బిల్లులు రావు.. పనులు కావు!

ABN , First Publish Date - 2022-06-15T03:05:05+05:30 IST

గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యత కలిగిన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

బిల్లులు రావు..  పనులు కావు!
రాపూరు : సంకురాత్రిపల్లిలో చివరిదశకు చేరిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు నిధుల జబ్బు

మంజూరు 445... పూర్తయినవి 107

వివిధ దశల్లో ఉన్నవి 344

అంచనా వ్యయం పెంచాలంటున్న కాంట్రాక్టర్లు

చేసిన పనులకూ మంజూరుకాని బిల్లులు 

కలగా మారుతున్న గ్రామీణ వైద్యం


ఎంతో ఉన్నతాశయంతో చేపట్టిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాల (విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌) నిర్మాణ పనులు కదలనంటున్నాయి. సిమెంటు, ఇటుకలు, స్టీలు ఇలా నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో పనులు చేయలేక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. గతేడాది డిసెంబరులోనే భవన నిర్మాణాలు పూర్తయ్యి వినియోగంలోకి రావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఆరంభంలోనే లక్ష్యానికి గండి పడినట్టు అయ్యింది. ఇంకేముంది.. గ్రామాల్లో ఎటు చూసినా పునాదుల స్థాయికి కొన్ని.. స్లాబు పనులు పూర్తి చేసుకున్నవి మరికొన్ని.. మొండి గోడలు.... వాటి మధ్య మొలిచిన మొక్కలతో భవనాలు దిష్టిబొమ్మల్లా మారిపోయాయి.


నెల్లూరు, జూన 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యత కలిగిన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి 2,500 మంది జనాభాకు ఒక క్లినిక్‌ చొప్పున మంజూరు చేశారు. వీటిలో 12 రకాల జబ్బులకు వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. సుమారు 60కి పైగా యంత్రాలు, వైద్య పరికరాలు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.  క్లినిక్‌లలో పనిచేసే వైద్య సిబ్బందికి అవసరాన్నిబట్టి టెలిమెడిసిన ద్వారా కూడా చికిత్సలకు సంబంధించిన సలహాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

ఆదిలోనే అసాధారణ జాప్యం


నెల్లూరు జిల్లా పరిధిలో మొత్తం 445 హెల్త్‌ క్లినిక్‌లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టారు. గత ఏడాది డిసెంబరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరంభంలో పనులు ఉత్సాహంగా సాగినా ఆ తర్వాత పలు రకాల కారణాలతో స్తంభించిపోయాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంటు, స్టీలు, ఇటుకల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో భవన నిర్మాణాలకు ఖరారు చేసిన అంచనాలు సరిపోలేదు. తొలుత ఒక్కో క్లినిక్‌కు రూ.14.50 లక్షలతో అంచనాలు తయారు చేసి పనులు మొదలు పెట్టారు. అయితే సిమెంటు, స్టీలు ధరలు విపరీతంగా పెరగడంతో అంచనా వ్యయం పెంచకపోతే పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో అంచనా వ్యయాన్ని రూ.17.50 లక్షలకు పెంచారు. బిల్డింగ్‌ డిజైన మేరకు నిర్మించాలంటే ఇప్పటి ధరలతో గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పడంతో మరో రూ 2.50 లక్షలు పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. ఉదాహరణకు విడవలూరు మండలంలో 11 హెల్త్‌ క్లినిక్‌లకు గాను ఒక్కటీ పూర్తి కాలేదు. అనంతసాగరంలో పదింటికి మూడు పూర్తి కాగా బిల్లులు రాని కారణంగా ఏడు భవనాల పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అల్లూరు, దగదర్తి మండలాల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మొత్తం 445 భవనాలు మంజూరయితే కేవలం 107 మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన 344 నిర్మాణాలు వివిధ దశల్లోనే ఆగిపోగా, నాలుగు భవనాల నిర్మాణాలు ఆరంభమే కాలేదు. అంచనా వ్యయం పెంచేవరకు, చేసిన పనులకు బిల్లులు చెల్లించే వరకు పనులు మొదలు పెట్టలేమని  కాంట్రాక్టర్లు అంటున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఆర్థిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వం అంచనా విలువ పెంచడం, పెడింగ్‌ బిల్లుల చెల్లించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా ఉత్తమ వైద్యం గ్రామీణులకు ఎప్పుడు అందుతుందో వేచి చూడాల్సిందే. 



Updated Date - 2022-06-15T03:05:05+05:30 IST