భగ్గుమన్న కళాకారులు

ABN , First Publish Date - 2022-01-20T04:49:35+05:30 IST

వందేళ్ల చరిత్ర కలిగిన చింతామణి నాటకానికి ప్రభుత్వం సంకెళ్లు వేసిందంటూ విజయనగరం కళాకారులు భగ్గుమన్నారు. ఇది ప్రభుత్వ అనాలోచిత ఆలోచనగా అభివర్ణించారు. కలెక్టరేట్‌ సమీపంలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బుధవారం జిల్లా రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

భగ్గుమన్న కళాకారులు
నిరసన ప్రదర్శనలో కళాకారులు

చింతామణి నాటకం నిషేఽధంపై ఆందోళన

విజయనగరం(ఆంధ్రజ్యోతి), జనవరి 19: వందేళ్ల చరిత్ర కలిగిన చింతామణి నాటకానికి ప్రభుత్వం సంకెళ్లు  వేసిందంటూ విజయనగరం కళాకారులు భగ్గుమన్నారు. ఇది ప్రభుత్వ అనాలోచిత ఆలోచనగా అభివర్ణించారు. కలెక్టరేట్‌ సమీపంలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బుధవారం జిల్లా రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో  నిరసన తెలిపారు. చింతామణి నాటకం ప్రదర్శించేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సుబ్బిశెట్టి పాత్రధారి జీవీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ, ఇప్పటికే కరోనా వల్ల రెండేళ్లపాటు జీవనోపాధి కోల్పాయామని, చింతామణి నాటకాన్ని నిషేధించటంతో రాష్ట్రంలో వేలాది మంది కళకారులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతామణి పాత్రధారిణి  బత్తిలి లక్ష్మీ మాట్లాడుతూ మనిషి ఎలా బతకాలి.. ఎలా ఆలోచించాలి అన్న నీతిని చాటి చెప్పే అపూర్వ నాటకంగా పేరొందిన చింతామణిపై నిషేధం విధించడం భావ్యంకాదని, ఇప్పటికే కరోనాతో కళాకారుల జీవితాలు కకావికలమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కళకారులు మరింత ఇబ్బందులు పడతారంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. నాటకంలో వైశ్యులను ఇబ్బంది పెట్టే సన్నివేశాలుంటే తొలగిస్తామని, పూర్తిగా నాటకాన్ని నిషేధించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్‌సత్తా పార్టీ  రాష్ట్ర ఆధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ నాటకాలు, నాటికలు మానవ స్వభావాలను మాత్రమే చూపిస్తాయన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-20T04:49:35+05:30 IST