BSP ఘోర పరాభవం.. గత ఎన్నికల్లో సీట్లు, ఈ ఎన్నికల్లో ఓట్లూ గల్లంతు

ABN , First Publish Date - 2022-03-10T19:31:51+05:30 IST

జాతీయ పార్టీ గుర్తింపు ఉన్న బీఎస్పీకి ఉత్తరప్రదేశ్‌లో నిలకడైన ఓట్ బ్యాంక్ ఉంది. గత ఆరు ఎన్నికలను (లోక్‌సభ, అసెంబ్లీ) గనుక పరిశీలించినట్లైతే ఈ విషయం స్పష్టమవుతుంది. 20 శాతానికి అటుఇటుగా బీఎస్పీకి నిలకడగా ఉన్న..

BSP ఘోర పరాభవం.. గత ఎన్నికల్లో సీట్లు, ఈ ఎన్నికల్లో ఓట్లూ గల్లంతు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో మొట్టమొదటిసారి పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాగే బీఎస్పీ అధినేత మాయావతీ, ఉత్తరప్రదేశ్‌కు అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాంటి పార్టీ కేవలం పది ఏళ్లు కూడా గడవక ముందే రాష్ట్రంలో గల్లంతైనట్టుగానే కనిపిస్తోంది. గురువారం ఎన్నికల సంఘం విడుదల చేస్తున్న ఫలితాల్లో బీఎస్పీ అత్యంత వెనుకబడినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు కోల్పోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓట్లు నిలబెట్టుకున్న బీఎస్పీ.. ఈసారి సీట్లతో పాటు ఓట్లు కూడా కోల్పోతున్నట్లే కనిపిస్తోంది.


జాతీయ పార్టీ గుర్తింపు ఉన్న బీఎస్పీకి ఉత్తరప్రదేశ్‌లో నిలకడైన ఓట్ బ్యాంక్ ఉంది. గత ఆరు ఎన్నికలను (లోక్‌సభ, అసెంబ్లీ) గనుక పరిశీలించినట్లైతే ఈ విషయం స్పష్టమవుతుంది. 20 శాతానికి అటుఇటుగా బీఎస్పీకి నిలకడగా ఉన్న ఓట్ బ్యాంక్. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు 19 మాత్రమే వచ్చినప్పటికీ 22.23 శాతం ఓట్లు బీఎస్పీ సాధించింది. అయితే ఎన్నికల్లో 12-14 శాతం ఓట్లు మాత్రమే సాధించేలా కనిపిస్తోంది. ఇక సీట్లు అయితే సింగిల్ డిజిట్‌లోనే చతికిలబడిపోయేలా కనిపిస్తోంది. మద్యాహ్నం 1:00 వరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల్లో బీఎస్పీ ఓట్ల శాతం 12.7 శాతంతో కేవలం 2 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.


పార్టీ స్థాపించిన నాటి నుంచి బహుజన్ సమాజ్‌ పార్టీ ఇంత పెద్ద స్థాయిలో పరాభవాన్ని మూటగట్టుకోవడం ఇదే తొలిసారి. 1989లో మొదటిసారి పోటీ చేసినప్పుడు 13 సాధించింది. ఆ తర్వాత ఆ పార్టీ వెనక్కి తిరిగి చూడలేదు. క్రమ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ.. తన కంటూ పటిష్టమైన ఓట్ బ్యాంక్‌ను తయారు చేసుకుంది. అయితే ఈ ఓట్ బ్యాంక్‌ బీఎస్పీతోనే ఉన్నప్పటికీ 2017 ఎన్నికల్లో 19 స్థానాలకు పడిపోవడం అప్పటికి పెద్ద పరాభవం. ఈసారి ఎన్నికల ఫలితాల్లో సీట్లతో పాటు ఓట్లు కూడా కోల్పోయి కెరీర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌ని తన ఖాతాలో వేసుకోనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

Updated Date - 2022-03-10T19:31:51+05:30 IST