బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌కి బలవంతపు క్వారంటైన్!

ABN , First Publish Date - 2020-08-30T06:05:35+05:30 IST

కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను జార్ఖండ్ అధికారులు బలవంతంగా హోం క్వారంటైన్‌...

బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌కి బలవంతపు క్వారంటైన్!

గిరిధ్: కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను జార్ఖండ్ అధికారులు బలవంతంగా హోం క్వారంటైన్‌కు తరలించారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న మహరాజ్... శనివారం రాంఛీకి 200 కిలోమీటర్ల దూరంలోని గిరిధ్‌‌కు వచ్చారు. ధన్‌బాద్ మీదుగా ఉన్నావోలోని శాంతి భవన్ ఆశ్రమంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ధన్‌బాద్‌కు వచ్చి ఢిల్లీ వెళ్లాలని భావించారు. అయితే మార్గమధ్యంలో పిర్తాండ్ పోలీస్టేషన్ వద్ద జిల్లా అధికారులు ఆయనను అడ్డుకున్నారు. మళ్లీ శాంతి భవన్ ఆశ్రమానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచినట్టు డిప్యుటీ కమిషనర్ రాహుల్ సిన్హా వెల్లడించారు.


రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చిన వారికి 14 రోజుల పాటు క్వారంటైన్ విధించాలంటూ ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉన్నందునే ఆయనను క్వారంటైన్‌కు తరలించినట్టు డీసీ తెలిపారు. ‘‘ఆయన ఇక్కడికి వస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనను 14 రోజుల క్వారంటైన్‌కు తరలించాం...’’ అని సిన్హా తెలిపారు. అయితే ఎంపీ ఏదైనా మినహాయింపు కోరితే పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఈ యూపీ నేత జార్ఖండ్‌కి వచ్చి తిరిగి వెళ్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ముందుగానే జిల్లా సరిహద్దులు మూసివేసి, బారికేడ్లు పెట్టడం గమనార్హం. అయితే గిరిధ్‌లోని తన తల్లిని చూసేందుకు వస్తున్నట్టు తాను ముందుగానే సమాచారం ఇచ్చినట్టు మహరాజ్ పేర్కొనడం కొసమెరుపు. 

Updated Date - 2020-08-30T06:05:35+05:30 IST