టీఎంసీలో చేరిన బెంగాల్ నటి సాయంతిక బెనర్జీ

ABN , First Publish Date - 2021-03-03T18:45:31+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని టీవీ, సినీ నటులు రాజకీయాల్లోకి వసల కడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల్లోనే వీరంతా చేరుతున్నారు

టీఎంసీలో చేరిన బెంగాల్ నటి సాయంతిక బెనర్జీ

కోల్‌కతా: బెంగాల్ రాజకీయాలు రాను రాను మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది పార్టీల్లో చేరికలు మరింత జోరు అందుకుంటున్నాయి. తాజాగా బెంగాల్ చలన చిత్ర నటి సాయంతిక బెనర్జీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ సినియర్ నేతలు పార్త ఛటర్జీ, సుబ్రతా ముఖర్జీ, బ్రత్య బసు సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.


టీఎంసీలో చేరిన అనంతరం సాయంతిక మాట్లాడుతూ ‘‘నేను మమతా బెనర్జీ నుంచి ఎంతగానో స్ఫూర్తి పొందాను. ఎల్లప్పుడూ ఆమె వెంటే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇంతకు ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇకపై కూడా ఉంటాను. అయితే రాజకీయంగా మద్దతు ఉండాలని టీఎంసీలో చేరాను. ఈ పార్టీలో చేరడం గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పార్టీ ఆదేశాలనుసారం పని చేస్తాను’’ అని అన్నారు.


పశ్చిమ బెంగాల్‌లోని టీవీ, సినీ నటులు రాజకీయాల్లోకి వసల కడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల్లోనే వీరంతా చేరుతున్నారు. శ్రబంతి ఛటర్జీ, యష్, పాయెల్, పాపియా అధికారి లాంటి నటులు కమల తీర్థం పుచ్చుకున్నరు. సయోని ఘోష్, కంచన్ ముల్లిక్, డైరెక్టర్ రాజ్ చక్రవర్తి లాంటి వాళ్లు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.


అయితే రాజకీయ నాయకుల చేరికల్లో ఎక్కువ మంది బీజేపీ వైపే వెళ్తున్నారు. బెంగాల్‌లో టీఎంసీ పెద్ద మొత్తంలో నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బీజేపీకి అంత పెద్దగా క్యాడర్ లేకపోవడం వల్లనే నేతలంగా అటువైపు వెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మార్చి 27 నుంచి 8 విడతల్లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు మే 2న విడుదలకానున్నాయి.

Updated Date - 2021-03-03T18:45:31+05:30 IST