వసతి గృహాల్లో బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2022-06-20T05:13:20+05:30 IST

కరోనా కారణంగా వసతి గృహాల్లో రద్దు చేసిన బయో మెట్రిక్‌ హాజరు విధానాన్ని మళ్లీ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

వసతి గృహాల్లో బయోమెట్రిక్‌
గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం


  • అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు
  • బయోమెట్రిక్‌తో హాజరు నమోదుకు ఏర్పాట్లు 

కరోనా కారణంగా వసతి గృహాల్లో రద్దు చేసిన బయో మెట్రిక్‌ హాజరు విధానాన్ని మళ్లీ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభమైన నేపథ్యంలో వసతి గృహాలను కూడా సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి బయో మెట్రిక్‌  హాజరు విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వికారాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  కొవిడ్‌ కారణంగా రెండేళ్ల నుంచి గత వేసవి సెలవుల ముందు వరకు విద్యార్థులకు బయో మెట్రిక్‌ హాజరు రద్దు చేసి మ్యానువల్‌ పద్ధతిలో నమోదు చేశారు. కొత్త విద్యా సంవత్సరంలో తిరిగి వసతి గృహాలు ప్రారంభించడంతో అక్కడ ఉండే విద్యార్థుల హాజరును తప్పనిసరిగా బయో మెట్రిక్‌ విధానంలోనే నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు ప్రయోగ పద్ధతిలో అమలు చేసిన బయో మెట్రిక్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో తప్పనిసరి చేశారు. బయో మెట్రిక్‌ కాకుండా మాన్యువల్‌ విధానంలో విద్యార్థుల హాజరును నమోదు చేయడం వల్ల విద్యార్థుల సంఖ్యను అధికంగా నమోదు చేసి ఎక్కువ బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ప్రభుత్వం రేషన్‌ కేటాయింపులు, బిల్లుల మంజూరు చేస్తుంది. వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేయాలని నిర్ణయించింది. సంక్షేమ వసతి గృహాల్లో బయో మెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, వసతి గృహాల నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు వసతి గృహాల్లో ఉండడమే కాకుండా పనిచేసే సిబ్బంది కూడా సమయ పాలన విధిగా పాటిస్తారని బయో మెట్రిక్‌ విధానంతో హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కరోనా నుంచి మాన్యువల్‌గానే..

జిల్లాలోని వసతి గృహాల్లో మూడేళ్ల   క్రితం నుంచి బయో మెట్రిక్‌ హాజరు నిలిపి వేశారు. కరోనా కేసుల ఉధృతి పెరగడంతో బయో మెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేయడం నిలిపివేశారు. అప్పటి నుంచి సంక్షేమ వసతి గృహాల్లో బయో మెట్రిక్‌ యంత్రాలు వినియోగానికి దూరమై మూలకు చేరాయి. సుమారు మూడేళ్లుగా వాటిని వినియోగించడం లేదు. చాలా రోజులుగా ఉపయోగించక పోవడంతో బ్యాటరీలు బాగున్నాయా.. పాడైపోయాయా అనేది వాటిని పరిశీలిస్తే గానీ తెలియని పరిస్థితి నెలకొంది. పనిచేయని బయో మెట్రిక్‌ యంత్రాలకు మరమ్మతులు చేయిస్తారా, లేక కొత్తవి సరఫరా చేస్తారా అనేది స్పష్టత లేదు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వసతి గృహాల్లో బయో మెట్రిక్‌ హాజరును తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా ఆయా సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ వసతి గృహంలో ఉండే విద్యార్థులు, సిబ్బంది రోజుకు రెండుసార్లు బయో మెట్రిక్‌ హాజరు నమోదు చేస్తారు. గతంలో కొందరు విద్యార్థుల వేలి ముద్రలు బయో మెట్రిక్‌ యంత్రాలు స్వీకరించకపోవడంతో హాజరు నమోదులో సమస్యలు ఎదురయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అలాంటి సమస్యలు తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థి ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా మరోసారి వేలి ముద్రలు స్వీకరించి సరిచేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు.

ఇంగ్లీష్‌ మీడియంతో పెరగనున్న ప్రవేశాలు

జిల్లాలో వివిధ సంక్షేమ శాఖలకు సంబఽంధించి 71 ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మొత్తం 25 ఉండగా, వాటిలో 22 ప్రీ మెట్రిక్‌, 3 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో 2200 మంది వరకు విద్యార్థులు ఉండి చదువుకునే అవకాశం ఉంది. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 30 వసతి గృహాలు ఉండగా, వాటిలో 21 ప్రీ మెట్రిక్‌, 9 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో 1565 మంది విద్యార్థులు ఉండి చదుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రీ మెట్రిక్‌ విభాగంలో 7 ఆశ్రమ పాఠశాలలు, 5 వసతి ఉన్నాయి. అదే పోస్ట్‌ మెట్రిక్‌కు సంబంధించి 3 కళాశాల వసతి గృహాలు ఉండగా, ఒక బాలికల జూనియర్‌ కళాశాల కొనసాగుతోంది. గిరిజన వసతి గృహాలు, ఆశ్రమ విద్యా సంస్థల్లో 3,850 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తుండడంతో గతంలో కంటే ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే.. వసతి గృహాల్లోనూ ప్రవేశాలు పెరగనున్నాయి.

 జిల్లాలో హాస్టళ్ల వివరాలు

వసతి గృహాలు మొత్తం         71

బీసీ వసతి గృహాలు 30

ఎస్సీ వసతి గృహాలు         25

ఎస్టీ వసతి గృహాలు 16

Updated Date - 2022-06-20T05:13:20+05:30 IST