స్నానానికి ముందు.. ఆ తర్వాత.. ఈ తప్పుల్ని అస్సలు చేయకండి.. మహాభారతంలో ఏముందంటే..

ABN , First Publish Date - 2021-10-08T03:28:37+05:30 IST

హిందూ సంప్రదాయాల ప్రకారం స్నానానికి ముందు, తర్వాత కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇదే విషయంపై మహాభారతంలోనూ ప్రస్తావన వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం అంపశయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు పాండవులు వెళ్తారు.

స్నానానికి ముందు.. ఆ తర్వాత.. ఈ తప్పుల్ని అస్సలు చేయకండి.. మహాభారతంలో ఏముందంటే..

హిందూ సంప్రదాయాల ప్రకారం స్నానానికి ముందు, తర్వాత కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇదే విషయంపై మహాభారతంలోనూ ప్రస్తావన వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం అంపశయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు పాండవులు వెళ్తారు. ఆ సమయంలో భీష్ముడిని ధర్మరాజు పలు ధర్మ సందేహాలను అడుగుతాడు. ఈ సందర్భంగా భీష్ముడు పలు అనుమానాలను నివృత్తి చేస్తాడు. ఆయుర్దాయం పెంపొందే శుభాల గురించి భీష్ముడు చెప్పడం ఆరంభిస్తాడు..


ధర్మరాజుతో ఇలా అంటాడు. ‘‘ధర్మనందనా! పూలలో తెల్లని, పచ్చని పువ్వులను మాత్రమే ధరించాలి. రాత్రివేళ స్నానం మహాపాపం.. కనుక చేయకూడదు. పొద్దున స్నానం చేసిన తర్వాత శరీరాన్ని ఎక్కువగా తుడుచుకోరాదు. తుడుచుకుంటే శుచిత్వం తొలగిపోతుందంటారు. స్నానానికి ముందు శరీరానికి సుగంధాలు పూసుకోరాదు. తడిబట్ట గట్టిగా పిండనిదే జాడించరాదు. ఇతరులు కట్టి విడిచిన వస్త్రాన్ని ధరించరాదు. మర్రి, మేడి, పిప్పల పళ్ళను నోటిలో పెట్టుకుని నమలరాదు. వేదం చెప్పని కర్మ తంత్రాలతో గోవులు, నెమళ్ళు, మేకలు... వంటి ప్రాణులను తినరాదు. ఇతరులు వాసన చూసిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు. మనసును ఎక్కడో పెట్టుకుని, భోంచెయ్యకూడదు. తింటున్న ఆహారాన్ని నిందించకూడదు.


రజస్వలతో సాంగత్యం మహాపాపం. స్నానం చేసిన తర్వాత నాలుగవనాటి రాత్రి సమాగమం సముచితం అంటారు కొందరు. మరి కొందరు అయిదవనాటి రాత్రి కాని సాంగత్యం కూడదంటున్నారు. ఆరవనాటి కలయిక వల్ల కొడుకు పుడతాడు. ఇదే విధంగా సరి బేసి దినాలలో సాంగత్యం వల్ల కొడుకు-కూతురు కలుగుతారని విజ్ఞులంటున్నారు. ఈ విధంగా పదహారు రోజులు పాటు స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని పెద్దలంటున్నారు. ధర్మనిష్ఠకి ఆచారం ప్రధానం. ధర్మాల వల్ల సిరిసంపదలతో పాటు ఆయుర్దాయం, కీర్తి పెరుగుతాయి. ప్రాణులన్నిటినీ ప్రేమించగలగాలి. ప్రేమించగలిగితే మహా మహా పాపాలు కూడా పటాపంచలవుతాయి.’’ అంటూ చెప్పడం ముగించాడు భీష్ముడు.

Updated Date - 2021-10-08T03:28:37+05:30 IST