ఐదేళ్లలో తప్పులు జరిగాయంటూ గుంజీలు తీసిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-02-24T00:00:45+05:30 IST

ఐదేళ్లలో తప్పులు జరిగాయంటూ గుంజీలు తీసిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ఐదేళ్లలో తప్పులు జరిగాయంటూ గుంజీలు తీసిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

లఖ్‌నవూ: ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ఏ పని చేయడానికైనా వెనుకాడరు. పదవిలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అహంకారం ప్రదర్శించారని ఆరోపణలు ఉన్న నేత అయినా.. ఎన్నికల మైదానంలో ఓటర్ల కాళ్లు పట్టుకుని బతిమాలుకోవడం సర్వసాధారణం. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమంలో గుంజీలు తీశారు. గుంజీలు తీస్తూ ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని, అందుకు క్షమించాలని కోరడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


రాష్ట్రంలోని రాబర్ట్‌గంజ్ ఎమ్మెల్యే భూపేష్ చోబే బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చోబే మాట్లాడుతుండగా పార్టీ కార్యకర్తలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతే, ఐదేళ్లలో తప్పులు జరిగాయని చెబుతూ చెవులు పట్టుకుని గుంజీలు తీయడం ప్రారంభించారు. నాలుగు గుంజీలు తీసిన తర్వాత సభా వేదికపై ఉన్న పార్టీ నేతలు కూర్చోవాలని లాగారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.


భూపేష్ చోబే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపు రాబర్ట్‌గంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ స్థానం నుంచి పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. కాగా, భూపేష్‌కు పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచి వర్గ పోరు తీవ్రమైంది. కొంత మంది పార్టీ కార్యకర్తలు ఐదేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉంటామని, చోబే ఉండగా తాము పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనబోమని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో భూపేష్ చెవులు పట్టుకుని గుంజీలు తీసి క్షమాపణలు చెప్పారు.

Updated Date - 2022-02-24T00:00:45+05:30 IST