ఏజెన్సీ సూరీడు అస్తమయం.. కమ్యూనిస్టు యోధుడు కుంజా బొజ్టి కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-13T05:46:50+05:30 IST

నమ్మిన సిద్దాంతం కోసం తుది వరకు పోరాడిన ప్రజా నాయకుడు.. మూడుసార్లు ఎమ్మె ల్యేగా ఎన్నికైనా కనీసం సొంత ఇల్లుకూడా కట్టుకోని నిబ ద్ధత ఉన్నవ్యక్తి. పార్టీని వీడాలని మావోయిస్టులు బెదిరించినా చెక్కు చెదరని ధైర్యంతో ఏజెన్సీ వాసుల పక్షాల నిలిచి వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషిచేసిన ఏజెన్సీ సూరీడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జి(95) కన్ను మూశారు.

ఏజెన్సీ సూరీడు అస్తమయం..  కమ్యూనిస్టు యోధుడు కుంజా బొజ్టి కన్నుమూత
కుంజబొజ్జి (ఫైల్‌ఫొటో), కుంజబొజ్జి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

 అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే 

 ప్రాణం కంటే సిద్ధాంతం గొప్పదన్న కామ్రేడ్‌ ఆయన

 భద్రాచలం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ రికార్డు

 చివరివరకు సాదాసీదా జీవనమే.. 

 నేడు అడవి వెంకన్నగూడెంలో అంత్యక్రియలు 

భద్రాచలం, ఏప్రిల్‌ 12: నమ్మిన సిద్దాంతం కోసం తుది వరకు పోరాడిన ప్రజా నాయకుడు.. మూడుసార్లు ఎమ్మె ల్యేగా ఎన్నికైనా కనీసం సొంత ఇల్లుకూడా కట్టుకోని నిబ ద్ధత ఉన్నవ్యక్తి. పార్టీని వీడాలని మావోయిస్టులు బెదిరించినా చెక్కు చెదరని ధైర్యంతో ఏజెన్సీ వాసుల పక్షాల నిలిచి వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషిచేసిన ఏజెన్సీ సూరీడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జి(95) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమ వారం మృతి చెందారు. ఉండగా ఆయన భౌతికకాయాన్ని తొలుత భద్రాచలంలోని పార్టీ కార్యాలయానికి అక్కడి నుంచి స్వగ్రామమైన అడవివెంకన్నగూడేనికి తరలించారు. మంగళవారం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనుండగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హజరుకానున్నారు. 

1952లో ఉమ్మడి కమ్యూనిస్టు సభ్యత్వం

కుంజాబొజ్జి స్వస్థలం ప్రస్తుత ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామం. కుంజా జోగయ్య-లచ్చమ్మ దంపతుల ఎనిమిది మంది సంతానంలో ఆరో సంతానంగా 1926 ఫిబ్రవరి 10న జన్మించారు. 1948లో లాల మ్మతో వివాహం జరగగా ఆయనకు ఆరుగురు సంతానం కాగా అందులో ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో భార్య అనారోగ్యంతో, ఒక కుమారుడు మృతి చెందారు. 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన కుంజాబొజ్జి 1964లో ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు అప్పటి డివిజన్‌ కార్యదర్శి పారుపల్లి పుల్లయ్య సారథ్యంలో చురుగ్గా పాల్గొన్నారు. అంతకు ముందు వీర తెలం గాణ సాయుధ పోరాట దళాలకు కూడా తనవంతు సహకారం అందించారు. సీపీఎంలో తొలి నుంచి చురుగ్గా పాల్గొంటూ గిరిజన గిరి జనేతరుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అంతేకాదు తునికాకు కార్మికుల ధరలు పెంచాలని ఉద్యమాలను సైతం నిర్వహించారు. పార్టీలో చేరిన నాటి నుంచి మృతి చెందే వరకు పార్టీ 69 ఏళ్ల పాటు నిబద్ధతతో, నిజాయితీతో పని చేసి అందరి మన్ననలు పొందారు. 

ఓటమితోనే అడుగేసి.. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా నిలిచి..

