Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఇల్లు కట్టలేం!

twitter-iconwatsapp-iconfb-icon
ఇల్లు కట్టలేం!పాత్రునివలసలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు

జిల్లాలో ప్రహసనంలా గృహ నిర్మాణం
నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్లు
ఏ మూలకూ చాలని రూ.1.80 లక్షలు
అతీగతీ లేని ఆప్షన్‌-3
విముఖత చూపుతున్న లబ్ధిదారులు
మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

‘పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు కట్టి అందిస్తామని ప్రకటించిందని.. ప్రభుత్వం ప్రకటించిన ఆప్షన్ల ప్రాప్తికి ఎందుకు ఇళ్లు కట్టించి ఇవ్వడం లేద’ని ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎంపీపీ ప్రశ్నించారు. అటువంటప్పుడు మూడు ఆప్షన్లు ఎందుకు ప్రకటించారని నిలదీశారు. ఇందుకు జడ్పీ సమావేశం వేదికైంది. సాక్షాత్‌ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రశ్నించడంతో సమావేశానికి హాజరైన మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారై ఉండి అలా ప్రశ్నించకూడదన్నారు. కానీ ఇళ్ల నిర్మాణంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. జిల్లాలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం చెప్పినదొకటి.. చేస్తున్నదొకటి. దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పేదల సొంతటి కల సాకారం చేసేందుకు ఇంటి స్థలాలతో పాటు నిర్మాణానికి సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు మూడు ఆప్షన్లు ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసింది. లబ్ధిదారుడే తన డబ్బులతో ఇంటిని నిర్మించుకుంటే బిల్లును చెల్లించడం ఒక ఆప్షన్‌, ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌, ఇతరత్రా గృహనిర్మాణ సామగ్రి అందించడం రెండో ఆప్షన్‌,  ప్రభుత్వమే ఇంటిని నిర్మించి లబ్ధిదారునికి అప్పగించడం మూడో ఆప్షన్‌. దీంతో ఎక్కువ మంది లబ్ధిదారులు మూడో ఆప్షన్‌కే మొగ్గు చూపారు. కానీ ప్రభుత్వంపై భారపడుతుందో ఏమో కానీ ప్రభుత్వం నుంచి ఈ ఆప్షన్‌ విషయంలో ఎటువంటి కదలిక లేకపోయింది. దీంతో లబ్ధిదారుల వ్యయప్రయాసలకోర్చి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకుగాను 83,456 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఇందులో పూర్తయినవి కేవలం 7,523 మాత్రమే. బీబీఎల్‌ స్థాయిలో 35,542 ఇళ్లు, బీఎల్‌ స్థాయిలో 9,778 ఇళ్లు, రూఫ్‌లెవల్‌లో 4,656 ఇళ్లు ఉన్నాయి. ఇళ్లు మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వలంటీరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఆప్షన్లను ఎంపిక చేయించారు. అయితే ఎక్కువ మంది ప్రభుత్వం నిర్మించి ఇచ్చే మూడో ఆప్షన్‌నే ఎంచుకున్నారు. అటు లేఅవుట్ల స్థలం నివాసానికి ఆమోదయోగ్యంగా లేకపోవడం, కనీసం మెటీరియల్‌ తరలించేందుకు రవాణా సదుపాయం లేకపోవడం, ప్రభుత్వం అందించే మొత్తం ఏమూలకు చాలకపోవడంతో తదితర కారణాలతో ఎక్కువ మంది విముఖత చూపారు. ప్రభుత్వమే కట్టిస్తే తీసుకోవాలని భావించారు. ఆప్షన్‌ ఎంచుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా లబ్ధిదారులే ఇళ్ల నిర్మాణం జరుపుకోవాలని ఒత్తిడి చేయడంతో చాలామంది ఇష్టం లేకపోయినా పనులు ప్రారంభించారు. దాని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం లక్ష్యంపై పడుతోంది. చాలా లేఅవుట్లలో అసలు పనులే ప్రారంభించిన దాఖలాలు లేవు.

తాజాగా అధికారులకు బాధ్యతలు?
అటు లబ్ధిదారులకు, ఇటు ప్రభుత్వానికి మధ్య యంత్రాంగం సతమతమవుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల నుంచి నిలదీతలు ఎదురుకావడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇంటి నిర్మాణం ప్రారంభించాలని లబ్ధిదారులను కోరుతుంటే.. ససేమిరా అంటున్నారు. ఇంత తక్కువ మొత్తంతో ఇల్లు కట్టుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిర్థిష్ట లక్ష్యాన్ని విధిస్తోంది. పెరిగిన భవన నిర్మాణ సామగ్రితో ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అందించే రూ.1.80 లక్షలు ఏ మూలకూ సరిపోదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి నిర్మాణానికి కనిష్టంగా రూ.5 లక్షలు అవసరం. కానీ ప్రభుత్వం అందులో సగం కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలామంది బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ వారు కూడా స్వల్పంగానే రుణాలు మంజూరు చేస్తున్నారు. దీంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో ఇళ్ల నిర్మాణం ప్రహసనంలా మారింది. దీంతో అధికారులకే ఆ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీంతో అధికారవర్గాల్లో కలవరపాటు కనిపిస్తోంది.

చురుగ్గా ఇళ్ల నిర్మాణం
జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆప్షన్‌-3 ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఆమదాలవలసలో 1,777, శ్రీకాకుళంలో 5,071, ఎచ్చెర్లలో 157 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాం. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా గృహ నిర్మాణ సామగ్రి అందిస్తాం.
-గణపతిరావు, హౌసింగ్‌ పీడీ, శ్రీకాకుళం

గృహ నిర్మాణాలు దారుణం : కలెక్టర్‌ శ్రీకేష్‌ ఆగ్రహం
కలెక్టరేట్‌, ఆగస్టు 10:
‘జిల్లాలో గృహ నిర్మాణాలు దారుణంగా ఉన్నాయి.  60 శాతం ఇళ్లు పునాదుల స్థాయికే పరిమితమయ్యాయి. ముఖ్యంగా ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ అర్బన్‌ ప్రాంతాలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం గృహ నిర్మాణాల్లో అత్యంత వెనుకబడి ఉన్నాయి.’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 83 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం 34 వేల గృహాల పనులే ప్రారంభం కావడంపై అసహనం వ్యక్తం చేశారు.  గృహ నిర్మాణాల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఉత్తర్వులు మంజూరు చేసినా కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు కాకపోవడంపై మండిపడ్డారు. ఏడాదిన్నర కావుస్తున్నా 60 శాతం ఇళ్లు ఇంకా పునాదుల స్థాయిలోనే ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బూర్జ మండలం చీడివలస లేఅవుట్‌లో అప్రోచ్‌ రోడ్డు కోసం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జిల్లాలో 379 లేఅవుట్లలో ప్రగతి బాగానే ఉందన్నారు. వారంలో మరో 5 వేల గృహాలు పూర్తికావాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని వారి పట్టాలను రద్దు చేసి ఇతరులకు అందజేయాలన్నారు.  లిఖిత పూర్వకంగా లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేశారు. బూర్జ, సోంపేట, సంతబొమ్మాళి, సరుబుజ్జిలి, కంచిలి, జి.సిగడాం, తదితర మండలాల్లో  ప్రగతి కనబర్చాలని సూచించారు. పనులు పూర్తయినప్పటికీ బిల్లులను అధికారులు  అప్‌లోడ్‌ చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎటువంటి బిల్లులు పెండింగ్‌లో ఉండరాదని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో గృహా నిర్మాణ సంస్థ పీడీ ఎం.గణపతిరావు, సహాయ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.