Acb కంటికి పెద్దల అవినీతి కనిపించదా?

ABN , First Publish Date - 2022-07-01T17:51:09+05:30 IST

అవినీతి నిరోధక దళం (ఏసీబీ) కంటికి చిన్న చిన్న గుమాస్తాలు మాత్రమే కనిపిస్తున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర పెద్దల అవినీతి పట్టదా? అంటూ

Acb కంటికి పెద్దల అవినీతి కనిపించదా?

                                                - హైకోర్టు న్యాయమూర్తి గరం


బెంగళూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక దళం (ఏసీబీ) కంటికి చిన్న చిన్న గుమాస్తాలు మాత్రమే కనిపిస్తున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర పెద్దల అవినీతి పట్టదా? అంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు నగర జిల్లాధికారి కార్యాలయంలోని ఉపతహిసీల్దార్‌ పీఎస్‌ మహేష్‌ బెయిల్‌ పిటీషన్‌పై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి హెచ్‌పి. సందేశ్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉప తహసీల్దార్‌ తరుపు న్యాయవాది పిఎన్‌. పొన్నణ్ణ తన వాదన వినిపించేందుకు సిద్ధం కాగా ఏసీబీ తరుపు న్యాయవాది పీఎన్‌ మనమోహన్‌ జోక్యంచేసుకుంటూ ఈ కేసులో జిల్లా కలెక్టర్‌ జె. మంజునాధ్‌ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కేసును కొట్టివేయాలంటూ ఆయన తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో హైకోర్టు న్యాయమూర్తి ఏసీబీని ఉద్దేశించి సందేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతిని కూకటి వేళ్ళతో సహా పెకలించివేయాల్సిన ఏసీబీ అవినీతికి కేంద్రబిందువుగా మారిందని ఏసీబీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా హైకోర్టు ధర్మాసనం తాజాగా ఏసీబీ చేసిన వ్యాఖ్యలను    ఆమ్‌ఆద్మీపార్టీ స్వాగతించింది. అవినీతి నిరోధక దళం అలంకార ప్రాయంగా మారిందని దీనికి తక్షణం ప్రక్షాళన చేపట్టాలని ఆప్‌ అధ్యక్షుడు పృథ్విరెడ్డి డిమాండ్‌ చేశారు. కాగా ఏసీబీ అవినీతికి కేంద్రబిందువుగా మారిందంటూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీపార్టీ నేతలు గురువారం బెంగళూరు ఖనిజభవన్‌లోని ఆ సంస్ధ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఏసీబీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్‌నేతలను పోలీసులు అరెస్టుచేశారు.

Updated Date - 2022-07-01T17:51:09+05:30 IST