రైతులకు మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2022-08-19T05:32:31+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను రైతుల దరికి చేర్చడంతో పాటు సాగులో మెళకువలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో జిల్లా వ్యవసాయ శాఖ ముందుంటున్నది.

రైతులకు మెరుగైన సేవలు
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా కేవైసీ చేస్తున్న వ్యవసాయ శాఖాధికారులు(ఫైల్‌)

- సమన్వయంతో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది

- పథకాలు, సాగులో మెళకువలపై అవగాహన

- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను రైతుల దరికి చేర్చడంతో పాటు సాగులో మెళకువలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో జిల్లా వ్యవసాయ శాఖ ముందుంటున్నది. గతంలోకంటే జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తొలగిపోతున్నాయి. రైతులకు అందుబాటులో ఉండి సేవలను అందించడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు కూడా అధికారులు, సిబ్బందికి సహకరిస్తున్నారు. 

రెండవ స్థానంలో జిల్లా..

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వ్యవసాయ శాఖ పని తీరుపై ప్రతి పదిహేను రోజులకోసారి ఆ శాఖ నివేదికలు తయారుచేస్తుంది. అందులో భాగంగా ఈనెల 13వ తేదీన విడుదల చేసిన నివేదికల్లో జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. మొత్తం వంద పాయింట్లకు 64.58 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 66.84 పాయింట్లతో ఆదిలాబాద్‌  జిల్లా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల అమలుతో పాటు, ఇతర పథకాలు, శాఖ పనితీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. రైతులు ఏయే పంటలు వేశారనే విషయమై చేపట్టే క్రాప్‌బుకింగ్‌లో 40 పాయింట్లకు గాను 15.12 పాయింట్లు పొందారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కేవైసీ చేయడంలో 30 పాయింట్లకు 22.48 పాయింట్లు, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు రైతు బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు 30 పాయింట్లకు గాను 26.93 పాయింట్లు సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు 2018 యాసంగి సీజన్‌ నుంచి రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నది. ఈ పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున అందజేస్తున్నది. అలాగే రైతులు ఏ కారణాల చేతనైనా మరణించినా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ప్రతి ఏటా పట్టాదారు పాసుపుస్తకాలు పొందుతున్న వారందరికీ రైతుబంధుతో పాటు రైతుబీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నది. రైతుబీమా పథకాన్ని కొత్త రైతులకు వర్తింపజేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు రైతుల వద్దకే వెళ్లి కావాల్సిన పత్రాలను తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో ఏయే రైతు ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే విషయమై కూడా సిబ్బంది చురుగ్గా క్రాఫ్‌ బుకింగ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసి కేవైసీ చేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు గ్రామాలకే వెళ్లి నమోదు చేశారు. ఈ విషయంలో రాష్ట్రంలో మిగతా జిల్లాలకంటే జిల్లాను ముందుంచారు. కేవైసీ చేసుకోలేని వారికి పథకాన్ని వర్తింపజేయమని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున అందజేస్తున్నది. ఈ సొమ్మును మూడు విడతల్లో 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్రం జమచేస్తున్నది. ఈ పథకం కూడా అర్హులైన వారికందరికీ లబ్ధి చేకూరేలా కేవైసీపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించి చైతన్యపరిచారు. స్వయంగా వాళ్లే ల్యాప్‌టాప్‌లతో గ్రామపంచాయతీలు, రైతు వేదికల వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌ చేశారు. 95 శాతానికి పైగా రైతులు కేవైసీ చేసుకోగలిగారు. గతంతో పోలిస్తే జిల్లాలో వ్యవసాయ శాఖ పనితీరు మెరుగుపడిందని రైతులు అంటున్నారు. 

Updated Date - 2022-08-19T05:32:31+05:30 IST