Abn logo
Jun 2 2020 @ 10:54AM

పిన్న వయసులోనే పెద్ద చరిత్రలు

వెలుగులోకి సందీప్, పండు దందాలువిజయవాడ(ఆంధ్రజ్యోతి): బెజవాడ ‘రియల్’ గ్యాంగ్ కథలు మెల్లగా బయటకొస్తున్నాయి. శనివారం డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్‌వార్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘర్షణకు కారణమైన సందీప్, మణికంఠ అలాయాస్ కేటీఎం పండు చరిత్రలను తవ్వి తీస్తున్నారు. ఇద్దరిపైనా పలు స్టేషన్లలో ఉన్న కేసులకు సంబంధించిన ఫైళ్లను వెలికితీశారు. కాగా ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన తోట సందీప్ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కొవిడ్ చట్టం ప్రకారం స్వర్గపురిలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


బెజవాడలో గ్యాంగ్‌వార్‌లో కీలకమైన తోట సందీప్‌, మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు చరిత్రలను పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అటు సందీప్‌, ఇటు మణికంఠ అలియాస్‌ కేటీఎం పండులపై వివిధ పోలీస్‌స్టేషన్లలో ఉన్న కేసులకు సంబంధించిన ఫైళ్లను బయటకు తీశారు. సందీప్‌పై 13 కేసులు పటమట పోలీస్‌స్టేషన్‌లో ఉండగా, పండుపై మూడు కేసుల వరకు ఉన్నాయి. డొంకరోడ్డులో పండు గ్యాంగ్‌ సాగించిన కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు. పటమట పోలీసులు సందీప్‌, మణికంఠలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్యాంగ్‌వార్‌ విషయాన్ని పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసుల ద్వారా ఈ గ్యాంగ్‌లకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. రాళ్లు రువ్వుతూ, కత్తులు తిప్పుతూ డొంకరోడ్డులో జరిగిన ఘర్షణలో పాల్గొన్న అందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతోపాటు కొవిడ్‌ -19 చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరి పైనా రౌడీషీట్‌ను తెరుస్తున్నారు. 


మార్చురీ వద్ద బందోబస్తు

తీవ్రగాయాలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్‌కు విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రి మార్చురీలో కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇక్కడికి సందీప్‌ అనుచరులు భారీగా వచ్చే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి, డెంటల్‌ ఆస్పత్రి, ప్రభుత్వాసుపత్రి మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఇక్కడికే సందీప్‌ కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సందీప్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబీకులు నిర్ణయించారు. దీనికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 చట్టం అమల్లో ఉన్నందున కుదరదని తేల్చి చెప్పేశారు. అంబులెన్స్‌లో నేరుగా కృష్ణలంక స్వర్గపురికి తీసుకెళ్లారు. 


రాజకీయాలవైపు చూపు

సందీప్‌ భార్య తేజస్విని రాజకీయాల్లో దింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వీఎంసీ ఎన్నికల్లో మూడో డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలపాలని భావించినా, ఆమెకు ఓటు హక్కు లేకపోవడంతో మరో అభ్యర్థిని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. 


వెలుగులోకి పండు దందాలు

మణికంఠ అలియాస్‌ పండు దందాలు వరసగా బయటకు వస్తున్నాయి. ఇంటి పన్నును పెంచినందుకు ఏకంగా పంచాయతీ కార్యదర్శిపైకి పండు తన అనుచరులతో వెళ్లాడని సమాచారం. కానూరు సనత్‌నగర్‌లో ఉన్న ఇంటికి రెండేళ్ల క్రితం ఇంటి పన్నును పెంచారు. దీనిపై పండు తల్లి పద్మ పంచాయతీ కార్యదర్శితో వివాదానికి దిగింది. ఈ సమయంలో కార్యదర్శి ఆమెపై కేకలు వేశారు. ఈ విషయాన్ని పద్మ తన కుమారుడికి చెప్పడంతో పండు గ్యాంగ్‌ను వెంటేసుకుని కార్యదర్శిపై గొడవకు వెళ్లినట్టు తెలిసింది. 


తండ్రి కోసం చిన్నారి రోదన 

తనకు రోజూ ముద్దులిచ్చే నాన్న ఇక రాడని ఏడాది వయసున్న ఆ చిన్నారికి తెలియదు. సందీప్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా కృష్ణలంకలోని స్వర్గపురికి చేరుకున్నారు. తేజస్విని తన కుమార్తెతో ఇక్కడికి వచ్చింది. తను పిలిచినా తండ్రికి వినిపించదని తెలియని ఆ చిన్నారి తండ్రి కోసం రోదిస్తున్న తీరు చూపరుల కంటతడి పెట్టించింది. ఆ చిన్నారి తండ్రి కోసం వెక్కివెక్కి ఏడుస్తుంటే.. కుమార్తెను భుజాన వేసుకుని, దుఃఖంతో తేజస్విని తల్లడిల్లిపోయింది. 

Advertisement
Advertisement
Advertisement