మసీదులో భాగవత్‌

ABN , First Publish Date - 2022-09-23T07:39:20+05:30 IST

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ న్యూఢిల్లీలోని ఓ మసీదును గురువారం సందర్శించారు. ఆయన తొలిసారిగా ఓ మదర్సాకు వెళ్లి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. కస్తూర్భాగాంధీ మార్గ్‌లోని ఓ మసీదును సందర్శించిన భాగవత్‌..

మసీదులో భాగవత్‌

తొలిసారిగా ఓ మదర్సా సందర్శన


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ న్యూఢిల్లీలోని ఓ మసీదును గురువారం సందర్శించారు.  ఆయన తొలిసారిగా ఓ మదర్సాకు వెళ్లి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. కస్తూర్భాగాంధీ మార్గ్‌లోని ఓ మసీదును సందర్శించిన భాగవత్‌.. అఖిల భారత ఇమామ్‌ సంస్థ అధ్యక్షుడు ఉమర్‌ అహ్మద్‌ ఇలియాసితో సమావేశమయ్యారు.  ఈ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఇలియాసి.. భాగవత్‌ను ‘జాతిపిత’ అంటూ అభివర్ణించారు. తమ ఆహ్వానం మేరకే భాగవత్‌ మసీదుకు వచ్చారని, దేశ సమగత్రకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని చెప్పారు. అంతేకాక, తమ డీఎన్‌ఏలు ఒక్కటేనని, దేవుని ఆరాధించే విధానాలే వేరని పేర్కొన్నారు. మసీదులో సమావేశం అనంతరం ఇలియాసితో కలిసి స్థానికంగా ఉన్న ఓ మదర్సాను భాగవత్‌ సందర్శించారు. భాగవత్‌ ఓ మదర్సాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని ఆయన వెంట ఉన్న ఆరెస్సెస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. మదర్సా విద్యార్థులకు భాగవత్‌ గురించి చెప్పేటప్పుడు ఇలియాసి జాతిపిత అనే మాట వాడారని, కానీ భాగవత్‌  వెంటనేవారించారని ఆరెస్సెస్‌ వర్గాలు వెల్లడించాయి.


దేశానికి జాతిపిత ఒక్కరే ఉన్నారని భాగవత్‌ స్పష్టం చేశారని వివరించాయి. కాగా, మత సామరస్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పలువురు ముస్లిం మత పెద్దలు, మేధావులతో ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ ఇటీవల సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం మత పెద్దలతో భాగవత్‌ సమావేశాలపై ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఈ భేటీ వల్ల ఒరిగేదేమి లేదని ఒవైసీ అన్నారు.

Updated Date - 2022-09-23T07:39:20+05:30 IST