Abn logo
Jun 22 2021 @ 01:18AM

బీజేపీ పోరు సన్నాహాలు

- ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి 

- సహ బాధ్యులుగా చంద్రశేఖర్‌, ఎండల లక్ష్మీనారాయణ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఈటల రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బాధ్యతలను భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి అప్పగించింది. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణాలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చేది తామేనని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తున్నది. అందుకోసం హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా త్వరలో ప్రచార వ్యూహం రూపొందించుకొని ముందుకు సాగాలని ఆ పార్టీ నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గంలో బలాబలాలు, అధికార పార్టీ బలం, బలహీనతలు, కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులను సమీక్షించుకున్నట్లు తెలిసింది. ఇప్పటి పరిస్థితిని ఇలాగే నిలుపుకుంటే గెలుపు ఖాయమనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లోని అసలైన ఉద్యమకారులందరూ ఒకరొకరుగా బీజేపీలో చేరుతున్నారని, ఉద్యమకారులను పక్కనబెట్టి ద్రోహులకు పెద్దపీట వేస్తూ కేసీఆర్‌ అరాచక పాలన చేస్తున్నారని ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పార్లమెంట్‌లో సుస్మాస్వరాజ్‌ నేతృత్వంలో మద్దతు ఇచ్చి చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల వల్ల వెల్లడవుతున్నది.

- దుబ్బాక తరహా వ్యూహ రచన

 హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దుబ్బాక ఉప ఎన్నికల మాదిరిగా పకడ్బందీ వ్యూహరచనతో ముందుకు సాగాలని కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు సమాచారం. దుబ్బాక ఎన్నికల బాధ్యతలను నిర్వహించిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికే హుజురాబాద్‌ ఉప ఎన్నికల బాధ్యతను అప్పజెప్పారు. ఆయనను ఇన్‌చార్జిగా,  మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్‌, మాజీ శాసనసభ్యుడు ఎండల లక్ష్మీనారాయణను సహ ఇన్‌చార్జీలుగా పార్టీ నియమించింది. వీరంతా హుజురాబాద్‌లోనే మకాం వేసి అధికార పార్టీకి దీటుగా ప్రచార వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి ఇప్పటికే మండలాల వారిగా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇతర ముఖ్యనాయకులను రంగంలోకి దింపింది. గ్రామాలవారిగా, మండలాలవారిగా సమావేశాలు నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు ఈటల వైపు వెళ్ళకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. 

 త్వరలో పాదయాత్ర

అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు పాదయాత్ర నిర్వహించాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి ప్రచార వ్యూహాన్ని ఒకటిరెండు రోజుల్లో రాష్ట్ర నాయకత్వం ఖరారు చేస్తుందని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, ఈటల రాజేందర్‌తో కలిసి మూడు రోజుల క్రితం బీజేపీ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ,మండలశాఖల బాధ్యులతో హుజురాబాద్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంజయ్‌తోపాటు అభ్యర్థిగా తలపడనున్న ఈటల రాజేందర్‌, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మార్గదర్శనం చేశారు. ఈటల రాజేందర్‌, గంగాడి కృష్ణారెడ్డి మరుసటి రోజు టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి ఈటలకు మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు, ముఖ్యనాయకులతో మరో సమావేశాన్ని నిర్వహించారు. అటు ఈటల మద్దతుదారులు, ఇటు బీజేపీ నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన సంజయ్‌, ఈటల, గంగాడి కృష్ణారెడ్డి త్వరలోనే ఉమ్మడి సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరిని కార్యక్షేత్రంలోకి పంపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాల్లో నిర్వహించిన ర్యాలీ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీనిని జాగ్రత్తగా గమనించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఒకటిరెండు రోజుల్లో మళ్లీ నియోజకవర్గంలో ముఖ్యనేతల పర్యటనలను ఖరారుచేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఉండడంతో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. వారు మళ్లీ మంగళవారం హుజూరాబాద్‌కు వస్తారని తెలిసింది.