లాక్‌ డౌన్‌ తరవాత లక్కీ డేస్‌?

ABN , First Publish Date - 2020-05-01T02:43:33+05:30 IST

నిజంగా వైరస్‌, లాక్‌ డౌన్‌ ఈ జనంలో మార్పుని తీసుకొచ్చాయా? పరిశుభ్రతలో, పక్కవాడి బాధను గుర్తించడంలో జనం బెటర్‌ అయ్యారా? లాక్‌ డౌన్‌ అనంతరం...

లాక్‌ డౌన్‌ తరవాత లక్కీ డేస్‌?

నిజంగా వైరస్‌, లాక్‌ డౌన్‌ ఈ జనంలో మార్పుని తీసుకొచ్చాయా? పరిశుభ్రతలో, పక్కవాడి బాధను గుర్తించడంలో జనం బెటర్‌ అయ్యారా? లాక్‌ డౌన్‌ అనంతరం జీవితాలు ఇప్పటికంటే బెటర్‌‌గా ఉంటాయా? మరి రాంజీ, బాబ్జీలు ఏం చెబుతున్నారో చూడండి.


టెక్‌ టాక్‌ : కరోనానంతర ప్రపంచం


రాంజీ : ఏరా బాబ్జీ కరోనా తరవాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటావ్‌?


బాబ్జీ : ఏవుందిరా, ఎప్పటిలాగే ఉంటుంది. పెద్దేం మారిపోతుందా ఏంటి?


రాంజీ : అదేంట్రా అలా అంటావ్‌? చాలా మారిపోతుందట. రేపు ప్రపంచ చరిత్ర రాసుకుంటే - కరోనాకి ముందు, కరోనాకి తరవాత అని - రెండు రకాలుగా రాసుకోవాల్సొస్తుంది. ఆ లెవెల్లో మారిపోతుందిట. మేధావులంతా అదే ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు, తెలుసా?


బాబ్జీ : ఆ మేధావుల్లో నువ్వు కూడా ఉన్నావ్‌. అవునా?


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )


రాంజీ : అది కాదురా బాబ్జీ. మొన్నటిదాకా జనం... బయటికి పోకపోతే అసలు బతకలేం అనుకునేవారు. ఈ లాక్ డౌన్స్‌ వల్ల - ఇంట్లోనే బతకడం ఇంపాజిబుల్‌ కాదు - అని అర్థమయింది కదా?


బాబ్జీ : ఎల్లకాలం పాజిబుల్‌ అవుతుందా ఏంటి?


రాంజీ : అవ్వదు గానీ... ప్రపంచంలో ఇప్పుడు ప్రయారిటీలు మొత్తం మారిపోయాయిరా! ముఖ్యంగా మనం మాట్లాడుకునే టెక్నాలజీ విషయమే తీసుకో ...


బాబ్జీ : ( బ్లింక్‌ )


రాంజీ : ఇక మీదట ఆఫీసులకి పోయి చేసే ఉద్యోగాలు తగ్గిపోతాయ్‌. ఆన్‌లైన్‌ ఉద్యోగాలు పెరిగిపోతాయ్‌.


బాబ్జీ : ఉద్యోగాల ప్రయారిటీలు ముఖ్యం కాదురా... ముందు జనానికి ఫుడ్‌ పెట్టే వ్యవసాయానికీ, దానికోసం కష్టపడే రైతుకీ ప్రయారిటీ పెరగాలి. జనం నేర్చుకోవాల్సింది అదీ! మారాల్సింది అక్కడ!


రాంజీ : మారతార్రా. చావుని దగ్గరగా చూశాక... చచ్చిపోతామేమో అని భయం కలిగాక... మనిషన్నవాడు కొంతయినా మారతాడు.


బాబ్జీ : అంటే... లాక్‌ డౌన్‌ తరవాత ప్రపంచం స్వర్గం అయిపోతుంటావ్‌?


రాంజీ : మరీ స్వర్గం అయిపోదుగానీ... మనుషులు ఇప్పటికంటే బెటర్‌గా మాత్రం ఆలోచిస్తారని నాకు నమ్మకం. అది కూడా లాక్‌ డౌన్‌ అయిపోయిన వెంటనే కాదులే ... కరోనా మొత్తం పోయిన తరవాత...


బాబ్జీ : కరోనా మొత్తం పోయాక మనిషి కరెక్ట్‌గా ఎలా ఆలోచిస్తాడ్రా? కొత్త సిట్యుయేషన్లని బట్టి మళ్లీ ఎప్పటిలా స్వార్థాలూ... దరిద్రాలూ... నాకయితే ఈ మనుషులు గొప్పోళ్లయిపోతారని నమ్మకమేం లేదు.


