బీజేపీ ఆస్తి రూ.4,847 కోట్లు

ABN , First Publish Date - 2022-01-29T08:38:53+05:30 IST

దేశంలో అత్యధిక ఆస్తులున్న రాజకీ య పార్టీల్లో పాలక బీజేపీ అగ్ర స్థానంలో నిలిచింది. సదరు పార్టీ ఆస్తుల విలువ రూ.4,847.78 కోట్లని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం..

బీజేపీ ఆస్తి రూ.4,847 కోట్లు

8 బీఎస్పీకి 698 కోట్లు.. కాంగ్రెస్‌కు రూ.588 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యధిక ఆస్తులున్న రాజకీ య పార్టీల్లో పాలక బీజేపీ అగ్ర స్థానంలో నిలిచింది. సదరు పార్టీ ఆస్తుల విలువ రూ.4,847.78 కోట్లని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌-ఏడీఆర్‌) వెల్లడించింది. దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ రూ.588.16 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలవడం విశేషం. రూ.698.33కోట్ల ఆస్తులతో బీఎస్పీ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. 2019-20లో 7 జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు, అప్పుల వివరాలతో క్రోడీకరించిన నివేదికను ఏడీఆర్‌ విడుదల చేసింది. సీపీఎంకు రూ.569.51 కోట్లు, టీఎంసీకి రూ.247.78 కోట్లు, సీపీఐకి రూ.29.78 కోట్లు, ఎన్సీపీకి రూ.8.2 కోట్ల ఆస్తులున్నాయి.


ఆస్తుల్లో టీఆర్‌ఎ్‌సకు సెకండ్‌ ప్లేస్‌.. అప్పుల్లో టీడీపీ టాప్‌ 

 ప్రాంతీయ పార్టీల్లో రూ.563.47 కోట్ల ఆస్తులతో ఎస్పీ తొలి స్థానంలో ఉండగా.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ రూ.301.47 కోట్లతో రెండో స్థానంలో ఉంది. 267.61 కోట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో, రూ.188.19 కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.185.9 కోట్లతో శివసేన ఐదో స్థానంలో ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రూ.143.6 కోట్ల విలువైన ఆస్తులతో ఏడో స్థానంలో ఉంది. వైసీపీకి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ.135 కోట్లు ఉన్నాయి. ఇతర ఆస్తులు రూ.7.56 కోట్లు, అప్పులు రూ.29 లక్షలు ఉన్నాయి. టీడీపీకి రూ.188.19 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అందులో బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో రూ.86.97 కోట్లు, ఫిక్స్‌డ్‌ ఆస్తుల రూపంలో రూ.79.74 కోట్లు, ఇతర ఆస్తులు రూ.8.17 కోట్లు. ప్రాంతీయ పార్టీల అప్పుల్లో టీడీపీ మొదటి స్థానంలో నిలిచింది. దానికి అత్యధికంగా రూ.30.34 కోట్ల అప్పు లున్నాయి. ఇందులో బ్యాంకు రుణాలే రూ.27.26 కోట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కు బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో రూ.256.01 కోట్లు, ఫిక్స్‌డ్‌ ఆస్తుల రూపం లో రూ. 1.27 కోట్లు, ఇతర ఆస్తులు రూ.21.68 కోట్లు. రుణాలు, అడ్వాన్సులు రూ.40 లక్షలు. ఆ పార్టీకి రూ.4.41 కోట్ల అప్పులున్నాయి.

Updated Date - 2022-01-29T08:38:53+05:30 IST