విస్తరణే లక్ష్యంగా బీజేపీ

ABN , First Publish Date - 2020-10-01T10:41:49+05:30 IST

భారతీయ జనతా పార్టీ విస్తరణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో మరింత పట్టు పెంచుకునేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

విస్తరణే లక్ష్యంగా బీజేపీ

ఐదు జోన్లుగా కరీం’నగరం’

జోన్‌ అధ్యక్షుల నియామకం 

ఒకే నగర కమిటీ విధానానికి స్వస్తి 

త్వరలో కమిటీలు, మోర్చాల ఏర్పాటు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

భారతీయ జనతా పార్టీ విస్తరణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో మరింత పట్టు పెంచుకునేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కార్పొరేషన్లలో నగర కమిటీ విధానానికి స్వస్తి చెప్పి జోన్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఐదు జోన్లుగా విభజించి జోన్‌ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గమైన కరీంనగర్‌లో మరింత పట్టు సాధించి వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన సూచనలను అనుసరిస్తూ కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలోని 60 డివిజన్లను ఐదు జోన్లుగా విభజించారు. 12 డివిజన్లకు ఒక జోన్‌ చొప్పున కొత్తగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. నగరాన్ని ఈస్ట్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌, నార్త్‌ జోన్‌, సౌత్‌జోన్‌, సెంట్రల్‌ జోన్లుగా విభజించారు జోన్‌ కమిటీలకు అధ్యక్షులను ప్రకటించడం ద్వారా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షుడిగా 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ దుర్శేటి అనూప్‌కుమార్‌, ఈస్ట్‌ జోన్‌ అధ్యక్షుడిగా అవదూర్తి శ్రీనివాస్‌, వెస్ట్‌ జోన్‌ అధ్యక్షుడిగా నరహరి లక్ష్మారెడ్డి, నార్త్‌జోన్‌ అధ్యక్షుడిగా పాదం శివరాజ్‌, సౌతజోన్‌ అధ్యక్షుడిగా నాగసముద్రం ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ జిల్లా అద్యక్షుడు బాస సత్యనారాయణరావు ఉత్తర్వులు జారీ చేశారు.


త్వరలోనే కమిటీలలోని ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో కమిటీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు కార్యదర్శులు, ఒక కోశాధికారి, 16 మంది కార్యవర్గసభ్యులు ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నారు. అలాగే ఈ కమిటీలతోపాటు ప్రతి జోన్‌లో యువమోర్చా, మహిళా మోర్చా, దళిత, గిరిజన, మైనార్టీ, కిసాన్‌మోర్చా కమిటీలను అలాగే ఇతర వృత్తుల విభాగ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీ అనుసరిస్తున్న ఈ విధానంతో ఒక్కో జోన్‌లో 150 నుంచి 200 మందికి పదవులు లభించనున్నాయి. నగరం మొత్తం మీద 800 నుంచి 1000 మంది జోన్‌ కమిటీలు, అనుబంధ కమిటీలలో పదవులు పొందనున్నారు. కార్యకర్తల్లో పదవులు ఇవ్వడం ద్వారా నూతన ఉత్సాహాన్ని పెంపొందించడంతోపాటు వారి సేవలను ఆయా డివిజన్లలో వినియోగించుకొని పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్య వర్గాలు, యువత అనుకూలంగా ఉండడంతో వివిధ వర్గాలను కూడా సన్నిహితం చేసుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.


బూత్‌ వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకున్న బీజేపీ జోన్‌లవారి కమిటీలతో అందరిని సమన్వయపరుచుకొని ప్రతి ఓటరుకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీర్చడం ప్రభుత్వ పథకాలను వారికి చేరువగా తీసుకవెళ్ళడం, వారిని తమ ఓటరుగా మలుచుకోవడం లక్ష్యంగా జోన్ల విధానాన్ని ప్రారంభిస్తున్నది. మరో రెండున్నర, మూడు సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ అధినాయకత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్లు ఉండగా గత మున్సిపల్‌ ఎన్నికల్లో 53 డివిజన్లలో పోటీచేసి 15 డివిజన్లను గెలుచుకున్నది. తదనంతరం ఒక కార్పొరేటర్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇప్పుడు 14 డివిజన్లలో పార్టీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో దుర్శేటి అనూప్‌కుమార్‌ను సెంట్రల్‌ జోన్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు.


గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణంలో సాధించిన ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని,  అసెంబ్లీ నియోజకవర్గం ఒకటిగా ఉన్నా రెండుగా విభజించినా రెండింటిలోనూ పోటీ చేసి విజయం సాధించే లక్ష్యంగా బలోపేతం కావాలని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఈ జిల్లాకు చెందిన వారు కావడంతో ఇక్కడ గెలుపును పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. అందుకే దీనిపై రాబోయే రోజుల్లో మరింత దృష్టి సారిస్తారని చెబుతున్నారు. జిల్లా కమిటీ, నగర కమిటీ ఏర్పాటు విషయంలో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతున్నదని ఆరోపణలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్న దశలో రాష్ట్ర అధ్యక్షుడు వాటిని దూరం చేయడానికి కమిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఆమేరకే నగరాన్ని ఐదు జోన్లుగా నియమించి అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో కమిటీల ఏర్పాటు పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీలో క్వారంటైన్‌లో ఉండడంతో ఆయన వచ్చిన తర్వాత వారంరోజుల్లో జిల్లా కమిటీ ఏర్పాటు కూడా పూర్తవుతుందని అనుకుంటున్నారు.  

Updated Date - 2020-10-01T10:41:49+05:30 IST