నేరగాళ్లకే న్యాయం!

ABN , First Publish Date - 2022-08-20T06:36:39+05:30 IST

బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

నేరగాళ్లకే న్యాయం!

బిల్కిస్‌బానో కేసు దోషుల విడుదల విషయంలో ఇదీ గుజరాత్‌ సర్కారు తీరు

2014 నాటి విధానం అమల్లో ఉన్నా..

1992 నాటి విధానం ప్రకారం విడుదల

సుప్రీం తీర్పును సాకుగా చూపుతూ.. 

సాంకేతికంగా ఆ హక్కు తమకుందని వ్యాఖ్య

కేంద్ర నూతన విధానాన్నీ కాదని నిర్ణయం

హత్యాచార నిందితులకు సత్కారాలతో

తీవ్ర మనోవేదనకు గురవుతున్న బిల్కిస్‌


బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సాంకేతిక సాకులు చూపుతూ గుజరాత్‌ సర్కారు బిల్కిస్‌ బానోకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేరగాళ్ల శిక్ష తగ్గింపునకు సంబంధించి 2014 నాటి చట్టాన్ని కాదని 1992 నాటి విధానం ఆధారంగా గుజరాత్‌ ప్రభుత్వం వారిని విడుదల చేసిందంటూ నిప్పులు చెరుగుతున్నాయి. ఇంతకీ గుజరాత్‌ ప్రభుత్వం వారి విడుదలకు చూపిన ప్రాతిపదిక ఏమిటి? వారి విడుదలలో సుప్రీంకోర్టు పాత్ర ఏమిటి? తదితర అంశాలను పరిశీలిస్తే.. 2002లో గుజరాత్‌లో గోధ్రాలో రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల సమయంలో బిల్కి్‌సబానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దుర్మార్గులకు 2008లో యావజ్జీవ ఖైదు పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలినవారిని విడుదల చేయాలన్నా, వారి శిక్షాకాలాన్ని తగ్గించాలన్నా కనీసం 14 ఏళ్ల జైలు శిక్షను వారు అనుభవించి ఉండాలి. ఈ క్రమంలోనే.. 14 ఏళ్ల జైలు శిక్ష ముగిశాక, దోషుల్లో ఒకడైన రాధేశ్యామ్‌ భగవాన్‌ దాస్‌ షా అలియాస్‌ లాల్‌వకీల్‌ 1992 నాటి విధానం ప్రకారం తన విడుదల కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. 


ఏమిటా 1992 విధానం?

యావజ్జీవ శిక్ష పడి, 14 ఏళ్ల శిక్షాకాలం ముగిసిన ఖైదీల విడుదలకు సంబంధించి.. 1992 జూలై 9న గుజరాత్‌ సర్కారు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. దాని ప్రకారం.. 1978 డిసెంబరు 18 ఆ తర్వాత కాలంలో యావజ్జీవ శిక్ష  పడిన ఖైదీల విడుదల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఆ బాధ్యత.. ఖైదీలపై కాక, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌(ఐజీపీ)పైనే ఉంటుంది. అలాంటి ఖైదీల శిక్షా కాలం 13 ఏళ్లు పూర్తి కాగానే ఐజీపీ తనంతతానుగా వారి విడుదల ప్రతిపాదనకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా.. సంబంధిత జిల్లా పోలీసు అధికారి, జిల్లా మేజిస్ట్రేట్‌, సదరు ఖైదీ ఏ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడో ఆ జైలు అధిపతి, అడ్వయిజరీ బోర్డు కమిటీ సలహాలను ఐజీపీ తీసుకోవాలి. వారందరి అభిప్రాయాలనూ తీసుకున్నాక సదరు ఖైదీ విడుదల ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టాలి.


