రాజ్యసభ బరిలో 2 రాష్ట్రాల బీజేపీ నేతలు!

ABN , First Publish Date - 2020-02-20T20:48:41+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నుంచి రాజ్యసభకు ఒక్కరూ ఎన్నికయ్యే అవకాశం లేనప్పటికీ...

రాజ్యసభ బరిలో 2 రాష్ట్రాల బీజేపీ నేతలు!

ఇతర రాష్ట్రాల నుంచి సీట్ల కోసం ప్రయత్నాలు

న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నుంచి రాజ్యసభకు ఒక్కరూ ఎన్నికయ్యే అవకాశం లేనప్పటికీ... ఇతర రాష్ట్రాల నుంచి ఆ పార్టీ తరఫున రాజ్యసభ సీట్లు లభిస్తాయన్న విషయమై ఢిల్లీలో చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో చేరిన నేతల్లో ఒకరిద్దరికి బీజేపీ అధిష్ఠానం ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభకు పంపించొచ్చని భావిస్తున్నారు. తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు, మాజీ ఎంపి జితేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి  దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు నేతల పేర్లపై చర్చ జరుగుతోంది. వీరుకాక ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌రావులను కూడా రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలో మద్దతునిచ్చిన గరికపాటి మోహనరావు, తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కాకపోతే రాజ్యసభ సీటిస్తారని ఆశిస్తున్న జితేందర్‌రెడ్డి, తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి మారిస్తే రా జ్యసభ సభ్యత్వం దొరుకుతుందన్న ఆశాభావంతో ఉన్న లక్ష్మణ్‌, కన్నా లక్ష్మీనారాయణతో పాటు పార్టీ మారిన నేతల గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి బయటి రాష్ట్రాల నేతలను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని, ఒక్క యూపీలోనే పది సీట్లు ఖాళీ అవుతున్నాయని ఈ వర్గాలు చెప్పాయి. గతంలో జీవీఎల్‌  నరసింహారావును యూపీ నుంచి, నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి ఎన్నిక చేసినట్లే తెలుగు రాష్ట్రాల నేతలనూ ఎక్కడో ఒక చోటి నుంచి రాజ్యసభకు ఎంపిక చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నేతలను ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన రాజకీయ అవసరం ఏమున్నదని, బయటి పార్టీ నుంచి వచ్చి న వారికి కాకుండా బీజేపీకి  చాలా కాలంగా సేవలందిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోవాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-02-20T20:48:41+05:30 IST