‘భావశ్రీ ’ ఇకలేరు

ABN , First Publish Date - 2021-12-04T05:24:07+05:30 IST

ప్రముఖ సాహితీ వేత్త, రచయిత, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు వాండ్రంగి రామారావు (87) (భావశ్రీ) శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వగ్రామం జి.సిగడాం మండలం సంతవురిటిలో స్వగృహంలో మృతి చెందారు.

‘భావశ్రీ ’ ఇకలేరు
సినారే నుంచి జ్ఞాపిక అందుకుంటున్న భావశ్రీ (ఫైల్‌ఫొటో)

సాహితీ వేత్తను కోల్పోయిన సిక్కోలు

గ్రంథ రచయితగా, వ్యాఖ్యాతగా రామారావు జీవనయానం

రాజాం రూరల్‌ (జి.సిగడాం), డిసెంబరు 3: ప్రముఖ సాహితీ వేత్త, రచయిత, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు వాండ్రంగి రామారావు (87) (భావశ్రీ) శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వగ్రామం జి.సిగడాం మండలం సంతవురిటిలో స్వగృహంలో మృతి చెందారు. ఈయన మృతితో శ్రీకాకుళం జిల్లా ఓ సాహితీ శిఖరాన్ని కోల్పోయింది. శ్లోకం, పద్యం, గద్యం, కవిత్వం, నవల, కావ్యం, నాటిక, నాటకం, వ్యాసం ఇలా అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఎందరో మహనీయుల ప్రశంసలు అందుకున్నారు భావశ్రీ. సొంతపేరు రామారావు అయినా భావశ్రీగానే ప్రసిద్ధి పొందారు. 1935 జనవరి 26న పుట్టిన ఈయన 13వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు. వృత్తి రీత్యా తెలుగు పండితుడిగా వేలాది మంది శిష్యులను తయారుచేశారు. వృత్తిపై ఉన్న మక్కువతో ఉద్యోగ విరమణ అనంతరం కూడా రాజాం సెయింటాన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వ హించారు. అనేక గ్రంథ రచనలు చేయడంతో పాటు వివిధ భాషల్లో ఉన్న సాహిత్యాన్ని ఆంధ్రీకరించి విశిష్ట మన్ననలను అందుకున్నారు. సుదీర్ఘకాలం ప్రముఖ పత్రికల్లో పాత్రికేయుడిగా వ్యవహరించి ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా కథనాలు రాశారు.  

రచయితగా...

పంచవటి, రుక్మిణి కృష్ణ, హృదయవీణ, వెన్నెల వెలుగులు, భారత రామాయణం, షేక్‌స్పియర్‌ రాగాలు, పారిజాత పరిమళాలు, కాదేదీ కవితకనర్హం, మానవా.. ఇంకా మానవా, స్వాతంత్య్రరథం, జీవితచక్రం వంటి 70కి పైగా విభిన్న సాహితీ ప్రక్రియలు, సంగీత రూపకాలు, నాటి కలు, నాటకాలు రచించారు. సజీవ మూర్తులు, శాంతిసమరం, బందరు పిచ్చోడు, అగ్నిశిఖరం వంటి చిత్రాలకు గీతరచన చేశారు. ఎస్‌సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ పుస్తక రచనల్లో పాలుపంచుకున్నారు. ఆకాశవాణిలో 500కి పైగా ప్రసంగాలు చేశారు. ఈయన రచించిన గోదా గీతమాలిక ఆంధ్రీకరణ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముద్రించింది.

అవార్డులు ఇలా..

భావశ్రీ ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేతుల మీదుగా అందుకున్నారు. 1993లో ఏపీ శిష్టకరణ అసోసియేషన్‌చే కళాబంధు పురస్కారం.. 2002లో విశాఖలో నాట్యరవళి ప్రతిభ.. 2003లో విశాఖలో కళారత్న..., 2006లో పలాస- కాశీ బుగ్గలో లలిత కళారంజని వారిచే సాహిత్య బంధు.. 2008లో తెలుగు నాటకరంగ దినోత్సవంలో ఉత్తమ కవిగా.. 2009లో బొబ్బిలి విజ్ఞాన వివర్థిని పరిషత్‌ వారిచే సాహితీ, కవితా.. 20012లో హైదరాబాద్‌లో కౌముది సంస్థ వారిచే.. 2012లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో కవితా సమ్మేళనంలో పురస్కారాలను అందుకున్నారు. 

భావశ్రీ మృతికి సంతాపం

జిల్లా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడిగా, అధికార భాషాసంఘం సభ్యుడిగా పనిచేసిన భావశ్రీ  మాస్టార్‌ మృతి సాహితీ రంగానికి తీరని లోటని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు, రాజాం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌, మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి అన్నారు.  ఆయన మృతికి సం తాపం వ్యక్తంచేశారు. రాజాం రచయితల వేదిక ప్రతినిధులు గార రంగనాఽథం, వరలక్ష్మి సెయింటాన్స్‌ యాజమాన్యం, రాజాం జర్నలిస్ట్‌ ఫోరం ప్రతినిధులు, సంతవురిటి గ్రామస్థులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-12-04T05:24:07+05:30 IST