భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

ABN , First Publish Date - 2022-08-08T05:29:51+05:30 IST

యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం, వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దర్శనాలు, మొక్కుపూజల క్యూలైన్లలో భక్తుల సంచారంతో కోలాహ లం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాల కు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు.

భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం
పవిత్రోత్సవాల ప్రారంభం సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు.. కోటి కుంకుమార్చన


యాదగిరిగుట్ట, ఆగస్టు7: యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం, వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దర్శనాలు, మొక్కుపూజల క్యూలైన్లలో భక్తుల సంచారంతో కోలాహ లం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాల కు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. యాదగిరి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఆదివారం నిత్యారాధనలు, కోటికుంకుమార్చన పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ప్రధానాలయ ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ కోటికుంకుమార్చన పూజలు నిర్వహించారు. కుంకుమార్చనపూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకు లు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. వివిధ విభాగా ల ద్వారా ఆలయ ఖజానాకు రూ.25,83,728 ఆదాయం సమకూరింది. 


హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నందా ప్రత్యేక పూజలు 

లక్ష్మీనృసింహుడిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆమెకు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగ తం పలికారు. ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్న ఆమె ముఖమండపం లో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా, దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఇదిలా ఉండగా స్వామిని రాష్ట్ర సమాచార కమిషనర్‌ బుద్ధా మురళీ దర్శించుకున్నారు.


పవిత్రోత్సవాలకు శ్రీకారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఆదివారం సాయంత్రం పవిత్రోత్సవాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఆరంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించను న్న మహోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవతల సేనాని విశ్వక్సేనుడికి తొలిపూజలతో పవిత్రోత్సవ ఘట్టాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. అనంతరం శాంతిమంత్ర పఠనాలతో స్వస్తిపుణ్యాహవాచనం నిర్వహించి, పవిత్ర మంత్ర జలాలతో ప్రధానాలయం, ఆలయ పరిసరాలను శుద్ధిచేశారు. ముఖమండపంలో ఉత్సవమూర్తులకు నవకలశాలతో స్నపన తిరుమంజనాలు చేసిన అర్చకులు దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదిక పై అధిష్ఠింపజేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవ ముఖ్యఘట్టమైన అంకురారోపణపర్వాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత మొదటిసారిగా కొనసాగుతున్న వేడుకల్లో గర్భాలయంలోని స్వయంభువులను, సువర్ణప్రతిష్ఠా అలంకార కవచమూర్తులను ఆరాధిస్తూ విశేషపూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి సన్నిధిలో పవిత్రోత్సవాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. ఆలయంలో నిత్యవిధి కైంకర్యాల్లో దొర్లిన పొరపాటుల నివారణ, క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరిం త ఇనుమడింపజేసేందుకు శ్రీవైష్ణవ దేవాలయాల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని, యా దాద్రి క్షేత్రంలో ప్రతీ సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారని ఆచార్యులు పేర్కొన్నారు. ఈ వైశేషిక పూ జా పర్వాలను దేవస్థాన అర్చక బృందం నిర్వహించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:29:51+05:30 IST