మారుతాళంతో దొంగిలించి.. తక్కువ ధరకు అమ్మేసి..

ABN , First Publish Date - 2020-11-28T06:33:55+05:30 IST

జల్సాలకు అలవాటుపడి డబ్బులుకోసం మోటారుసైకిళ్లను చోరీ ప్రారంభించాడు ఒక వ్యక్తి. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్‌లు చేసిన ద్విచక్రవాహనాలను మారుతాళంతో దొంగిలించి తక్కువ ధరకు అమ్మేసేవాడు. కాజులూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి అమ్మకానికి తోడ్పడ్డారు.

మారుతాళంతో దొంగిలించి.. తక్కువ ధరకు అమ్మేసి..
దొంగిలించిన ద్విచక్రవాహనాలు

  • తాళ్లరేవులో ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
  • నిందితుడి నుంచి 41 వాహనాలు స్వాధీనం

తాళ్లరేవు, నవంబరు 27: జల్సాలకు అలవాటుపడి డబ్బులుకోసం మోటారుసైకిళ్లను చోరీ ప్రారంభించాడు ఒక వ్యక్తి. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్‌లు చేసిన ద్విచక్రవాహనాలను మారుతాళంతో దొంగిలించి తక్కువ ధరకు అమ్మేసేవాడు. కాజులూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి అమ్మకానికి తోడ్పడ్డారు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న 41 ద్విచక్ర వాహనాలను కోరింగ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు రికవరీ చేశారు. తాళ్లరేవు మండలం కోరింగ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ విలేఖరుల సమావేశంలో జరిగిన సంఘటనను వివరించారు. డీజీపీ, ఏలూరు రేంజ్‌ డీఐజీ సూచనల మేరకు జిల్లాలోని పోలీసులను చైతన్యపరచి వాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కొంతకాలంగా మోటారుసైకిళ్లు దొంగతనం చేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న కాకినాడ గాంధీనగర్‌ మల్లయ్య ఆగ్రహారానికి చెందిన ఇళ్ల మహాలక్ష్మి అలియాస్‌ లక్ష్మి(41)ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి అమ్మకంలో తోడ్పడిన కాజులూరుకు చెందిన సలాది సుబ్బారావు, యాళ్ల సత్తిబాబులను శుక్రవారం ఇంటివద్దనే అరెస్టు చేశారన్నారు. ఆర్‌సీ బుక్‌లు తరువాత ఇస్తామని పార్టీలను నమ్మబలికి వాహనాలను అమ్మేవారన్నారు. ఈ ముగ్గురు ఎక్కడా పట్టుబడకపోవడంతో ఏడాదికాలంగా జిల్లావ్యాప్తంగా రూ.14లక్షల52వేల850 విలువచేసే 41 ద్విచక్ర వాహనాలను దొంగిలించారన్నారు. వీరిపై 379, 411 ఐపీసీ సెక్షన్లు నమోదు చేసి కాకినాడ కోర్టుకు రిమాండ్‌కు పంపిస్తున్నట్తు తెలిపారు. డీఎస్పీ భీమారావు, రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, కోరింగ ఎస్‌ఐ వై.సతీష్‌, క్రైం ఏఎస్‌ఐ వి.సూరిబాబు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ జి.సత్యనారాయణ, పీఎల్‌వీఎస్‌ఎస్‌. ప్రసాద్‌, పీఎస్‌ఎన్‌ రాజు, కానిస్టేబుల్స్‌ ఎన్‌.శ్రీనివాస్‌, బి.రవి, సీహెచ్‌వీవీ నారాయణరెడ్డి, కె.చంద్రశేఖర్‌, ఎన్‌.వెంకటరమణ, పి.సురేష్‌, ఎల్‌.శివకుమార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు.

Updated Date - 2020-11-28T06:33:55+05:30 IST