అభాగ్యులకు అందని ఆసరా

ABN , First Publish Date - 2022-05-22T05:05:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు అందక చాలామంది అర్హులైన అభాగ్యులు అవస్థలు పడుతున్నారు. ఆసరా పథకం ప్రారంభించక ముందు ఇద్దరు వృద్ధులకు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చేది.

అభాగ్యులకు అందని ఆసరా
వనపర్తి జిల్లా కేంద్రంలో పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు(ఫైల్‌)

పింఛన్‌దారు చనిపోతే భార్య లేదా భర్తకు బదిలీ కాని పింఛన్‌

2018 నుంచి అదే పరిస్థితి

65 ఏళ్లు నిండినా మంజూరు కాని కొత్త పింఛన్‌

మూడున్నరేళ్లుగా నెరవేరని 58 ఏళ్ల వారికి ఆసరా


వనపర్తి/గద్వాల, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు అందక చాలామంది అర్హులైన అభాగ్యులు అవస్థలు పడుతున్నారు. ఆసరా పథకం ప్రారంభించక ముందు ఇద్దరు వృద్ధులకు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చేది. ఆసరా పథకం అమలు తర్వాత టీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వం పింఛన్‌ను రెట్టింపు చేయడంతో ఇద్దరు వృద్ధుల్లో ఒక్కరికే పథకం వర్తింపజేశారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరోసారి పింఛన్‌ సొమ్మును రెట్టింపు చేశారు. అయితే పింఛన్‌ పొందుతున్న వారు మరణిస్తే ఉన్న భర్త లేదా భార్యకు పింఛన్‌ బదిలీ కావాల్సి ఉండగా, కావడం లేదు.


రెండు జిల్లాల్లో 10,203 మరణాలు..

గడిచిన మూడున్నరేళ్లుగా కొత్త ఆసరా పింఛన్లు మంజూరు కాకపోగా, మరణించిన వారి వృద్ధాప్య పింఛన్‌ వారి భర్త లేదా భార్యకు బదిలీ కావడం లేదు. అసలే తోడును కోల్పోయిన సదరు వృద్ధులు వచ్చే కనీస స్వాంతన అయిన పింఛన్‌ కూడా కట్‌ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో 10,203 మంది పింఛన్‌దారులు మరణించారు. అందులో 90 శాతం పింఛన్‌దారులు వృద్ధులే ఉంటారనే అంచనా ఉంది. మిగతా 10 శాతంలో వితంతువులు, వికలాంగులు, ఇతర ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు ఉంటారు. ఈ 90 శాతం పింఛన్‌దారుల్లో కనీసం 50 శాతానికిపైగా వారి భార్య లేదా భర్త జీవించి ఉన్నప్పటికీ వారికి కట్‌ అయిన పింఛన్‌ బదిలీ కావడం లేదు.

వనపర్తి జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు 6,945 మంది పింఛన్‌దారులు మరణించారు. వారు మరణించిన తర్వాత నెల నుంచి ఆటోమేటిక్‌గా పింఛన్‌ కట్‌ అయ్యింది. అందులో వారి భార్య లేదా భర్త జీవించి ఉంటే వారికి పింఛన్‌ బదిలీ కావడం లేదు. 

జోగుళాంబ గద్వాల జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు 10,464 పింఛన్లను తొలగించారు. అందులో చనిపోయిన వారు, అనర్హులు, శాశ్వతంగా వలస పోయిన వారు ఉండగా.. కేవలం మరణాల ద్వారా రద్దు అయిన పింఛన్లు సంఖ్య 3,258గా ఉంది. వీరిలో కూడా వృద్ధుల శాతమే అత్యధికంగా ఉంది. ఈ జిల్లాలో కూడా పింఛన్‌ బదిలీలు కావడం లేదు. మిగతా ఆసరా పింఛన్ల మంజూరు ఎలా ఉన్నప్పటికీ చనిపోయిన వృద్ధుల పింఛన్లు వారి భర్త/భార్య జీవించి ఉంటే వారికి వర్తింపజేయాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


అమలు కాని సీఎం హామీ

2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు బ్రేకు వేసింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ, చేనేత, కల్లుగీత కార్మికులకు కొత్త పింఛన్ల మంజూరు మూడున్నరేళ్లుగా కావడం లేదు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ 58 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేస్తామనే హామీ ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పటివరకు అర్హత సాధించిన వారి సంఖ్య వేలల్లో ఉంది. వనపర్తి జిల్లాల్లో 58 ఏళ్ల వయసు ఉన్న వారి సంఖ్య 28,225గా ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో 10,907 మంది ఉన్నారు. మొత్తంగా రెండు జిల్లాలో 58 ఏళ్లు నిండిన వారు 39,132 మంది ఉన్నారు. గత సంవత్సరం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ కూడా ఇప్పటివరకు అమలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పింఛన్‌ బదిలీతోపాటు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని అర్హులు డిమాండ్‌ చేస్తున్నారు. 


నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా

నా భర్త నారాయణరెడ్డి నాలుగేళ్ల క్రితం చని పోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పింఛ న్‌ తొలగించారు. నాకు ఇప్పించాలని నాలు గేళ్లుగా కనిపించిన అధికారులందరినీ అడుగుతున్నా పట్టించుకోవడం లేదు.

- పోతుల రత్నమ్మ, ఉండవల్లి, గద్వాల జిల్లా 


పింఛన్‌ రావడం లేదు

నా భర్త బాలయ్య నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వృద్ధాప్య లేదా వితంతువు పింఛన్‌ ఇస్తాన న్నారు. కానీ ఇవ్వడం లేదు. 

- నాగరాల బుచ్చమ్మ, కొత్తకోట, వనపర్తి జిల్లా

Updated Date - 2022-05-22T05:05:39+05:30 IST