- చిరు జల్లులు, చల్లటి గాలులతో జనం గజగజ..
- విలవిలలాడిన లోతట్టు ప్రాంతవాసులు
బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరం గురువారం ఊటీని తలపించింది. ఉదయం నుంచే చిరు జల్లులు, చల్లటి గాలులతో ప్రజలను గజగజ వణికించింది. భారీ వర్షాల దెబ్బకు విలవిల్లాడిన నగరంలోని లోతట్టు ప్రాంతాల వాసులు క్రమేపీ కుదుటపడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టిని తలచుకుంటూ హడలిపోతున్నారు. కేవలం రెండు గంటల కుండపోత వర్షం నగరంలో జలప్రళయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఆ రెండు గంటల్లో 75 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం కూడా భారీగా వర్షం పడుతుందని అంచనా వేసినప్పటికీ పరిస్థితి సాధారణంగానే ఉండటంతో ఒకింత ఊపిరిపీల్చుకున్నారు. వాతావరణం హఠాత్తుగా మారిపోవడంతో నగర రహదారులపై గత రెండు రోజులుగా జనసంచారం కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. మంగళవారం నాటి కుంభవృష్టి దెబ్బకు కుప్పకూలిన వృక్షాలను తొలగించే పనిని బీబీఎంపీ సహాయక బృందం గురువారం కూడా కొనసాగించింది. సగానికి కూలిన చెట్లను సైతం ముందు జాగ్రత్తగా తొలగిస్తున్నారు. గత మూడు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో 100కు పైగా చెట్లు కూలినట్లు బీబీఎంపీ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు.
ఇవి కూడా చదవండి