భారత్ బయోటెక్ అదనపు డోసులు ఇవ్వలేమంది: మనీష్ సిసోడియా

ABN , First Publish Date - 2021-05-12T20:15:03+05:30 IST

దేశ రాజధానికి అదనపు కొవాగ్జిన్ డోసులు సరఫరా చేయలేమని భారత్ బయోటెక్ అసక్తత...

భారత్ బయోటెక్ అదనపు డోసులు ఇవ్వలేమంది: మనీష్ సిసోడియా

న్యూఢిల్లీ: దేశ రాజధానికి అదనపు కొవాగ్జిన్ డోసులు సరఫరా చేయలేమని భారత్ బయోటెక్ అసక్తత వ్యక్తం చేసినట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ప్రభుత్వ అధికారుల (కేంద్ర అధికారుల) ఆదేశాల మేరకు తాము అదనపు డోసులు ఇవ్వలేమని భారత్ బయోటెక్ సమాధానమిచ్చినట్టు చెప్పారు. పరోక్షంగా వ్యాక్సిన్ సరఫరాను కేంద్రం నియంత్రిస్తోందని సిసోడియా విమర్శించారు. ఢిల్లీలో కొవాగ్జిన్ స్టాక్ అయిపోయిందని, దీంతో 17 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సుమారు 100 వ్యాక్సినేషన్ సెంటర్లు మూతపడ్డాయని ఆయన తెలిపారు.


కేంద్రం యావద్దేశాన్ని పాలించే ప్రభుత్వంగా వ్యవహరించాలని, తన బాధ్యతను గుర్తెరిగి, అన్ని ఎగుమతులు నిలిపివేయాలని డిప్యూటీ సీఎం వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. రెండు వ్యాక్సిన్ తయారీ కంపెనీల ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకుని పెద్దఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి జరపాలన్నారు. ఇండియాలో వినియోగానికి వీలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని సిసోడియా విజ్ఞప్తి చేశారు. 


భారత్ బయోటెక్ స్పందన...

కాగా, తమ కంపెనీ స్పందనపై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదుల పట్ల భారత్ బయోటెక్ సహ-వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లా ఓ ట్వీట్‌లో స్పందించారు. ''ఈనెల 10న కొవాగ్జిన్‌ను 18 రాష్ట్రాలకు చిన్న షిప్‌మెంట్స్‌లో పంపాం. మా ఉద్దేశాలపై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదులు మాకు నిరుత్సాహం కలిగిస్తున్నాయి. కోవిడ్ కారణంగా 50 శాతం మంది ఉద్యోగులు అందుబాటులో లేని పరిస్థితి. కోవిడ్ లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ రేయింబవళ్లు మీ కోసం కష్టపడుతున్నాం' అని సుచిత్ర ఎల్లా తెలిపారు.

Updated Date - 2021-05-12T20:15:03+05:30 IST