బెల్టుజోరు.. పల్లెబేజారు!

ABN , First Publish Date - 2022-04-22T06:39:52+05:30 IST

జిల్లాలోని పల్లెలు బెల్ట్‌షాపుల మద్యం జోరుతో బేజారవుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల జోరు కనిపిస్తోంది. మద్యం వ్యాపారులు గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్‌ షాపులను ఏర్పాటు చేస్తూ తమ వైన్‌ షాపుల నుంచే మద్యాన్ని తరలించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు.

బెల్టుజోరు.. పల్లెబేజారు!

గ్రామాల్లో యథేచ్ఛగా మద్యం అక్రమ విక్రయాలు   

సరిహద్దు గ్రామాల్లో విచ్చలవిడిగా మహారాష్ట్ర దేశీదారు  సరఫరా

కల్తీమయంతో చుట్టు ముడుతున్న వ్యాధులు     

బెల్ట్‌షాపుల నిర్వహణపై ఎక్సైజ్‌ శాఖ మౌనం 

బోధన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21: జిల్లాలోని పల్లెలు బెల్ట్‌షాపుల మద్యం జోరుతో బేజారవుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల జోరు కనిపిస్తోంది. మద్యం వ్యాపారులు గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్‌ షాపులను ఏర్పాటు చేస్తూ తమ వైన్‌ షాపుల నుంచే మద్యాన్ని తరలించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. అధిక అమ్మకాలు ఉన్న గ్రామాలపై కన్నేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మామూలుగానే తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లోని బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. 

ఫ బోధన్‌ చుట్టు పక్కల అధికంగా బెల్ట్‌షాపులు..

బోధన్‌ చుట్టు పక్కల అధికారికంగా ఐదు మద్యం దుకాణాలే ఉండగా.. అనధికారికంగా బెల్ట్‌షాపులు సుమారు 50 పైనే కొనసాగుతున్నాయి. ఉదయం వేళ వైన్స్‌లు తెరిచిఉండకపోవడంతో మందుబాబులు బెల్ట్‌షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మందు తాగడానికి ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. చూడటానికి నిత్యావసర సరుకుల దుకాణమో, కిరాణా, కూల్‌డ్రింక్‌ షాపో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలోని కిరాణ షాపుల్లో మద్యం విక్రయాలు నిత్యం మూడు పువ్వులు ఆరు కాయల్లా కొనసాగుతున్నాయి. అయితే మద్యం మత్తులో ఎటు వెళుతున్నారో తెలియక ప్రమాదాల బారిన పడినా పట్టించుకునే వారే కరువయ్యారు. అలాగే కల్తీ దేశీదారుతో అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఫ పట్టించుకోని అబ్కారీ శాఖ..

బెల్టు షాప్‌లపై అబ్కారీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బెల్టు షాప్‌ల దందాపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ బ్రాండ్‌ మద్యమైనా, చల్లని బీరు కావాలన్నా బెల్టు షాపుల్లో లభ్యమవుతోంది. బెల్టు షాపుల్లో ఇష్టారీతిన రేట్లు పెంచి మద్యాన్ని విక్రయించి ప్రజలను చిత్తు చేస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, పొద్దునా సాయంత్రం అనే తేడా లేకుండా నిత్యం బెల్టు షాపుల్లో మద్యం దొరుకుతూనే ఉంటుంది. దీంతో మద్యం ప్రియులు మస్తు మజా చేస్తున్నప్పటికీ కొంప మాత్రం కొళ్లేరవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ, గ్రామాల్లో గల్లీ గల్లీల్లో కిరాణా షాపులలో మద్యం విక్రయించే వాటిపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. బెల్టు షాపుల వల్ల తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో పాటు వీధిన పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఫ మహారాష్ట్ర సరిహద్దుల గుండా దేశీదారు 

మహారాష్ట్ర సరిహద్దుల గుండా దేశీదారు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏరులై పారుతోంది. ఇక్కడ క్వార్టర్‌ కనీసం రూ.200 ఉండగా మహారాష్ట్ర దేశీదారు రూ.70 ఉంది. దీంతో మహారాష్ట్ర నుంచి దేశీదారును అక్రమంగా సాలూర అంతర్జాతీయ చెక్కుపోస్టు గుండా, మంజీర నది పరివాహక ప్రాంతాల గుండా కందకుర్తి చెక్‌పోస్టుగుండా దేశీదారును తరలిస్తున్నారు. దేశీదారు తరలిస్తున్న వారిని ఎక్సైజ్‌ శాఖ అనేక సార్లు పట్టుకుని కేసులు నమోదు చేసినప్పటికీ నిత్యం దేశీదారు తరలించడం మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతోంది. మూడు పువ్వులు, ఆరుకాయలుగా దేశీదారు బోధన్‌, బోధన్‌ మండలం, ఎడపల్లి, రెంజల్‌ తదితర ప్రాంతాలల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఎక్సైజ్‌ బెల్టు షాప్‌ల అక్రమ దందాపై, మహారాష్ట్ర నుంచి వస్తున్న దేశీదారు అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

దేశీదారు అక్రమ రవాణాను అరికట్టాలి.. 

 ఫ షేక్‌బాబు, సీపీఐ నాయకులు 

దేశీదారు అక్రమ రవాణాను అరికట్టాలి. మహారాష్ట్రలో దొరికే దేశీదారు వల్ల ప్రజలు మద్యానికి బానిసవుతున్నారు. మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి గ్రామాల్లోని కిరాణా, తదితర షాపుల్లో దేశీదారును విక్రయిస్తున్నారు. దేశీదారు అక్రమ రవాణాను అరికట్టాలి.

బెల్టుషాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి..

 ఫ జయమ్మ, పెంటాఖుర్దు  

మండలంలోని గ్రామాల్లో వెలుస్తున్న బెల్టుషాప్‌లపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో పోటాపోటీగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. వీటిపై ఎక్సైజ్‌ అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలి. 

దేశీదారు అక్రమ రవాణాపై కఠిన చర్యలు.. 

 ఫ రూప్‌సింగ్‌, బోధన్‌ ఎక్సైజ్‌ సీఐ  

దేశీదారు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. మత్తు పదార్థాలు, గంజాయి సరఫరా చేసే వారి వివరాలు అందజేస్తే పకడ్బందీగా పట్టుకుంటాం.  

Updated Date - 2022-04-22T06:39:52+05:30 IST