అడ్వయిజరీ బోర్డు, ఐజీపీల నివేదికలు, జైల్లో సదరు ఖైదీ ప్రవర్తన ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇలా.. ఖైదీల శిక్షాకాలంలో 13వ ఏడాది ముగియగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టడం వల్ల 14వ ఏడాది ముగిసే సమయానికి ప్రభుత్వం వారి శిక్ష తగ్గింపు, విడుదలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందన్నది దీని వెనుక ఉద్దేశం. అయితే.. ప్రభుత్వమే ఇలా సుమోటోగా ఖైదీల శిక్షాకాలం తగ్గించే ప్రక్రియ చేపట్టకూడదని 2012లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, లేదా వారి తరఫున వారి బంధువులు మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేసింది. అంటే.. తమ శిక్షాకాలం తగ్గింపు లేదా విడుదల కోరుతూ వారే విజ్ఞప్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో.. సుప్రీం తీర్పును ఉటంకిస్తూ గుజరాత్‌ సర్కారు 2014 జనవరి 13న ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.


ఏమిటీ కొత్త విధానం..

యావజ్జీవ ఖైదీల విడుదల/శిక్షా కాలం తగ్గింపునకు సంబంధించి గుజరాత్‌ సర్కారు తెచ్చిన కొత్త విధానం ప్రకారం.. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారణ చేసిన కేసుల్లో దోషులుగా తేలినవారి శిక్షా కాలాన్ని, సామూహిక హత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్ల శిక్షాకాలాన్ని తగ్గించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఈ రెండూ బిల్కి్‌సబానో కేసులో దోషులకు వర్తిస్తాయి. కాబట్టి.. 2014 విధానం ప్రకారం వారి శిక్షా కాలం తగ్గే అవకాశమే లేదు. అందుకే రాధేశ్యామ్‌ అలియాస్‌ లాల్‌ వకీల్‌, అతడి న్యాయవాదులు తెలివిగా.. ‘‘2014 కన్నా ముందే శిక్ష పడింది కాబట్టి.. శిక్ష పడే సమయానికి అమల్లో ఉన్న 1992 నాటి విధానం ప్రకారం శిక్షా కాలాన్ని తగ్గించాలి’’ అనే వాదన తెరపైకి తెచ్చారు. ఈమేరకు శిక్షా కాలాన్ని తగ్గించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఈ కేసు విచారణ సుప్రీం ఆదేశాల మేరకు మహారాష్ట్రలో జరిగింది కాబట్టి.. శిక్ష తగ్గింపు పిటిషన్‌ కూడా అక్కడే వేసుకోవాలని గుజరాత్‌ హైకోర్టు సూచించింది.


దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 ఏప్రిల్‌ 1 నాటికి తనకు శిక్షపడి 15 సంవత్సరాల 4 నెలలు అయింది కాబట్టి తనను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి రాధేశ్యామ్‌ విజ్ఞప్తి చేశాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఒక కేసులో నిందితులు దోషులుగా తేలేనాటికి ఏ విధానం అమల్లో ఉందో ఆ విధానం ప్రకారమే శిక్ష తగ్గింపు/విడుదలకు అర్హులని పేర్కొంటూ ‘స్టేట్‌ ఆఫ్‌ హరియాణా వర్సెస్‌ జగదీశ్‌’ కేసులో గతంలో తానే ఇచ్చిన తీర్పును ఉటంకించింది. దాని ప్రకారం.. విడుదల కోరుతూ రాధేశ్యామ్‌ చేసుకున్న దరఖాస్తును 1992 నాటి విధానం ప్రకారం పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వానికి సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు మేరకు.. గుజరాత్‌ ప్రభుత్వం వారి విడుదలపై నిర్ణయానికి పదిమందితో కూడిన కమిటీని నియమించింది. పంచమహల్‌ జిల్లా కలెక్టర్‌ సుజల్‌ మయత్ర నేతృత్వంలోని ఆ కమిటీలో.. జిల్లా ఎస్పీ, జిల్లా జడ్జి, సోషల్‌ సెక్యూరిటీ అధికారి, జైలు సూపరింటెండెంట్‌ ఉన్నారు.


