సివిల్స్‌లో భద్రాద్రి వాసికి 637వ ర్యాంకు

ABN , First Publish Date - 2022-05-31T04:29:14+05:30 IST

సివిల్స్‌లో భద్రాద్రి వాసికి 637వ ర్యాంకు

సివిల్స్‌లో భద్రాద్రి వాసికి 637వ ర్యాంకు

నా లక్ష్యం ఐఏఎస్‌.. మళ్లీ రాస్తా: పోరిక మౌనిక

భద్రాచలం, మే 30: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి చెందిన పోరిక మౌనిక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాల్లో 637 ర్యాంకు సాధించారు. సోమవారం సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకులను యూపీఎస్సీ ప్రకటించగా భద్రాచలానికి చెందిన పోరిక రామ్‌కుమార్‌ -వాణికుమారిల కుమార్తె మౌనిక 637వ ర్యాంకు సాధించడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మౌనిక తండ్రి రామ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జనరల్‌ మేనేజరుగా పనిచేస్తుండగా వాణికుమారి పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. మౌనిక తన ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకు అంతా హైదరాబాద్‌లో చదివి బ్యాచలర్‌ ఆఫ్‌ ఫార్మసీ పట్టాను పొందారు. ఆరోసారి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరైన ఆమె 637వ ర్యాంకు సాధించడంతో ఐపీఎ్‌సకు ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. తొలినుంచి తనకు ఐఎఎస్‌ సాధించడమే లక్ష్యమని, ఈ క్రమంలో తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్‌లో ర్యాంకు సాధించగలిగానని తెలిపారు. అంతకుముందు వివిధ కారణాలతో సివిల్స్‌కు ఎంపిక కాలేకపోయినా ఎక్కడ లోపముందనే అంశాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి నిలిపినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోసారి ఆంత్రోపాలజీని ప్రత్యేక అంశంగా తీసుకొని ర్యాంకు సాధించానన్నారు. తన ర్యాంకు ఆధారంగా ఐపీఎ్‌సకు ఎంపికయ్యే అవకాశం ఉందని, ఐపీఎ్‌సకు సంబంధించిన శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్‌కు సిద్ధమవుతానని, తన లక్ష్యం ఐఏఎస్‌ అని మౌనిక తెలిపారు. అపజయాలే విజయానికి సోపానాలని అపజయం చెందినంత మాత్రాన నిరాశ పడకుండా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలన్నారు. 

Updated Date - 2022-05-31T04:29:14+05:30 IST