కుర్తా, పైజమా వేసుకున్న Head master పై DM చిందులు.. Salary cut కు ఆదేశం

ABN , First Publish Date - 2022-07-13T20:19:21+05:30 IST

స్కూలుకు కుర్తా, పైజమాతో వచ్చిన హెడ్మాస్టర్‌‌ను జిల్లా మెజిస్ట్రేట్ తీవ్రంగా ...

కుర్తా, పైజమా వేసుకున్న Head master పై DM చిందులు.. Salary cut కు ఆదేశం

పాట్నా: స్కూలుకు కుర్తా, పైజమాతో వచ్చిన హెడ్మాస్టర్‌‌ (Head master)ను జిల్లా మెజిస్ట్రేట్ (DM) తీవ్రంగా మందలించారు. హెడ్మాస్టర్ వివరణ కూడా వినకుండా...ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. హెచ్ఎం చేసిన విజ్ఞప్తులను కూడా ఖాతరు చేయకుండా షోకాజ్ నోటీసు ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. మీ జీతం ఆపేయదలచుకున్నానంటూ తెగేసి చెప్పారు. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ, హెడ్మాస్టర్‌పై సానుభూతి, డీఎంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం దయనీయంగా ఉందంటూ గ్రామస్థులు చేసిన ఫిర్యాదుతో డీఎం సంజయ్ కుమార్ సింగ్ అకస్మాత్తుగా పాఠశాల తనిఖీకి వచ్చారు. బీహార్ సంప్రదాయక దుస్తులైన కుర్తా, ఫైజమాతో హెడ్‌మాస్టర్ నిర్భయ్ కుమార్ రావడంతో డీఎం ఆగ్రహంతో ఊగిపోయారు. ''మీరు చదువు చెప్పడం కంటే ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగితే బాగుంటుంది. ఈ దుస్తుల్లో మీరు టీచర్‌లా కనిపించడం లేదు. ప్రజాప్రతినిధిలా ఉన్నారు'' అని వ్యాఖ్యానించారు. హెడ్మాస్టర్ తన ఇబ్బందులు చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ డీఎం సంజయ్ కుమార్ వినిపించుకోలేదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అంటూ  గద్దించారు. మన్నించాలంటూ హెడ్‌మాస్టర్ పలుమార్లు విన్నవించుకున్నారు. దానిని కూడా డీఎం ఖాతరు చేయకుండా ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ''హెడ్‌మాస్టార్ ఉద్యోగానికి మీ రు పనికిరారు. అందువల్ల మీ జీతం నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వబోతున్నాను'' అంటూ హెడ్‌మాస్టర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.


కాగా, హెడ్‌మాస్టర్‌పై డీఎం అనుసరించిన వైఖరిని టీచర్స్ అసోసియేషన్‌తో సహా వివిధ రంగాలకు చెందిన వారు తప్పుపట్టారు. బీహార్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బందికి ఎలాంటి ప్రత్యేకమైన డ్రస్ కోడ్ లేదని,  సంప్రదాయ దుస్తులైన కుర్తా,ఫైజమా ధరించారనే కారణంగా జీతంలో కోత, జీతం నిలుపుదల చేయడం సరైన చర్య కాదని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టిఇటి) టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్తాబ్ ఫిరోజ్ తెలిపారు. బీహార్‌లోని చాలా స్కూళ్లలో ఫ్యానులు కూడా లేవని అన్నారు.


హెడ్మాస్టర్ ఆవేదన...

డీఎం తనను మందలించిన తీరుపై హెడ్మాస్టర్ నిర్భయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తాను టీచర్ వృత్తిలో ఉన్నానని, మొదట్నించీ కుర్తా ఫైజమాలు ఇష్టంగా వేసుకుని వచ్చేవాడని, ఇలాంటి అనుభవం ఎదురుకావడం జీవితంలో ఇదే మొదటిసారని ఆయన వాపోయారు. నిర్భయ్‌ కుమార్‌కు జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పూ యాదవ్ సైతం బాసటగా నిలిచారు. డీఎంను తక్షణం సస్పెండ్ చేసి, ఆయన జీతాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రిని ఒక ట్వీట్‌లో ఆయన కోరారు.

Updated Date - 2022-07-13T20:19:21+05:30 IST