తొలిసారిగా 1970లో వరరామచంద్రాపురం మండలం రామ వరం సర్పంచ్‌గా పోటీ చేసిన కుంజాబొజ్జి కాంగ్రెస్‌ అభ్యర్థి సోలా ముత్తయ్యపై  కేవలం ఒక్క ఓటుతో ఓటమిపాలయ్యారు. అలాగే వరరామచంద్రాపురం సమితి అధ్యక్షుడిగా 1982లో పోటీ చేయగా అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి గుంపెనపల్లి రాజు చేతిలో ఓటమి పాల య్యారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎం తరపున భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1985 ఫిబ్రవరి 24న ఆ నాడు సీపీఎం మహానేత పుచ్చలపల్లి సుందరయ్య, పర్సా సత్యనారాయణ, స్థానిక డివిజన్‌ కార్యదర్శి బండారు చందర్‌రావుఆయన విజయం కోసం భద్రాచలం తాతగుడి సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 1985లో విజయం సాధించడంతో 1989, 1994లో వరుసగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా హ్యాట్రిక్‌ సాధించిన భద్రా చలం నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఇదిలా ఉండగా 1999 ఎన్నికల బరిలో సున్నం రాజయ్యను నిలిపేందుకు కుంజాబొజ్జే ప్రతిపాదన చేశారు. 

రూ.800తో కుటుంబ పోషణ

తొలిసారిగా శాసన సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఎమ్మెల్యేగా రూ.2వేలు జీతం వచ్చేది. అందులో రూ.1200 పార్టీకి అందజేసి మిగిలిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించారు. కాగా ఆనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భూమిని కేటాయించగా సీపీఎం మహానేత పుచ్చలపల్లి సుందరయ్య సూచనమేరకు ప్రభుత్వం ఇచ్చిన భూమి ని తీసుకోరాదని తీర్మానించి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైనా సొంత ఇల్లు, కనీసం వాహనం కూడా లేని నాయ కుడు బొజ్జి. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొజ్జి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చివరి వరకు పోరాడారు. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్‌పైనే కార్యాలయా నికి, ప్రజల్లోకి వెళ్లేవారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కుంజాబొజ్జితో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అవి నాభావ సంబంధం ఉండేది. సీనియర్‌ ప్రజా ప్రతినిధిగా ఆయన సూచించిన అంశా లకు మంత్రిగా పనిచేసిన  కాలంలో తుమ్మల నాగేశ్వర రావు ఎంతో ప్రాధాన్యమిచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేసేవారు. రెండు దశాబ్దాల క్రితం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన నేటికీ కుంజా బొజ్జి మాటకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంతో విలువనిచ్చేవారు. 

తూటాలకూ బెదరని వ్యక్తి.. 

కుంజాబొజ్జి ఎమ్మెల్యేగా లేని సమయంలో 1983 నవంబరు 11న వరరామచంద్రాపురం మండలంలోని అడవి వెంకన్నగూడెంలో బొజ్జి స్వగృహంలో ఉండగా ఒక మావోయిస్టు వచ్చి అన్న రమ్మంటున్నారంటూ ఆయ నకు సమాచారం ఇవ్వగా తాను వచ్చేది లేదని ఆ అన్ననే రమ్మని సమాధానం ఇచ్చారు. దీంతో సుమారు 30మంది సాయుధులైన మావోయిస్టులు ఆయన ఇంటికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారని, తమతో కలిసి ఈ ప్రాంతా న్ని అభివృద్ధికి సహకరించాలని దళనాయకుడు పేర్కొన్నట్లు గతంలో కుంజాబొజ్జి ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో సీపీఎం నాయకులు బత్తుల భీష్మారావు, బండారు చందర్‌రావులతో కలిసి వర రామచంద్రాపురం మండలంలోని జీడిగుప్ప వద్దకు చేరుకోగా సాయుధులైన మావోయిస్టులు వారిని అడ్డుకొని కాల్పులు జరపగా భీష్మారావు అక్కడికక్కడే మృతి చెందగా బండారు చందర్‌రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆ సంఘటనలో మావోయిస్టులు కుంజాబొజ్జి ఛాతిపై కొట్టారు.  

ఏడాదిలో ఇద్దరు ఆదివాసీ నేతలను కోల్పోయిన సీపీఎం

గత ఏడాది కాలంలో భద్రాచలం నియోజకవర్గంలో సీపీఎం ఇద్దరు ఆదివాసీ నేతలను కోల్పోయింది. గత ఏడాది ఆగస్టు 3న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. తొమ్మిది నెలల అనంతరం సోమవారం భద్రాచలం హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి చెందారు. దాంతో ఏడాది కాలంలోనే ఇరువురు జన నేతలను సీపీఎం కోల్పోయింది.  


Updated Date - 2021-04-13T05:46:50+05:30 IST