Abn logo
Feb 25 2020 @ 04:50AM

ఆ పొగడ్తల మాటున..!

  • భళా అంటూనే మోదీకి బహుళత్వ పాఠాలు
  • మొతేరా సభలో ట్రంప్‌ వ్యూహాత్మక ప్రసంగం
  • పాక్‌ను పల్లెత్తు మాట అనకుండా స్పీచ్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ట్వీట్లలో పేర్కొన్నట్లు 10 లక్షల మంది ప్రజలు రాకపోయినప్పటికీ మోదీ చేసిన భారీ జన సమీకరణ డొనాల్డ్‌ ట్రంప్‌ను భారీగానే ఆకట్టుకుంది. ఎందుకంటే తన రాజకీయ ర్యాలీల్లో ఎక్కడా ట్రంప్‌ ఇంతటి ప్రజానీకాన్ని ఉద్దేశించి తన జీవితంలో ప్రసంగించలేదు. అందుకే మోదీని ఆత్మీయ సహచరుడిగా పేర్కొంటూ ఆకాశానికెత్తారు. అయితే ఆ ప్రశంసల మాటున సుతిమెత్తని హెచ్చరికలున్నాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ జాతీయవాదాన్ని ప్రశ్నిస్తూ- బహుళత్వం భారతావనికి ఆభరణమని చెప్పారు.  ‘వేల ఏళ్లుగా ఇక్కడ హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు పరస్పరం సామరస్యంగా మెలుగుతున్నారు. కలిసి ప్రార్థనలు చేసుకుంటున్న దేశమిది’ అని ఆయన చేసిన వ్యాఖ్య పరోక్షంగా సీఏఏ, ఎన్నార్సీలపై సాగుతున్న రగడను ఉద్దేశించి చేసినదేనని విశ్లేషకులు అంటున్నారు. చాయ్‌వాలా నుంచి ప్రధాని దాకా ఎదిగిన మోదీని ఎవరూ పొగడకుండా ఉండలేరని అంటూనే ఆయన మోదీని ‘మొండిఘటమనీ, ఆయనను ఒప్పించడం అంత సులువు కాదనీ’ పేర్కొన్నారు. వాణిజ్య ఆంక్షల సరళీకరణకు మోదీ అడ్డుపడుతున్నారని ట్రంప్‌ చేస్తున్న ట్వీట్లకు కొనసాగింపు ఈ వ్యాఖ్య ! 


మోదీ, ట్రంప్‌లిద్దరూ జాతీయవాదులే. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ట్రంప్‌ అధికారంలోకొస్తే, కశ్మీర్‌-పాక్‌లపై విమర్శల దాడితో, ప్రత్యక్ష దాడితో మళ్లీ పదవిలోకి రాగలిగారు మోదీ! ఎవరి ఎజెండా వారిది. హెచ్‌-1బీ వీసాలతో పాటు అమెరికా అనుసరిస్తున్న వలసవాద విధానాలు భారత్‌కు ఇబ్బందికరంగా మారాయన్న విషయం తెలిసి కూడా ట్రంప్‌- వాటిని పరోక్షంగా సమర్థించుకున్నారు. అతివాద ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని నిలువరించడానికి ఇది అవసరమన్నారు. విశేషమేమంటే ఈ వాదన మోదీకి కూడా కలిసొచ్చే అంశమే. ‘‘సరిహద్దులను కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికీ ఉంది’ అని కూడా ట్రంప్‌- మోదీ ప్రభుత్వ వైఖరిని తన మాటగా వినిపించారు. అయితే పాక్‌ను ఎక్కడా ట్రంప్ నేరుగా పల్లెత్తు మాట అనలేదు. ‘‘పాక్‌ సరిహద్దుల్లో తిష్టవేసిన ఉగ్రవాద తండాలపై చర్యలు తీసుకునే విషయమై మేం పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తున్నాం’’ అని చెప్పి ఊరుకున్నారు.


అయితే మోదీ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించడం ద్వారా ట్రంప్‌ కొంతవరకూ భారత అధినేతను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక మోదీ కూడా... అమెరికన్ల ఆరోగ్యానికి, సంతోషానికి ట్రంప్‌ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పొగిడారు. తద్వారా.. ఈ ఏడాది నవంబరులో జరిగే అమెరికా  అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని మోదీ పాజిటివ్‌గా ఆవిష్కరించారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇద్దరు నాయకులూ ఆలింగనం చేసుకోవడం ద్వారా తమ మధ్య ఎంత సాన్నిహిత్యముందో ప్రపంచానికి తెలియజెప్పడం లక్ష్యం. చైనా, పాక్‌లకూ ఇది ఓ సంకేతమని, ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతంలో ప్రాంతీయ బలీయ శక్తిగా భారత్‌ని అగ్రరాజ్యం గుర్తించడానికి ఇదో సందర్భమని వ్యాఖ్యానాలు వినవచ్చాయి. 

Advertisement
Advertisement
Advertisement