- బీజేపీ నేత అన్నామలై
చెన్నై: తమిళ స్వాతంత్య్ర సమరయోధుల ప్రతిమలున్న రిపబ్లిక్ డే శకటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ఢిల్లీలో జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులు వావు చిదంబరం, వేలునాచ్చియార్, భారతియార్, మరుదుసోదరుల ప్రతిమలతో రూపొందించిన శకటానికి కేంద్ర ప్రభుత్వం చివరి క్షణంలో అనుమతి నిరాకరించింది. దీంతో ఆ శకటాన్ని చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఊరేగిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లో ఆ శకటాన్ని ఊరేగిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నామలై చెన్నైలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమిళ స్వాతంత్య్ర సమరయోధులున్న రిపబ్లిక్ డే శకటాన్ని రాష్ట్రమంతటా ఊరేగించటాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఆ శకటం ఊరేగింపునకు తమ పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని, రాష్ట్ర ప్రజలంతా ఆ శకటానికి ఘనస్వాగతం పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్ నివాసాలపై ఏసీబీ దాడులను ‘ఇది డీఎంకే ప్రభుత్వపు జనవరి నెల కోటా’గా ఆయన అభివర్ణించారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైన ప్రత్యర్థులపై ఎలాంటి ఆరోపణలైనా చేసి కేసులు నమోదు చేయవచ్చని, అయితే ఆ నేరారోపణలు న్యాయస్థానంలో రుజువు చేయాల్సిన అవసరం ఉందని అన్నామలై స్పష్టం చేశారు. నగరపాలక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా చురుకుగా సాగుతోందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి