మోపెడ్‌ను ఢీకొన్న కారు : బైక్‌ మెకానిక్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2022-06-24T03:53:53+05:30 IST

మోపెడ్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో మోపెడ్‌ నడుపుతున్న బైక్‌ మెకానిక్‌ మృతి చెందగా, వెనుక కూర్చున బాలుడు తీవ్ర

మోపెడ్‌ను ఢీకొన్న కారు : బైక్‌ మెకానిక్‌ దుర్మరణం
నాయబ్‌ మృతదేహంపై పడి రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు

 బాలుడికి తీవ్ర గాయాలు

బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 23 : మోపెడ్‌ను వేగంగా వచ్చిన  కారు ఢీకొనడంతో మోపెడ్‌ నడుపుతున్న బైక్‌ మెకానిక్‌ మృతి  చెందగా, వెనుక కూర్చున బాలుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన బుచ్చిలోని ఇరిగేషన్‌ బంగ్లా వద్ద గురువారం జరిగింది. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగారు. మృతుడి బంధువుల కథనం మేరకు, మండలంలోని నాగామాంబాపురానికి  చెందిన రహంతుల్లా, హసీనా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు  ఎస్‌కే. నాయబ్‌(30) బుచ్చి  ఇరిగేషన్‌ బంగ్లా వద్ద మెకానిక్‌ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. నాయబ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. స్థానిక రాఘవరెడ్డి కాలనీలోని ఇంటి నిర్మాణం వద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నాయబ్‌ భోజనం చేసి తిరిగి షాపునకు వచ్చారు. వెంటనే ఏదో పనిపై మోపెడ్‌పై మేనల్లుడు గౌస్‌(14)తో కలిసి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది.   ప్రమాదంలో బాలుడికి కాలు విరిగింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చిన తల్లిదండ్రులు  ఎర్రటి ఎండలో మృతదేహంపై కన్నీరుమున్నీరుగావిలపించడం చూపరులను కలిచివేసింది.  నాగామాంబాపురంలో కూడా విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కే. వీరప్రతాప్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.


సీసీ ఫుటేజీతో కారు గుర్తింపు


ప్రమాదానికి కారణమైన కారు(ఏపీ39 బీహెచ్‌ 1944) ను ఎస్‌ఐ వీరప్రతాప్‌ బుచ్చి టోల్‌గేట్‌, జొన్నవాడ రోడ్డు సెంటర్‌లోని సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు.  ప్రమాదం జరిగిన సమయంలో బాయినెట్‌కు ఎడమవైపు దెబ్బతిన్న  కారు అతివేగంతో  ప్రయాణించి,  రోడ్లుపై ఉన్న వారిని భయాందోళనకు గురిచేసింది. 






Updated Date - 2022-06-24T03:53:53+05:30 IST