అందని వైద్యం

ABN , First Publish Date - 2022-04-29T05:52:29+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే చికిత్స చేయించుకోవాలంటూ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తున్నా దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించకపోవడంతో ఉన్న వారిపైనే పని భారం పెరిగిపోయి ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు.

అందని వైద్యం

- ఎంత మంది మంత్రులు మారినా వైద్య సౌకర్యాల్లో మాత్రం రాని మార్పు

- ఇరుకుగా మారిన జిల్లా కేంద్ర ఆసుపత్రిని పట్టించుకునేవారే కరువు

- ఏళ్లు గడుస్తున్నా నత్తనడకనే ఎంసీహెచ్‌ పనులు

- జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద ఆసుపత్రుల్లో సమస్యల తిష్ఠ

- నేడు జిల్లాకు రానున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

- బాన్సువాడ దుర్కిలో నర్సింగ్‌ కళాశాల పనుల శంకుస్థాపన కు హాజరుకానున్న మంత్రి


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 28: ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే చికిత్స చేయించుకోవాలంటూ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తున్నా దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించకపోవడంతో ఉన్న వారిపైనే పని భారం పెరిగిపోయి ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. నూతన జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి ఎంతో మంది వైద్యఆరోగ్యశాఖ మంత్రులు మారి జిల్లాకు కనీసం ఒక్కసారి వచ్చి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప అమలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి లాంటి పఽథకాలు ప్రారంభించినప్పటి నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి, ఏరియా ఆసుపత్రులకు తాకిడి విపరీతంగా పెరిగింది. కానీ అందుకు తగ్గట్టుగా గైనిక్‌ వైద్యులు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పెరగడంతో అంతంత మాత్రంగానే సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి నిత్యం వివిధ మండలాలతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి సైతం వైద్యం కోసం పెద్ద సంఖ్యలో రోగులు, గర్భిణులు వస్తుండడంతో ఆసుపత్రి కిక్కిరిసిపోతోంది. ఆసుపత్రి ఇరుకుగా మారడం అందులోనే పలు విభాగాలను ఏర్పాటు చేస్తుండడంతో గర్భిణులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. ప్రసవాలు చేయడానికి, చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. ఇక ఎంసీహెచ్‌ పనులు మాత్రం సంవత్సరాల కొద్దిసాగుతునే ఉన్నాయి. ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే దాదాపు 60 శాతం జిల్లా కేంద్ర ఆసుపత్రిపై భారం తగ్గనుంది. ఇవేకాక జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద ఆసుపత్రుల్లో సైతం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నేడు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు బాన్సువాడలోని దుర్కిలో నర్సింగ్‌ కళాశాల పనుల శంకుస్థాపన చేసేందుకు వస్తుండగా జిల్లాలోని ఆసుపత్రుల ఇబ్బందులపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వేధిస్తున్న వైద్యుల కొరత

జిల్లా కేంద్ర ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది మాత్రం పెరగకపోవడం గమనార్హం. ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది సిబ్బంది ఉన్నారో ఇప్పుడు అంతేమంది సిబ్బంది ఉన్నారు. గైనిక్‌ వైద్యులు గర్భిణులకు సరిపడా లేకపోవడం ఉన్నవారు సైతం రోజుకు పదుల సంఖ్యలో ప్రసవాలు చేస్తుండడంతో ఓపీ చూసేందుకు, 8,9 నెలల గర్భిణులను పరీక్షించేందుకు గైనిక్‌ వైద్యులు లేరు. దీంతో ఉన్నవారిపైనే పని భారం పడుతుంది. గర్భిణుల తాకిడి పెరగడం సరిపడా గైనిక్‌ వైద్యులు లేకపోవడంతో మతా, శిశువుల మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. మరణాలు జరిగిన సందర్భంలో గైనిక్‌ వైద్యులపై కుటుంబీకులు బూతు పురాణం అందుకోవడం లేదంటే దాడులకు పాల్పడడం చేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా సిబ్బందిని అందించకపోవడంతో తమపై పనిభారం పడుతుందని అయినా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం మరికొంతమంది గైనిక్‌ వైద్యులను అందిస్తేనే సేవలు మరింత మెరుగ్గా అందే అవకాశాలు ఉంటాయని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆసుపత్రిలో 7 గురు గైనిక్‌ వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గైనిక్‌ వైద్యురాలు కావడంతో ఆమె సైతం 8,9 నెలల గర్భిణులను పరీక్షించడం, ప్రసవాలు సైతం చేస్తున్నారు. వీరేకాక బిచ్కుంద ఆసుపత్రి సీహెచ్‌సీగా మారి చాలా రోజులు అవుతున్నా అందులో 4 గురు వైద్యులతో పాటు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇంకా పీహెచ్‌సీ తరహాలోనే సిబ్బంది ఉన్నారు. జుక్కల్‌లో సైతం పీహెచ్‌సీ సీహెచ్‌సీగా మారినా ఇబ్బందులు మాత్రం అలాగే ఉన్నాయి. పిట్లం పీహెచ్‌సీ సీహెచ్‌సీగా మారినా పాత భవనంలో కొనసాగుతుండడంతో ప్రజలు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


నత్తనడకన సాగుతున్న ఎంసీహెచ్‌ పనులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో నిర్మాణం చేపడుతున్న ఎంసీహెచ్‌ పనులు సంవత్సరాల తరబడి సాగుతునే ఉన్నాయి. ఇటీవల మంత్రి హరీష్‌రావు ఎంసీహెచ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. రూ.10కోట్ల వరకు ఆసుపత్రి నిర్మాణానికి నిధులు రావాల్సి ఉండగా రూ.3 కోట్లను విడుదల చేశారు. ఆ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ, 30 పడకల రూం, లేబర్‌రూం, ఆపరేషన్‌ థియేటర్‌, పీఐసీయూలతో పాటు పలు విభాగాలు అక్కడికి తరలించే అవకాశం ఉంది. దాదాపు 60 శాతం ఈ విభాగం వల్లే ఆసుపత్రి మొత్తం నిత్యం వందల సంఖ్యలో గర్భిణులు, వారి బంధువులు, రోగులతో కిటకిటలాడుతుంది. కామారెడ్డికి జిల్లా కేంద్ర ఆసుపత్రికి కేవలం పెద్దన్న పేరు మాత్రమే ఇచ్చారే కానీ వసతుల కల్పన, వైద్యుల ఏర్పాటు చేయడం మాత్రం మరిచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్లారెడ్డిలో గైనిక్‌ వైద్యుల కొరత ఉందని ఇటీవల వచ్చిన రాష్ట్ర బృందానికి సైతం వైద్యసిబ్బంది తెలుపడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని ప్రజలకు చెబుతున్నా ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా గైనిక్‌ వైద్యులను మాత్రం ఏర్పాటు చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు గైనిక్‌ వైద్యుల కల్పనపై దృష్టిసారిస్తే తప్ప గర్భిణులకు ఇక్కట్లు తప్పేలాలేవు.

Updated Date - 2022-04-29T05:52:29+05:30 IST