంతమేరకు ప్రతికూలత ఎదుర్కొవా ల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. సోయం మాత్రం పక్కా వ్యూహతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలోని లోపాలు, మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరిపై వస్తున్న విమర్శలను అనుకూలంగా మలుచుకుంటూ విమర్శనాస్ర్తాలు సంధించి జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నా లు సాగిస్తున్నారు. ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్న టాక్‌ జనంలో రావాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. నిర్మల్‌ నియోజకవర్గం లో మంత్రిని అలాగే ముథోల్‌, ఖానాపూర్‌లలో ఎమ్మెల్యేల కార్యకలాపాలను ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌంటర్‌గా బీజేపీతో అదే తరహా కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 


కేంద్ర పథకాల పేరిట ఇక పల్లెల్లో ప్రచారం

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అమలవుతోన్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదొవ పట్టిస్తోందంటూ ఎంపీ సోయం బాపురావు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర పథకాలను పల్లె వాసులందరికీ వివరించేందుకు ఆయన కార్యాచరణ రూపొందించారు. కేంద్ర సర్కారు ద్వారా ప్రస్తుతం 18 రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు వేల కోట్ల రూపాయలతో అమలవుతున్నాయని ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేస్తున్నారు. ఈ పథకాలన్నింటిపై ఇక నుంచి గ్రామస్థాయిలో బీజేపీ నాయకులు, కార్యకర్తల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పల్లె పల్లెకు కేంద్ర పథకాల పేరిట కర పత్రాలు, వాల్‌ పోస్టర్లు, పత్రిక సమావేశాల ద్వారా జనానికి వివరించనున్నారు. కేంద్ర పథకాలన్ని ఇక బీజేపీవేనంటూ ఆయన వివరించబోతున్నారు. మొత్తానికి  అధికార టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడే లక్ష్యంగా బీజేపీని సమాయత్తం చేసేందుకు ఎంపీ సోయం బాపురావు ఇటు పార్టీ నేతలను, అటు కార్యకర్తలను సమన్వయం చేస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

Updated Date - 2020-07-13T21:05:35+05:30 IST