నిషేధిత గగనతలంలోకి విమానం.. తక్షణమే సురక్షిత ప్రాంతానికి అధ్యక్షుడు Joe biden తరలింపు..

ABN , First Publish Date - 2022-06-05T23:12:57+05:30 IST

నిషేధిత గగనతంలోకి ఓ విమానం పొరపాటున ప్రవేశించడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భద్రతా అధికారులను పరుగులు పెట్టించింది.

నిషేధిత గగనతలంలోకి విమానం.. తక్షణమే సురక్షిత ప్రాంతానికి అధ్యక్షుడు Joe biden తరలింపు..

వాషింగ్టన్ : నిషేధిత గగనతంలోకి ఓ విమానం పొరపాటున ప్రవేశించడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భద్రతా అధికారులను పరుగులు పెట్టించింది. తక్షణమే బైడెన్‌తోపాటు ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన వచ్చింది. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వాషింగ్టన్‌కు తూర్పున 200 కిలోమీటర్ల(120 మైల్స్) దూరాన ఉన్న డెలావేర్‌లోని ‘రెహొబోత్ బీచ్‌’లో అధ్యక్షుడు బైడెన్‌ దంపతుల నివాసం ఉంది. శనివారం ఇద్దరూ ఇక్కడే బస చేశారు. అధ్యక్షుడి నివాసం కారణంగా నిబంధనల ప్రకారం ఈ ప్రాంత గగనతలంలో విమానాలపై ఆంక్షలు ఉంటాయి. అయితే పొరపాటున ఓ చిన్న ప్రైవేటు విమానం ఈ ప్రాంతం గుండా వెళ్లింది. దీంతో అధ్యక్షుడి సెక్యూరిటీ  సర్వీస్ ఉలిక్కిపడింది. హుటాహుటిన అధ్యక్షుడి బసను సురక్షిత ప్రాంతానికి మార్చివేశారు. విమానం పొరపాటున వచ్చిందని నిర్ధారించుకున్నాక తిరిగి అదే నివాసానికి దంపతులను తీసుకెళ్లారు.


ఈ ఘటనపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నారని తెలియజేసింది. ఎలాంటి దాడి జరగలేదని స్పష్టంచేసింది. సురక్షిత ప్రాంతానికి తరలించి.. ఆ  తర్వాత తిరిగి వారి నివాసానికి తీసుకెళ్లామని అధికారులు వివరించారు. నిషేధిత ఏరియాలోకి పొరపాటున విమానం వచ్చిందని సీక్రెట్ సర్వీస్ తెలిపిందని పేర్కొంది. విమానాన్ని నడిపిన పైలెట్ సరైన రేడియో చానెల్‌ వినలేదు. ప్రచురితమైన విమాన మార్గదర్శకాలను తెలుసుకోలేదని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథొనీ గుగ్లిల్మి తెలిపారు. కాగా పైలె‌ట్‌ను అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రశ్నించనుందని అధికారి వివరించారు.

Updated Date - 2022-06-05T23:12:57+05:30 IST