దేశంలో అతి పెద్ద కరోనా వైరస్ ఆసుపత్రి ఒడిశాలో

ABN , First Publish Date - 2020-03-30T02:59:07+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి తాకిడికి ఒడిశా చాలా దూరంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక పాజిటివ్ కేసు మాత్రమే నిర్థరణ అయింది.

దేశంలో అతి పెద్ద కరోనా వైరస్ ఆసుపత్రి ఒడిశాలో

భువనేశ్వర్ : కరోనా వైరస్ మహమ్మారి తాకిడికి ఒడిశా చాలా దూరంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక పాజిటివ్ కేసు మాత్రమే నిర్థరణ అయింది. అయినప్పటికీ దేశంలోనే అతి పెద్ద కరోనా వైరస్ ఆసుపత్రిని మరో 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేబోతోంది. 


రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ సురేశ్ చంద్ర మహాపాత్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి వీకే పాండ్యన్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరవ్ గార్గ్ ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని ఆదివారం పరిశీలించారు. 


500 పడకలతో, అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కోసం ఒడిశా ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐఎంఎస్), ఎస్‌యూఎం ఆసుపత్రి, మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)లతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్ఓఏ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఇక్కడ మరొక 15 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎస్ఓఏ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ మనోజ్‌ రంజన్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలిపారు. 


ఒడిశాలో కేవలం ఒక నోవల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు మాత్రమే నమోదైన సంగతి తెలిసిందే. భువనేశ్వర్‌లో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక ఆసుపత్రికి నిధులను మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సమకూర్చుతోంది. ఐఎంఎస్, ఎస్‌యూఎం ఈ ఆసుపత్రిని నిర్వహిస్తాయి. 


Updated Date - 2020-03-30T02:59:07+05:30 IST