బయోమెట్రిక్‌... అమలు సాధ్యమేనా!?

ABN , First Publish Date - 2022-05-15T05:42:49+05:30 IST

ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేందు కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది.

బయోమెట్రిక్‌...  అమలు సాధ్యమేనా!?
వైద్య కళాశాలలో బయోమెట్రిక్‌ వేస్తున్న జీజీహెచ వైద్యులు, సిబ్బంది

రూ.లక్షలు పోసి కొన్న పరికరాలు నిరుపయోగం

సక్రమంగా పనిచేయక వైద్య సిబ్బంది అవస్థలు


నెల్లూరు (వైద్యం), మే 14 : ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేందు కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. బయోమెట్రిక్‌ హాజరు లేకపోతే జీతాల్లో కోతతోపాటు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలూ జారీ చేసింది. మార్చి నుంచే ఈ విధానం అమలులోకి  వస్తుందని ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, ఆదిలోనే హంసపాదులా మూలనపడ్డ బయోమెట్రిక్‌ పరికరాలు తుప్పు వదిల్చే పనిలోనే ఇంకా అధికారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో బయోమెట్రిక్‌ అందుబాటులోకి రాకపోవటంతో వైద్య ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదేశించిన విధంగా పూర్తిస్థాయిలో అమలు సాధ్యం కాదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరులోని జీజీహెచలో 10 రోజులుగా బయోమెట్రిక్‌ పరికరాలు పని చేయకపోవడంతో ఉద్యోగులంతా వైద్య కళాశాలలో బయోమెట్రిక్‌ వేస్తున్నారు.  దీనివల్ల వారంతా విధులకు ఆలస్యంగా వెళుతున్నారు.


పరికరాలు చెడగొట్టిన ప్రబుద్ధులెందరో ..?


ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ పరికరాలను ఆదిలోనే చెడగొట్టిన ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే అధికారులు పరిశీలించారు. విధులకు హాజరయ్యేందుకు ససేమిరా అంటున్న కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్‌ పరికరాల్లో ఇంకు, నీరు పోయడం, ఇతర సాంకేతిక పరంగా వాటిని నిర్వీర్యం చేశారు. జీజీహెచతోపాటు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. అయితే, దీనికి కారకులెవరో తేలకపోవటంతో నిందితులు తప్పించుకున్నారు. తర్వాత కొంతకాలానికి బయోమెట్రిక్‌ హాజరుకు స్వస్తి పలికారు.


రూ.లక్షలు ఖర్చు చేసినా..


బయోమెట్రిక్‌ విధానానికి గత ప్రభుత్వం జిల్లాలో రూ.లక్షలు ఖర్చుచేసింది. వైద్యులు, సిబ్బంది హాజరు కోసం తొలుత ఐరీష్‌ పరికరాలను కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 28 వరకు 24 గంటల ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, రెండు ఏరియా ఆసుపత్రులలో ఒక్కో పరికరం రూ.30వేలు చొప్పున కొనుగోలు చేసి కొంతకాలం  వినియోగించారు. వేలిమద్రల వల్ల మరింత సత్ఫలితాలు ఉంటాయని బయోమెట్రిక్‌ పరికరాలను వాటిని కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ఈ విధానం కూడా కొన్ని నెలలు సజావుగా జరిగినా పరికరాలను కొందరు చెడగొట్టటం, మరికొన్నింటిని వాడకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో చేసిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. మొదట్లో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయానికి అన్ని పీహెచ్‌సీల నుంచి బయోమెట్రిక్‌ అనుసంధానం చేసి, ఖైజాయాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేపట్టారు. అయితే సీతారామపురం, గండిపాళెం, ఉదయగిరిలోని కొన్ని పీహెచ్‌సీలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడంతో ఈ బయోమెట్రిక్‌ హాజరు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 


అమలు చేస్తే సత్ఫలితాలు..


ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ఫలితాలు సాధిస్తుందోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రధానంగా బయోమెట్రిక్‌ పరికరాల నిర్వాహణ, రక్షణపై దృష్టి పెట్టాలి. జిల్లావ్యాప్తంగా ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 2వేల మంది, వైద్య విధానపరిషత్‌ ఆసుపత్రులలో 500 మందికిపైగా, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 1000 మంది వరకు వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వీరంతా సమయపాలన పాటిస్తే పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది.  

Updated Date - 2022-05-15T05:42:49+05:30 IST