రాంజీ : మరీ పెసిమిస్టిక్‌గా మాట్లాడకురా. ఈ మనుషులు కచ్చితంగా మారారు. చస్తావనేసరికి శుభ్రం పెరిగింది. ప్రమాదం అనేసరికి కుటుంబం మీద ప్రేమ పెరిగింది. ఇదివరకు ఏం చేస్తున్నామో ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా ఏదో వేగంలో పడి కొట్టుకుపోయేవారు. ఇప్పుడు చూడు... ఆగి లైఫ్‌ని ఎనలైజ్‌ చేసుకుంటున్నారు.


బాబ్జీ : అబ్బో.


రాంజీ : అదేంట్రా వెటకారం? జనం మారలేదంటావా? ఇక మారరంటావా?


బాబ్జీ : నువ్ చెప్పిందే ఇప్పుడు నా యాంగిల్లో చెబుతాను చూడు. చచ్చిపోతావ్‌ అంటే గానీ మనిషి శుభ్రంగా ఉండడు. ప్రమాదం వచ్చిందిరా అంటే తప్ప కుటుంబం ఇంపార్టెన్స్‌ గుర్తించడు. ఇన్ని రోజులు ఇంట్లో లాక్‌ చేసి పారేస్తే తప్ప - లైఫ్‌ గురించి ఆలోచించే మెచ్యూరిటీ లేదు. ఇదిరా ఈ జనం స్థాయి.


రాంజీ : ( బ్లింక్‌ )


బాబ్జీ : ఒరే... మనుషులు ఎలాంటోళ్లో తెలుసా? ... ఆయనెవడో మహానుభావుడు చెప్పినట్టు... స్ప్రింగ్‌ సోఫాలాంటోళ్లు... పైన.. బరువు ఉన్నంత సేపే.. సోఫా అణగిమణిగి ఉంటుంది. కూర్చున్నోడు లేవగానే కుషన్‌ కాస్తా పైకి లేచిపోతుంది. ఏదో ఈ కరోనా భయం ఉన్నంత సేపే ఈ మంచి మాటలూ ఆదర్శాలూనూ... రేపు ఈ భయం కాస్తా తొలగిపోగానే చూడు... మళ్లీ ఎవడి ఎదవ బుద్ధులు వాడికొచ్చేస్తాయ్‌.


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )


రాంజీ : ఓకే. మనిషి అంత ఈజీగా మారడు, రైటేరా! కానీ చావు భయం ఉంది చూశావా? అది మనిషిని మహా గొప్పగా మార్చేస్తుందట. మృత్యుస్మరణం మనస్సులో మహా పరిణామం తీసుకొస్తుందని... పెద్దలు చెబుతారు.


బాబ్జీ : ఏంటోరా... ఈ మధ్య టెక్నాలజీ చెప్పమంటే నువ్వు ఫిలాసఫీలూ స్పిరిట్యువాలిటీలూ ఎక్కువ చెబుతున్నావ్‌.


రాంజీ : సరే. నువ్వొప్పుకున్నా ఒప్పుకోకపోయినా .. కరోనా తరవాత మాత్రం ప్రపంచం ఇదివరకటిలా ఉండదురా.


బాబ్జీ : ( బ్లింక్‌ )


రాంజీ : ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక విషయాలు మొత్తం మారిపోయాయ్‌. ఉద్యోగాల్లో టోటల్‌గా ఛేంజ్‌ వచ్చేస్తుంది. మనుషులకి రిలేషన్‌షిప్స్‌లో కంప్లీట్‌గా కొత్త అవగాహన వచ్చింది. శుభ్రత పెరిగింది. కాబట్టి ప్రపంచం ఇదివరకటిలా ఉండడం మాత్రం అసాధ్యం. కచ్చితంగా బెటరవుతుంది.


బాబ్జీ : ఒరే నువ్వు చెప్పినట్టు ప్రపంచం గొప్పగా మారిపోదో లేదోగానీ... ఊహించుకోవడం మాత్రం ఆనందంగానే ఉందిరా. లైఫ్‌ గొప్పగా మారితే సంతోషం. కానీ దానికంటే గొప్ప సంతోషం ఏంటో తెలుసా? రేపు కరోనా ఉండదు.. అన్న ఫీలింగ్‌!


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

Updated Date - 2020-05-01T02:43:33+05:30 IST