అందరి చూపు బెంగాల్ వైపే.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2021-02-27T00:21:15+05:30 IST

ఒక్క అస్సాం మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు. అస్సాంలో ప్రభుత్వాన్ని నిలుపుకోవడంతో పాటు, సంకీర్ణం నుంచి పూర్తిస్థాయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కమలనాథులు కదుపుతున్నారు

అందరి చూపు బెంగాల్ వైపే.. ఎందుకంటే?

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. ఐదు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగానే జరగనున్నప్పటికీ అందరి చూపు బెంగాల్ వైపే ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. 2016 నాటి ఎన్నికల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలుచుకుని దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పటికే అధికార టీఎంసీకి చెమటలు పట్టిస్తోంది.


దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అమిత్ షా వ్యూహరచన, దేశంలో బీజేపీ పవనాలు బలంగా వీయడం కారణంగా బెంగాల్‌లో ఈసారి కమలం జెండా ఎగురుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున టీఎంసీ నేతల్ని బీజేపీ చేర్చుకుంటూ మమతా పార్టీని రోజు రోజుకూ బలహీన పరుస్తున్నారు. బీజేపీ కూడా ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో బెంగాల్‌నే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్రిపుర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఔరా అనిపించిన అనంతరం తర్వాతి లక్ష్యం ఇక బెంగాల్‌నే అన్నట్లుగా బీజేపీ పని చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగానే చూపించారు. ఇక అసెంబ్లీనే మిగిలి ఉంది.


బెంగాల్‌తో పాటు మిగిలిన రాష్ట్రాలు కీలకమే. కారణం, ఒక్క అస్సాం మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు. అస్సాంలో ప్రభుత్వాన్ని నిలుపుకోవడంతో పాటు, సంకీర్ణం నుంచి పూర్తిస్థాయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కమలనాథులు కదుపుతున్నారు. ఇక తమిళనాడు, కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ.. తమ ప్రభావాన్ని చూపించుకోవాలనే తపనలో ఉన్నారు. ఇక పుదుచ్చేరిలో తాజాగా ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఒక్కసారిగా చూపు బీజేపీప పడింది. పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. ఈ సంఖ్యను పెంచుకుని పుదుచ్చేరి అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరేయాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

Updated Date - 2021-02-27T00:21:15+05:30 IST