టిక్‌టాక్‌-మైక్రోసాఫ్ట్ డీల్‌పై బిల్‌గేట్స్ అసంతృప్తి..?

ABN , First Publish Date - 2020-08-09T21:51:05+05:30 IST

టిక్‌టాక్ మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వినవస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టిక్‌టాక్‌-మైక్రోసాఫ్ట్ డీల్‌పై బిల్‌గేట్స్ అసంతృప్తి..?

వాషింగ్టన్: టిక్‌టాక్ మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వినవస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం వల్ల మైక్రోసాఫ్ట్‌కు మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉందంటూ కాస్తంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అయితే నేను ఒకటి మాత్రం చెప్పగలను. ఈ ఒప్పందం ఓ పాయిజన్డ్ ఛాలిస్(రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం) సోషల్ మీడియాలో విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ఇప్పటివరకూ పర్సనల్ కంప్యూటర్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్‌కే పరిమితమైన మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌పై అమితాసక్తిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. తనకు అందని ద్రాక్షగా మిగిలిన సోషల్ మీడియాలో టిక్‌టాక్ ద్వారా పాగా వేయాలని సదరు సంస్థ చూస్తోంది. సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్‌కు లింక్‌డిన్ మినహా పెద్ద విజయాలేవీ లేవు. గతంలో సంస్థ చేపట్టిన విండోస్ ఫోన్, గ్రూవ్ మ్యూజిక్, మైక్రోసాఫ్ట్ బ్యాండ్ వంటి ప్రయోగాలన్ని నిరాశపరిచాయి. ఇక కోర్టానా కూడా అదే దారిలో ఉందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే రెడీ మేడ్‌గా దొరుకుతున్న టిక్‌టాక్ ద్వారా సోషల్ మీడియా ప్రపంచంలో తన సత్తాచాటాలని మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలోనే బిల్‌గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా విజయంలో సాధించడం ఆషామాషీ కాదని కుండబద్దలు కొట్టారు. 

Updated Date - 2020-08-09T21:51:05+05:30 IST