అందని పరిహారం!

ABN , First Publish Date - 2022-05-16T04:42:57+05:30 IST

నల్లమల అటవీ ప్రాంతం, శ్రీశైలం రిజర్వ్‌ ఫారె్‌స్టలో ఆవాసాన్ని

అందని పరిహారం!
యాచారం మండలం తాడిపర్తి గ్రామ సమీపంలో లేగదూడ కళేబరాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ, సీఐ(ఫైల్‌)

  • చిరుతపులి దాడిలో తరచూ పశువుల మృత్యువాత
  • జీవనాధారం కోల్పోతున్న పశుపోషకులు 
  • ప్రభుత్వ సాయానికి రైతుల ఎదురుచూపులు


నల్లమల అటవీ ప్రాంతం, శ్రీశైలం రిజర్వ్‌ ఫారె్‌స్టలో ఆవాసాన్ని ఏర్పర్చుకున్న చిరుతపులి తరచూ యాచారం, కందుకూరు తదితర మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తోంది. రైతులు తమ పొలాల వద్ద కొట్టాల్లో కట్టేసి ఉంచిన పశువులను చంపేస్తోంది. ఇప్పటికే రెండేళ్ల కాలంలో పదుల సంఖ్యలో పాడి పశువులను, వాటి దూడలనూ చిరుత చంపి తిన్నది. అటవీ చట్టం ప్రకారం వన్యమృగాల దాడుల్లో చనిపోయే పశువులకు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. రైతుల  గోడును పట్టించుకోవడం లేదు. పశుపోషణతో ఉపాధి పొందే రైతులు వాటి మృతితో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే చిరుతను బంధించి తమకు, పశువులకు రక్షణ కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


యాచారం/కందుకూరు, మే 15: శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి తరచూ యాచారం, కందుకూరు మండలాల పరిధి పొలాల్లో తిరుగుతూ కొట్టాల్లో కట్టేసి ఉన్న  పశువులను చంపి తింటోంది. వన్యమృగం దాడిలో మరణించిన పశువుల యజమానులకు అటవీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. అయితే పరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నాన్చుతోంది. ప్రభుత్వం నుంచి పరిహారం అందక, చిరుత బారి నుంచి శాశ్వత రక్షణ కల్పించక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. చిరుతను బంధించేందుకు బోన్‌లు ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. యాచారం మండలం తాడిపర్తి, నానక్‌నగర్‌, పిల్లిపల్లి, కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామాల్లో చిరుత సంచరిస్తూ పశువులను చంపుతోంది. సాయిరెడ్డిగూడలో కొంగళ్ల రాములు, రామచంద్రయ్యల నాలుగు ఆవుదూడలను చిరుత చంపి ఏడాది దాటినా రైతులకు పరిహారం అందలేదు. తాడిపర్తిలో బైకని అంజయ్యకు చెందిన రెండు గేదె దూడలు, దొడ్డి యాదయ్యకు చెందిన ఆవు, జంగయ్యకు చెందిన మేకపోతు, పిల్లిపల్లిలో రామచంద్రయ్యకు చెందిన రెండు ఆవుదూడలను, నానక్‌నగర్‌లో అంజయ్యకు చెందిన మేకను చంపి తింది. చిరుతపులి చంపిన పశువుల వివరాలపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా పరిహారం ఇవ్వలేదు. మాడ్గుల, ఆమనగల్లు, ముద్విన్‌, కడ్తాల మండల పలు గ్రామాల్లోనూ చిరుతపులి దాడి చేసి పశువులను తిన్నది. రైతులకు మాత్రం పరిహారం అందలేదు. వారం క్రితం సాయిరెడ్డిగూడ, కుర్మిద్దల మధ్య అటవీ ప్రాంతంలో చిరుతపులి నెమలిని, అడవిపందులను చంపి తినడాన్ని రైతులు గుర్తించారు. 


పరిహారం ఇస్తరా.. లేదా?

నా పొలం అడవికి దగ్గర ఉంది. రెండేళ్ల క్రితం నా పంట పొలం వద్ద కట్టేసిన మూడు ఆవు దూడలను చిరుతపులి చంపి తింది. పరిహారం కోసం అన్ని రకాల రిపోర్టులు అటవీశాఖ అధికారులకు ఇచ్చిన. రెండేళ్ల సంది అధికారులను అడుగుతుంటే మా వద్ద లేదు.. సర్కార్‌ నుంచే పరిహారం అందాలని అని చెప్తుండ్రు. ఇంతకూ నాకు పరిహారం ఇస్తరా.. లేదో? అధికారులు చెప్పాలె.

- కొంగళ్ల రాములు, రైతు, సాయిరెడ్డిగూడ


ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే పరిహారం

జిల్లాలో చిరుతపులి చంపిన పశువుల యజమానులకు పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతులకు ఇస్తాం. మా చేతిలో ఏమీ లేదు. ప్రభుత్వం మా శాఖకు నిధులు ఇచ్చేంత వరకూ రైతులు సాయం అందించలేం.

- జానకిరాం, రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి



Updated Date - 2022-05-16T04:42:57+05:30 IST