మేము జోక్యం చేసుకోం..

ABN , First Publish Date - 2022-06-18T12:58:01+05:30 IST

అన్నాడీఎంకేలో తలెత్తిన విభేదాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, అందులో తాము జోక్యం చేసుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

మేము జోక్యం చేసుకోం..

                           - Bjp State President  అన్నామలై


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 17: అన్నాడీఎంకేలో తలెత్తిన విభేదాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, అందులో తాము జోక్యం చేసుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయంబత్తూర్‌ మసకాళిపాళయంలో అన్నామలై విలేఖరులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదన్నారు. బీజేపీ వ్యక్తుల పార్టీ కాదని, సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయాలుంటాయన్నారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారించడంపై ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అనవసర ఆందోళనలు చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన వారిని జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత 21 మంది బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అమలుచేస్తున్నట్లు రాష్ట్రంలో కూడా పోలీసు శాఖలో అగ్ని వీరుల నియామకాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖలో నిబంధనలు ఉల్లంఘించి పీజీఆర్‌ సంస్థలకు పలు ఒప్పందాలు అప్పగించారని, తమ వద్ద ఉన్న ఆధారాల నుంచి విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజి తప్పించుకొనే అవకాశమే లేదన్నారు. రాష్ట్రంలో అధికారం మారిన తొలిరోజే జైలుకెళ్లే తొలి మంత్రి ఆయనేనని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి నడుపుతున్న షిర్డీ ప్రైవేటు రైలులో ప్రయాణికులు తమకు అవసరమైన వసతులు పొందవచ్చని అన్నారు. అదే సమయంలో ఈ రైలులోనే ప్రయాణించాలని ఎవరిని ఒత్తిడి చేయడం లేదని, ప్రస్తుతం షిర్డీకి నడుపుతున్న రైల్వే శాఖ సాధారణ రైల్లోనూ ప్రయాణించవచ్చని అన్నామలై తెలిపారు. 

Updated Date - 2022-06-18T12:58:01+05:30 IST