మిగిలిన ఐదుగురిలో.. సీకే రౌల్జీ (గోధ్రా ఎమ్మెల్యే), సుమన్‌బెన్‌ చౌహాన్‌ (కాలోల్‌ ఎమ్మెల్యే) బీజేపీ శాసనసభ్యులు. మిగతా ముగ్గురిలో.. ముర్లీ ముల్‌చందానీ, స్నేహా బెన్‌ భాటియా కూడా బీజేపీతో సంబంధాలున్నవారే. స్నేహాబెన్‌ బీజేపీ మహిళా విభాగం కార్యకర్త కాగా.. ముల్‌చందానీ గోధ్రా రైలు దహనానికి ప్రత్యక్షసాక్షి. ఆయన సాక్ష్యం ఆధారంగానే ఆ కేసులో దోషులకు శిక్ష పడింది. వీరితో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే బిల్కిస్‌ బానో కేసు దోషులను గుజరాత్‌ సర్కారు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే.. కమిటీలోని బీజేపీ ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 


కేంద్ర విధానాన్నీ తోసిరాజని..

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం.. వివిధ కేసుల్లో దోషుల విడుదలకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఆ విధానం ప్రకారం.. విడుదల చేయకూడని దోషుల జాబితాలో రేప్‌ కేసు నిందితులు కూడా ఉన్నారు. అయినా కూడా గుజరాత్‌ ప్రభుత్వం దాన్ని తోసిరాజని వారిని విడుదల చేసింది. 1992 నాటి విధానం ప్రకారం వారిని విడుదల చేసే సాంకేతిక అధికారం తమకు ఉందని చెబుతోంది.


ఆగ్రహావేశాలు..

విడుదలైన 11 మంది దోషులకు వారి కుటుంబసభ్యులు, వీహెచ్‌పీ నేతలు సాదర ఆహ్వానం పలికి, సత్కారాలు చేయడం.. వారి కుటుంబసభ్యులు వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం వంటి దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు.. ‘‘దోషుల్లో కొందరు బ్రాహ్మణులు, మంచి సంస్కారం ఉన్నవారు. జైల్లో వారి ప్రవర్తన కూడా బాగుండడం వల్లనే విడుదల చేశాం’’ అంటూ కమిటీ సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే రౌల్జీ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం జల్లిన చందంగా మారాయి. ముఖ్యంగా.. వారి వల్ల అన్యాయానికి గురైన బిల్కిస్‌ బానో ఈ పరిణామాలతో మరింత మనోవేదనకు గురవుతున్నారు. వారికి లభిస్తున్న ఘనసత్కారాలు.. తన చుట్టూ ఉండేవారే వారికి మిఠాయిలు పెట్టి, పాదనమస్కారాలు చేయడం చూసి ఆమె, ఆమె కుటుంబసభ్యులు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలంగడుపుతున్నారు. 20 ఏళ్ల గాయం మళ్లీ తిరగబెట్టిందని.. తన, తన కుటుంబసభ్యుల ప్రాణాల భద్రతకు భరోసా కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆమె వేడుకుంటున్నారు!                




ముద్దాయిల విడుదల గుజరాత్‌ సర్కారు నిర్ణయం

న్యాయ వ్యవస్థను నిందించకండి: జడ్జి వ్యాఖ్య 


ముంబై, ఆగస్టు 19: బిల్కి్‌సబానో గ్యాంగ్‌ రేప్‌ కేసు దోషుల విడుదలపై న్యాయ వ్యవస్థను నిందించకూడదని ఆ తీర్పుతో సంబంధం ఉన్న న్యాయ అధికారులు అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, న్యాయ వ్యవస్థకు ఏమాత్రం సంబంధం లేనిదని చెబుతున్నారు. అప్పట్లో వారికి కింది కోర్టులు విధించిన శిక్షలను హైకోర్టుకు చెందిన జస్టిస్‌ విజయ్‌ తహిల్‌రమణి, జస్టిస్‌ మృదులా భట్కర్‌ల ధర్మాసనం ఖరారు చేసింది. వారి విడుదల నేపథ్యంలో కొందరు న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడంపై జస్టిస్‌ మృదుల స్పందించారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ‘‘న్యాయ వ్యవస్థను ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. న్యాయ వ్యవస్థే ప్రజల హక్కులను కాపాడింది. మాపై విమర్శలు వస్తే బాధపడతాం. ఎందుకంటే సమర్థించుకునే అవకాశం మాకు ఉండదు’’ అని ఆమె చెప్పారు. 


సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2022-08-20T06:36:39+05:30 IST