'బంగారు బంగ్లా' కలలు సాకారం చేస్తాం: మోదీ

ABN , First Publish Date - 2021-03-07T21:29:11+05:30 IST

మార్పు కోసం బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీపై ఉంచిన విశ్వాసాన్ని ఆమె వమ్ము చేశారని ..

'బంగారు బంగ్లా' కలలు సాకారం చేస్తాం: మోదీ

కోల్‌కతా: మార్పు కోసం బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీపై ఉంచిన విశ్వాసాన్ని ఆమె వమ్ము చేశారని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ కలిసి ఒకవైపు ఉంటే, బెంగాల్ ప్రజలంతా ఒకవైపు ఉన్నారని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రంలో ప్రచారానికి ఆదివారం వచ్చారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ప్రసంగించారు. మమతా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు.


'బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ మమతా బెనర్జీని నమ్మారు. అయితే మమత, ఆమె కార్యకర్తలు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేశారు. బెంగాల్ ప్రజలను అవమానించారు. సోదరీమణులు, ఆడకూతుళ్లను వేధింపులకు గురిచేసారు. అయితే ఇక్కడి ప్రజలు ఆశావహ దృక్పథాన్ని మాత్రం వదులుకోలేదు' అని మోదీ అన్నారు. 'బంగారు బంగ్లా' కలలు సాకారం చేసేందుకే తాను ఇక్కడకు వచ్చానని, బెంగాల్ అభివృద్ధికి, పెట్టుబడులు పెరిగేందుకు, బెంగాల్ సంస్కృతి పరిరక్షణకు, మార్పు తీసుకువచ్చేందుకు తాను భరోసా ఇస్తున్నానని అన్నారు.


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్, వారి బెంగాల్ వ్యతిరేక వైఖరి ఒకవైపు నిలిస్తే, బెంగాల్ ప్రజలంతా మరోవైపు ఉన్నారని అన్నారు. వందేమాతరం నినాదంతో ప్రధాని తన ప్రసంగం ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో వందలాది ర్యాలీల్లో ప్రసంగించానని, తన సుదీర్ఘ ప్రస్థానంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తనను ఆదరించడం తానెన్నడూ చూడలేదని అన్నారు. మార్పు కోరుకుంటున్న బెంగాల్ ప్రజలు ఎప్పుడూ తమ ఆశలు వదులుకోలేదని, కోల్‌కతా, బెంగాల్ భారతదేశానికి స్ఫూర్తి కేంద్రాలని ప్రశంసించారు. ఎందరో దేశభక్తులను బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ చూసిందని అన్నారు. ఎనిమిది విడతలుగా జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 27న తొలి దశ పోలింగ్‌తో మొదలై ఏప్రిల్ 29తో ముగుస్తాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2021-03-07T21:29:11+05:30 IST